Sunday, July 27, 2025

చంద్రబాబుకు రేవంత్ పెద్ద కోవర్టు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : బనకచర్ల పేరుతో గోదావరి జలాలను తెలంగాణకు శాశ్వతంగా దూ రం చేసే కుట్రను చంద్రబాబు, రేవంత్ రెడ్డి అమలు చేస్తున్నారని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆరోపించారు. తెలంగాణ జల హక్కులకు పిండం పెట్టే ఆ కుట్రను ఆపడానికి కెసిఆర్ ఉన్నాడన్న సం గతిని చంద్రబాబు మర్చిపోవద్దని హెచ్చరించారు. మల్లాపూర్‌లోని విఎన్‌ఆర్ గార్డెన్స్‌లో శనివారం జరిగిన బిఆర్‌ఎస్ విద్యార్థి విభాగం(బిఆర్‌ఎస్‌వి) రాష్ట్ర స్థాయి సదస్సులో కెటిఆర్, మాజీ మంత్రులు, హరీష్‌రావు, జగదీష్‌రెడ్డి తదితరలు హాజరై బనకచర్లతో తెలంగాణ రాష్ట్రానికి జరిగే నష్టాన్ని వివరించా రు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ, తెలంగాణ జలాలు మనకు కాకుండా చేసే కేంద్రంలోని మోడీ ప్రభుత్వం గద్ద పాత్రను పోషిస్తుందని విమర్శించారు. సముద్రంలో కలిసే 3000 టిఎంసిల గో దావరి మిగులు జలాల్లో 950 టిఎంసిలను దామాషా ప్రకారం తెలంగాణకు కేటాయించిన తర్వాత ఎపిలో ఏ ప్రాజెక్టు కట్టుకున్నా తమకు అభ్యంతరం లేదని తెలిపారు.

అలాగే 1486 టిఎంసిల గోదావరి నికరజలాల్లో 968 టిఎంసిలను తెలంగాణకు ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. బనకచర్ల ప్రాజెక్ట్ ఆపేదాక తాము పోరాటం చేస్తామని ఉద్ఘాటించారు. తెలంగాణ గొంతు కోస్తుంటే చూస్తూ ఊరుకోవడానికి బిఆర్‌ఎస్ సిద్ధంగా లేదని హెచ్చరించారు. కాంగ్రెస్, బిజెపి, చంద్రబాబు నాయుడు కలిసి తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వ పతాక అయిన బిఆర్‌ఎస్‌ను లేకుండా చేయాలనుకుంటున్నారని ఆరోపించారు. కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న పదేళ్లు మాట్లాడడానికి కూడా భయపడ్డ తెలంగాణ వ్యతిరేకులు రేవంత్ రెడ్డి సిఎం కాగానే విర్రవీగుతూ మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొహబ్బత్ కా దుకాణ్ అంటూ రాజ్యాంగం పట్టుకుని దేశమంతా తిరుగుతున్న రాహుల్ గాంధీకి తెలంగాణలో రేవంత్ రెడ్డి సాగిస్తున్న విధ్వంసక పాలన కనిపించడం లేదా..? అని ప్రశ్నించారు. తెలంగాణలోని ప్రతీ వర్గాన్ని మోసం చేసిన కాంగ్రెస్ అరాచకాలపై బిఆర్‌ఎస్ పోరాడితేనే మూసీ ప్రక్షాళన, లగచర్ల, కంచె గచ్చిబౌలి అక్రమాలు ఆగాయని తెలిపారు.

మిత్తితో సహా చెల్లిస్తాం…పోలీసులకు కెటిఆర్ హెచ్చరిక
రాష్ట్రంలో పోలీసు వ్యవస్థఘోరంగా తయారైందని కెటిఆర్ మండిపడ్డారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న బిఆర్‌ఎస్ నాయకుల మీద అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్న రేవంత్ రెడ్డి కట్టు బానిసలైన పోలీసు అధికారుల పేర్లు రాసుకుని అధికారంలోకి వచ్చాక మిత్తీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు. పోలీసులు చేయాల్సిన పని ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. ఎవరూ సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారో కనుక్కోవడమే పోలీసుల పనిగా మారిందని విమర్శించారు. తెలంగాణ పోలీసులు రేవంత్ రెడ్డి కట్టు బానిసలుగా పనిచేస్తున్నారని మండిపడ్డారు.

అధికారం శాశ్వతం కాదని.. రేవంత్ బానిసలుగా పని చేస్తున్న ఒక్కో పోలీసు పేరు రాసి పెట్టుకోవాలని బిఆర్‌ఎస్ శ్రేణులకి పిలుపునిచ్చారు. కెసిఆర్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్ని లెక్కలు వడ్డీతో సహా కలిపి చెల్లిస్తామని హెచ్చరించారు. అన్ని ప్రభుత్వాలు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాయని.. తాము కూడా ట్యాపింగ్ చేస్తున్నామని సిఎం రేవంత్‌రెడ్డి ఒప్పుకున్నారని గుర్తుచేశారు. అధికారులు ట్యాపింగ్ చేస్తే చేయొచ్చని రేవంత్‌రెడ్డి అన్నారని చెప్పారు. కెసిఆర్ నాట్ల సమయంలో రైతుబంధు ఇస్తే… రేవంత్‌రెడ్డి ఓట్లప్పుడు ఇస్తున్నారని విమర్శించారు. మనకి సోషల్ మీడియా సపోర్ట్ తప్పా.. ఏ మీడియా సపోర్ట్ లేదని, సోషల్ మీడియాలో మన తడాఖా చూపెట్టాలని కెటిఆర్ పార్టీ శ్రేణులకు సూచించారు.

తెలంగాణపై కుట్రలు చేసేది కాంగ్రెస్, బిజెపి, టిడిపి పార్టీలే : హరీష్ రావు
ప్రతిపక్ష నాయకుడు కెసిఆర్‌ను తలుచుకోకుండా సిఎం రేవంత్ రెడ్డి ప్రసంగం ఉండదని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. బిఆర్‌ఎస్‌వి రాష్ట్ర స్థాయి సదస్సులో ఆయన మాట్లాడుతూ, ఏనాడు జై తెలంగాణ అనని వ్యక్తి రేవంత్ రెడ్డి అని,ఇప్పుడు జై డిల్లీ, జై సోనియా, జై మోదీ అంటున్నాడని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రాజీనామా చేయకుండా పారిపోయింది కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమకారులపై తుపాకీ పెట్టి రైఫిల్ రెడ్డిగా ఆయన మిగిలిపోయారని ధ్వజమెత్తారు. తెలంగాణ ద్రోహుల చరిత్ర రాస్తే చంద్రబాబు పేరు మొదలు ఆ తర్వాత రేవంత్ పేరు వస్తుందని అన్నారు.

కెసిఆర్ తెలంగాణ రాష్ట్రం పట్ల ఓ విజనరీ ఉన్న నాయకుడు అని వ్యాఖ్యానించారు. నీళ్లు, నిధులు, నియామకాలనే ఉద్యమ ట్యాగ్ లైన్‌తో గోదావరి, కృష్ణా జలాలను బీడు భూములకు మళ్లించిన అపర భగీరథుడు తమ కెసిఆర్ అని పేర్కొన్నారు. కానీ, ప్రస్తుతం నీళ్లు ఆంధ్రాకు, నిధులు రాహుల్ గాంధీకి వెళ్తున్నాయని విమర్శించారు. బిజెపి, కాంగ్రెస్,టిడిపి పార్టీలు కలిసి తెలంగాణపై కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు. నీటి దోపిడీపై ఆ కుట్రలను బద్దలు కొట్టాలని హరీష్ రావు అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News