పిసిసి అధ్యక్షుడి హోదాలో ఉండి మహేష్ కుమార్ గౌడ్ చేస్తున్న చిల్లర వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని మాజీ మంత్రి, బిఆర్ఎస్ ఎంఎల్ఎ హరీష్‌రావు పేర్కొన్నారు. సూటిగా ఎదుర్కొనే ధైర్యం లేక దిగజారుడు రాజకీయాలు చేయడం సిగ్గుచేటు అంటూ ఎక్స్ వేదికగా మండిపడ్డారు. విలువలకు తిలోదకాలు ఇచ్చి,సిఎం రేవంత్‌రెడ్డి బాటలోనే మీరూ నడుస్తున్నారని మహేష్‌కుమార్ గౌడ్‌ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. బట్ట కాల్చి మీద వేసినంత మాత్రానా అబద్దాలు, నిజం అయిపోవు అని పేర్కొన్నారు.
పెళ్ళి లోనో, చావు లోనో కలిసిన సందర్భాలే తప్ప ఆయన ఆరోపించినట్లు ఇతర పార్టీ నాయకులను గానీ, తమ పార్టీ నుంచి వెళ్లిన నాయకులను గాని ఎప్పుడూ తాను వ్యక్తిగతంగా కలిసింది లేదని అన్నారు. విలువలతో కూడిన రాజకీయాలు చేస్తాను తప్ప, మహేష్‌కుమార్ గౌడ్ లాగా చిల్లర రాజకీయాలు చేసి లబ్ధి పొందాలని చూడను అని పేర్కొన్నారు. ఇలాంటి ఆరోపణలు మానుకొని, స్థాయికి తగ్గట్లు వ్యవహరించాలని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలుపై దృష్టి పెట్టాలని మహేష్ కుమార్ గౌడ్‌కు హరీష్‌రావు సూచించారు.