దేశ చరిత్రలో యూరియా కోసం రైతులు ఇంతగా తిప్పలు పడ్డ పరిస్థితులు ముందెన్నడూ లేదని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎంఎల్‌ఎ హరీశ్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ చేతగాని, దద్దమ్మ పాలన వల్ల పంట పొలాల్లో ఉండాల్సిన రైతులు యూరియా కోసం నడిరోడ్ల వెంట బారులు తీరుతున్నారని, ఆధార్ కార్డు, పాస్ బుక్కులు చేత పట్టుకొని యూరియా బస్తా కోసం పడిగాపులు కాస్తున్నరని, పండుగ లేదు..పబ్బం లేదు..వాన లేదు..ఎండ లేదు, రాత్రి లేదు, పగలు లేదు క్యూలో నిలబడుతున్నరని, అలసి సొలసి పడిపోతున్నరని, ఓపిక లేక క్యూలో చెప్పులు, పాస్‌బుక్కులు, అట్ట డబ్బాలు, ఖాళీ సీసాలు, రాళ్లు పెట్టి రోజుల పాటు నిరీక్షిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘పత్తి పూత దశతో ఉందని, ఇప్పుడు యూరియా వేయకపోతే దిగుబడి రాదు’ అని ఒక రైతు. ‘వరి పొట్ట దశలో ఉందని, యూరియా చల్లకపోతే పంట వేసి వ్యర్థం’ అని మరొక రైతు పడుతున్న ఆవేదన చూస్తే గుండె తరుక్కుపోతున్నదన్నారు.
రాష్ట్రంలో నెలకొన్న యూరియా సంక్షోభానికి నిన్న సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్‌లో కట్టలు తెంచుకున్న రైతుల ఆగ్రహమే నిదర్శనమన్నారు. ప్రభుత్వ యంత్రాంగం మీద అసహనంతో జుట్లు పట్టుకొని కొట్టుకోవాల్సి రావడమే కాంగ్రెస్ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. ఎక్కడిక్కడ హైవేలెక్కి ధర్నాలు చేస్తున్న రైతన్నల ఆగ్రహ జ్వాలలే నిదర్శనమన్నారు. ఇది కాంగ్రెస్ తెచ్చిన సంక్షోభం, రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం వల్ల రైతన్నకు వచ్చిన సంక్షోభమన్నారు. యూరియా అడిగిన పాపానికి రైతుల చెంపలు చెల్లుమనిపించిన సోకాల్ ప్రజా పాలన ఇదని, 22 నెలల పాలనలో యావత్ తెలంగాణ రైతాంగాన్ని నడి రోడ్డు మీదకు ఈడ్చిన దుర్మార్గ పాలన ఈ కాంగ్రెస్ ప్రభుత్వానిది, రేవంత్ రెడ్డిదని ఎద్దేవా చేశారు. కెసిఆర్ పాలనలో సకాలంలో సరఫరా అయిన యూరియాను ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నారు? పాలకులు మారగానే పాలసీలు మారిపోతాయా? రైతుల కష్టాలు తీర్చని ప్రభుత్వం ఏండి ఏం లాభం?
Also Read: త్రిబుల్ ఆర్ రోడ్డు వద్దు మా భూములు మాకే కావాలి
తాజాగా అమెరికా నుంచి దిగుమతి అయ్యే పత్తిపై సుంకాన్ని ఎత్తివేయడంతో మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్లై బాధ పడుతున్నారని వెల్లడించారు. ఇక యూరియా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వైఖరి వల్ల రైతులు కంటి నిండా నిద్ర పోని పరిస్థితి నెలకొందన్నారు. ఇన్ని సమస్యలు రైతులను చుట్టుముడుతున్నా ఇక్కడి బిజెపి, కాంగ్రెస్ ఎంపిలకు ఉలుకు లేదు, పలుకు లేదన్నారు. 8 మంది బిజెపి ఎంపిలు, 8 మంది కాంగ్రెస్ ఎంపిలు ఉండి తెలంగాణకు చేస్తున్నది ఏమున్నదని, ఏమీ లేదని, శుష్క ప్రియాలు శూన్య హస్తాలు. పామాయిల్ పై దిగుమతి సుంకం తగ్గింపును ఉపసంహరించుకోవాలని, పత్తిపై ఎత్తివేసిన దిగుమతి సుంకాన్ని యదావిధిగా కొనసాగిం చాలని ఈ మేరకు ఎంపిలు కేంద్రం పై ఒత్తిడి చేయాలని డిమాండ్ చేశారు. సిఎం రేవంత్ రెడ్డి పనికి మాలిన డైవర్షన్ పాలిటిక్స్ మానుకొని, రైతాంగానికి అవసరమైన యూరియా సరఫరా చేయడంపై దృష్టి పెట్టాలని బిఆర్‌ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. లేదంటే యూరియా కోసం రైతుల పక్షాన ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.