రాష్ట్రంలో వడ్ల కొనుగోలు విషయంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎంఎల్‌ఎ హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట రూరల్ మండలం, ఇర్కోడ్ లోని ఐకెపి సెంటర్‌లో వర్షానికి తడిసి మొలకెత్తిన ధాన్యాన్ని బుధవారం ఆయన పరిశీలించి రైతులతో మాట్లాడారు. ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ వడ్ల కొనుగోలులో పూర్తిగా విఫలం అయిందని మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్టు రైతు పరిస్థితి ఉందన్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట కొనే దిక్కులేక రైతులు అవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి అప్పులు పుట్టడం లేదనదడం సిగ్గు చేటన్నారు. రేవంత్ రెడ్డి ఎక్కే విమానం దిగి విమానం తప్ప ఇప్పటికే 43 సార్లు డిల్లీ వెళ్ళి ఏం సాధించారని ప్రశ్నించారు. పాలన చేత కాకపోతే దిగిపోవాలని హితవు పలికారు.
హైదరాబాద్‌లో కూర్చొని రోజూ అందాల పోటీలపై రేవంత్ రెడ్డి రివ్యూలు చేస్తున్నారని మండిపడడ్డారు. అప్పులు తెచ్చి పంట పండిస్తే కొనే దిక్కులేరని, గన్నీ బ్యాగులు ఇచ్చే పరిస్థితిలో కూడా ప్రభుత్వం లేదని ఎద్దేవా చేశారు. కెసిఆర్ ఉన్నపుడు ఎప్పుడూ వడ్ల కొనుగోలులో ఇంత ఆలస్యం కాలేదని అన్నారు. ప్రస్తుతం రైతుల నుండి తరుగు పేరిట 5 కేజీల వడ్లు కట్ చేస్తున్నారని, ధాన్యం మొలకెత్తినా కూడా కొనే పరిస్థితి లేదన్నారు. -రెవెన్యూ అధికారులు పట్టించుకోవడంలేదని, కొనుగోలు కేంద్రాల్లో తిదిగి అక్కడి పరిస్థితులు తెలుసుకోవాలన్నారు. పంటలు దెబ్బతిన్న రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సుడా ఛైర్మన్ మారెడ్డి రవీందర్ రెడ్డి, మాజీ ఎంపిపి సత్యనారాయణ, మాజీ ఉపసర్పంచ్ స్వామి, బిఆర్‌ఎస్ నాయకులు, వార్డు మెంబర్‌లు తదితరులు పాల్గొన్నారు.