Monday, July 7, 2025

గురుదక్షిణగా చంద్రబాబుకు 65 టిఎంసిలు.. రేవంత్‌ రెడ్డిపై హరీష్ రావు ఫైర్

- Advertisement -
- Advertisement -

ప్రభుత్వం స్పందించకపోతే రైతులతో వెళ్లి మోటార్లు ఆన్ చేస్తాం
తక్షణమే కన్నెపల్లి పంప్‌హౌస్ మోటర్లు ఆన్ చేసి రైతులకు నీళ్లు ఇవ్వాలి
పరిస్థితి తీవ్రస్థాయికి చేరకముందే కళ్లు తెరిచి రైతులకు సాగునీరు ఇవ్వాలి
-మాజీ మంత్రి హరీష్ రావు
మనతెలంగాణ/హైదరాబాద్ : కన్నెపల్లి, కల్వకుర్తి వద్ద మోటార్లను ఆన్ చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురి చేస్తోందని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీష్ రావు విమర్శించారు. నీటి విలువ తెలియని వాళ్లు పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. కెసిఆర్ మీద, బిఆర్‌ఎస్ మీద కోపంతో రైతులను ఇబ్బందికి గురి చేస్తున్నారని ఆరోపించారు. కన్నెపల్లి పంప్ హౌస్ ప్రారంభించి లక్షలాది ఎకరాలకు నీళ్లు అందించాలని డిమాండ్ చేశారు. వారం పది రోజుల్లో ప్రభుత్వం మోటార్లు ఆన్ చేయకపోతే రైతులతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. వెంటనే కన్నెపల్లి పంప్ హౌస్ మోటార్లు ఆన్ చేయాలని, కాళేశ్వరం కింద లక్షలాది ఎకరాలకు నీరు అందించాలని చెప్పారు. ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే కెసిఆర్ నాయకత్వంలో కదులుతామని, అన్ని జిల్లాల రైతులతో వెళ్లి కన్నెపల్లి మోటార్లు ఆన్ చేస్తామని హెచ్చరించారు. పరిస్థితి తీవ్రస్థాయికి చేరకముందే కళ్లు తెరిచి రైతులకు సాగునీరు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నీళ్లు ఇస్తే మంచిది.. మోటార్లు ఆన్ చేసి నీళ్లు ఎత్తిపోయకుంటే రైతులతో కదులుతాం…వారి ప్రయోజనాల కోసం ఎంతవరకైనా పోరాడతామని ఉద్ఘాటించారు. రాష్ట్ర, రైతుల ప్రయోజనాల కోసం పోరాటం చేస్తామని కెసిఆర్ చెప్పారని తెలిపారు. ఈ ప్రభుత్వాన్ని విడిచిపెట్టం అని, ప్రజాశక్తిలో ఉన్న బలం ఏంటో చూపిస్తామని హెచ్చరించారు. తెలంగాణ భవన్‌లో బిఆర్‌ఎస్ నేతలతో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ,నీళ్ల విలువ తెలిసిన నాయకుడు ముఖ్యమంత్రిగా ఉంటే ఆ నీళ్లను మలుపుకునే ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటారని, నీళ్ల విలువ తెలియని నాయకులు పాలకులుగా ఉండటం వల్ల తెలంగాణ ఇబ్బందులను ఎదుర్కొంటున్నదని అన్నారు.

ఈసారి కూడా ఆంధ్రకు నీళ్ళొదిలే ప్రయత్నం 
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కృష్ణాలో అతి తక్కువ నీళ్లు వాడుతుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వమే అని హరీష్‌రావు తెలిపారు. చంద్రబాబుకు గురుదక్షిణ కింద 65 టిఎంసిలను రేవంత్ రెడ్డి ఎపికి ధారా దత్తం చేశారని ఆరోపించారు. కృష్ణ నీళ్లను ఆంధ్రకు వదిలిపెట్టడమే ఈ ప్రభుత్వ లక్ష్యం అని విమర్శించారు. చంద్రబాబుతో రేవంత్‌కు ఉన్న చీకటి ఒప్పందం ఏంటి..? అని ప్రశ్నించారు. మహబూబ్‌నగర్ జిల్లాలో క్రాప్ హాలిడే ప్రకటించి ఆంధ్రలో మూడో పంటకు నీళ్లు వదిలారని, ఈసారి కూడా ఆంధ్రకు నీళ్ళొదిలే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మహబూబ్‌నగర్ జిల్లాలో కల్వకుర్తి ప్రాజెక్టు మోటర్లు ప్రారంభించక పోతే వేలాదిమంది రైతులతో ప్రాజెక్టు వద్దకి వెళ్లి మోటర్లు ఆన్ చేసే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. ముఖ్యమంత్రి పదే పదే పాలమూరు బిడ్డ అని పెద్ద మాటలు మాట్లాడుతున్నారని, కానీ పాలమూరు రైతుల కడుపు కొడుతున్నారని విమర్శించారు. శ్రీశైలంలో వరద 36 రోజుల కిందనే శ్రీశైలంలో వరద వచ్చిందని, ఇన్ని రోజులైనా ఇప్పటివరకు కల్వకుర్తి మోటర్లు ఆన్ చేయలేదని పేర్కొన్నారు.

రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు
కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో మంచి వర్షాలు పడుతున్నాయని, మన రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు ఉన్నాయని, సగటు కంటే తక్కువ వర్షపాతం నమోదయిందని చెప్పారు. రాష్ట్రంలో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు విత్తనాలు వేసే పరిస్థితి లేదని, వేసిన విత్తనాలు మొలకెత్తే పరిస్థితి లేదని తెలిపారు. చాలాచోట్ల ప్రాజెక్టుల కింద నారుమడ్లు పొయ్యాలా..వద్దా..అని ఆలోచిస్తున్నారని అన్నారు. భూగర్భ జలాలు రోజురోజుకీ అడుగంటుతున్నాయని, వర్షాభావ పరిస్థితులు ఇలాగే కొనసాగితే సాగునీటికే కాదు పలు జిల్లాల్లో త్రాగునీటికి కూడా ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో మంచి వర్షాలు కురవడం వల్ల కృష్ణ, గోదావరి నదుల్లో మే నెలలోనే వరదలు వచ్చాయని, ఈ వరదను ఒడిసి పట్టి రిజర్వాయర్లు, చెరువులు, చెక్ డ్యాములు నింపుకోవాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తున్నదని విమర్శించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం స్విఛ్చాఫ్ మోడ్‌లో ఉందని, నీళ్లను ఒడిసిపట్టడంతో నిర్లక్షంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. కాలం కాకపోయినా, వర్షం పడకపోయినా కృష్ణ, గోదావరి వరద నీళ్లను ఒడిసి పట్టుకుంటే రెండు పంటలకు నీరందించే అవకాశం ఉందని తెలిపారు. ఎక్కడికక్కడ ప్రాజెక్టులలో మోటర్లు ఆన్ చేసి రిజర్వాయర్లు, చెక్ డాములు, చెరువులు నింపుకునే అవకాశం ఉందని చెప్పారు. ముఖ్యమంత్రి, మంత్రులు బిఆర్‌ఎస్‌పై బురద జల్లడంలో పోటీపడుతున్నారని, తమపై నీలాప నిందలు వేయడంలో బిజీగా ఉన్నారని మండిపడ్డారు. కరువును పారదోలేటటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును కెసిఆర్ మీద కక్షతోని కడుపుమంటతోనే కాంగ్రెస్ పార్టీ కాదనుకుంటున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమపై కోపం ఉంటే తమపై కక్ష సాధించాలని, రైతులకు ఎందుకు శిక్ష వేస్తున్నారని నిలదీశారు.

కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిరోజు ఏ నదిలో ఎంత నీళ్లు వస్తున్నాయని చూసి అధికారులను, నాయకులను అప్రమత్తం చేసేవారని గుర్తు చేశారు. జూరాలలో వరదొస్తే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నాయకులకు, ఇంజనీర్లకు ఫోన్లు చేసి మోటర్ల ఆన్ చేయాలని, నీళ్లను నింపుకోవాలి అని చెప్పేవారని తెలిపారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వరద వచ్చి నెల రోజులు దాటినా మోటార్లను ప్రారంభించలేదని మండిపడ్డారు. కళ్ళ ముందు నీళ్ళు పోతుంటే పట్టించుకోని ప్రభుత్వం తీరు క్రిమినల్ నెగ్లిజెన్సీ కిందికి వస్తుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రజల అవసరాలను, రాష్ట్ర అవసరాలను విస్మరించి కళ్ళముందు నీళ్లు కనిపిస్తున్నా మీకు చలనం లేదని అన్నారు. మేడిగడ్డ బ్యారేజీ మొత్తం గేట్లు తెరచి ఉన్నా కన్నెపల్లి పంప్ హౌస్ మోటర్లు ఆన్ చేసి నీళ్లు తీసుకునే అవకాశం ఉందని తెలిపారు. మేడిగడ్డలో రెండు పిల్లర్లు కుంగినాయని ప్రాజెక్టుని పడావు పెట్టారని, కన్నెపల్లి పంప్ హౌస్ నుండి నీళ్లు తీసుకునే అవకాశం ఉందని ఇంజనీర్లే చెబుతున్నారని పేర్కొన్నారు. అయినా ప్రభుత్వం కావాలని మోటర్లు ఆన్ చేయకుండా రైతులను గోసపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రోజుకు రెండు టిఎంసిల నీళ్లను కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి తెచ్చుకునే అవకాశం ఉందని అన్నారు. నది లేనటువంటి చోట రంగనాయక సాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్, బస్వాపూర్ ఇలా దాదాపు 141 టిఎంసిల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్లను కెసిఆర్ ప్రభుత్వం నిర్మించి రెడీగా పెట్టిందని, పంప్ హౌస్‌లు ఉన్నాయి.. సబ్ స్టేషన్లు ఉన్నాయి.. రిజర్వాయర్లు ఉన్నాయని పేర్కొన్నారు. నీళ్లు ఎత్తుకోవడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏమిటి..? అని ప్రశ్నించారు. ఈ రిజర్వాయర్లలో నీళ్లు నింపి పెట్టుకుంటే లక్షల ఎకరాల్లో రెండు పంటలు పండే అవకాశం ఉంటుందని తెలిపారు.

ఎన్‌డిఎస్‌ఎ ఒక కాళేశ్వరం పైనే పనిచేస్తుందా?
మేడిగడ్డ నుంచి 73,600 క్యూసెక్కుల ప్రవాహం ఉందని, నీటిని తీసుకునే అవకాశం ఉన్నా.. ఎందుకు తీసుకోవట్లేదని హరీష్‌రావు ప్రశ్నించారు. నీటిని ఎత్తిపోసేందుకు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని అడిగారు. ఇప్పుడు కాళేశ్వరం మోటర్లు ప్రారంభిస్తే 15 జిల్లాలకు నీళ్లు ఇచ్చే అవకాశం ఉందని చెప్పారు. వెంటనే కాళేశ్వరం మోటర్లు ప్రారంభించి రిజర్వాయర్లు నింపి రైతులకు మొదటి పంటకు నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం కింద రైతులు నారుమళ్ళు పోయాలా.. వద్దా అనే అయోమయంలో ఉన్నారని పేర్కొన్నారు. మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతులు చేయడానికి ప్రభుత్వం ఎందుకు ఆలోచిస్తోందని నిలదీశారు. కుంగిన రెండు పిల్లర్లకు మరమ్మత్తులు చేయమంటే ప్రభుత్వం 19 నెలల నుంచి కాలయాపన చేస్తుందని మండిపడ్డారు. మేడిగడ్డకి మరమ్మత్తులు చేయాలని, కన్నెపల్లి పంప్ హౌస్ ప్రారంభించి నీళ్లు ఎత్తిపోసి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలని కోరారు. ఎన్‌డిఎస్‌ఎ దేశం మొత్తం పనిచేస్తుందా.. ఒక కాళేశ్వరం పైనే పనిచేస్తుందా…? అని ప్రశ్నించారు. పోలవరంలో డయాఫ్రంవాల్ కొట్టుకుపోతే అక్కడికి ఎన్‌డిఎస్‌ఎ ఎందుకు పోలేదని ప్రశ్నించారు.

ఐదు రోజుల్లో తెలంగాణకు వచ్చి నివేదికలు ఇస్తారు కానీ ఐదు సంవత్సరాలైనా పోలవరం విషయంలో స్పందించరని అన్నారు. కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి బంధానికి ఇది నిదర్శనం అని ఆరోపించారు. బిజెపి, కాంగ్రెస్ కలవకపోతే ఎస్‌ఎల్‌బిసి కుప్పకూలి దాని భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారితే ఎందుకు ఎన్‌డిఎస్‌ఎ వెళ్లలేదని నిలదీశారు. ఎన్‌డిఎస్‌ఎ పేరుతో కాళేశ్వరం విషయంలో ఎందుకు కాలయాపన చేస్తున్నారని అడిగారు. ఎస్‌ఎల్‌బిసికి ఒక న్యాయం కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు ఒక న్యాయమా..? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సగటు రైతుగా ఆలోచించి మేడిగడ్డతో సంబంధం లేకుండా మోటార్లు ఆన్ చేసి నీళ్లు ఇవ్వాలని కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టు అక్షయ పాత్ర లాంటిదని, దాన్ని తక్కువ చేసి చూపించడం, కాళేశ్వరాన్ని పక్కకు పెట్టి రాజకీయాలు చేయాలని మీరు అనుకుంటే రైతులు క్షమించరని హరీష్‌రావు అన్నారు.

కెటిఆర్ చర్చకు రమ్మంటే.. రేవంత్ ఢిల్లీకి వెళుతున్నారు
రైతుల సంక్షేమంపై మంగళవారం(జులై 8) కెటిఆర్ సిఎం రేవంత్‌రెడ్డిని చర్చకు రమ్మన్నారని ఆయన ఢిల్లీకి వెళుతున్నారని హరీష్‌రావు ఆరోపించారు. తన సవాల్ గురించి ఏమైనా అంటే ఢిల్లీలో ఉన్నా చెప్పొచ్చని అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News