ప్రాజెక్టుపై చర్చే జరగలేదంటూ సిఎం నోట అబద్ధాలు
ఎజెండాలో మొదటి అంశమే బనకచర్ల అని..దానిపై చర్చించామని ఎపి మంత్రే తెలిపారు
రేవంత్ చీకటి ఒప్పందం తేటతెల్లం
భేషరతుగా తెలంగాణ ప్రజానీకానికి క్షమాపణ చెప్పాలి
కమిటీకి కట్టుబడి ఉంటామని రేవంత్ ఎలా హామీ ఇస్తారు
హరీశ్‌రావు ఫైర్
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో నడుస్తున్నది కాంగ్రెస్ పాలన కాదు.. బిజెపి, టిడిపి రిమోట్ పాలన అని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీష్‌రావు ఆరోపించారు. ఢిల్లీలో జరిగిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో బనకచర్ల ప్రాజెక్టుపై చర్చ జరగలేదని సిఎం రేవంత్‌రెడ్డి అబద్ధం చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎజెండాలో మొదటి అంశం బనకచర్లనే అని, దానిపై చర్చించాం..పరిష్కారానికి కమటీ వేశామని ఎపి మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారని అన్నారు. రేవంత్, ఉత్తమ్‌ల మీడియా సమావేశం కంటే ముందే ఎపి మంత్రి బనకచర్ల ప్రాజెక్టుపై కమిటీ వేశామని ప్రకటించారని చెప్పారు. కానీ రేవంత్ రెడ్డి ఏమో అసలు బకనచర్లపై చర్చనే జరగలేదని అంటున్నారని మండిపడ్డారు.
బనకచర్ల అంశం నేటి ఎజెండాలో లేనప్పుడు ఆపమనే ముచ్చటే రాదు అని రేవంత్ రెడ్డి బుకాయించారని, కానీ అజెండాలో మొట్ట మొదటి అంశం గోదావరి బనకచర్ల ప్రాజెక్టు అని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి చీకటి ఒప్పదం తేటతెల్లం అయ్యిందని ఆరోపించారు. లోపల జరిగింది దాచి, ప్రజలకు బాహాటంగా అబద్దాలు చెప్పినందుకు తెలంగాణ ప్రజలకు రేవంత్ భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బనకచర్లపై మీటింగ్ పెడితే కలిసేదే లేదు అని లీకులు ఇచ్చి రేవంత్‌రెడ్డి పరుగు పరుగున మీటింగ్ కోసం ఢిల్లీకి వెళ్లారని మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో బుధవారం బిఆర్‌ఎస్ నేతలతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ, సిఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు గురుదక్షిణ చెల్లించేందుకు రేవంత్‌రెడ్డిని తెలంగాణ ప్రజలు ఎన్నుకోలేదని అన్నారు.
రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికి ప్రజలు ఆయనను ఎన్నుకున్నారని తెలిపారు. బనకచర్ల వివాదంపై ఏర్పాటు చేయబోయే కమిటీ ఏది చెబితే అదే చేస్తానని రేవంత్‌రెడ్డి ఎలా ఒప్పుకుంటారని ప్రశ్నించారు. చంద్రబాబు చేతుల్లో ఉన్న కేంద్రం, కమిటీ చేత తెలంగాణ నీటి జలాలు ఎపికి అప్పగిస్తే అంగీకారం తెలియజేస్తారా..? అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు అభ్యంతరం తెలిపిన బనకచర్లపై కమిటీకి అంగీకరిస్తూ రేవంత్ ఎలా సంతకం చేస్తారని నిలదీశారు. తెలంగాణకు అన్యాయం జరిగితే బిఆర్‌ఎస్ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. రాష్ట్రంలో పేరుకే రేవంత్ పాలన అని, నిజానికి తెలంగాణలో చంద్రబాబు చెప్పినట్టే జరుగుతోందని ఆరోపించారు. పవర్‌పాయింట్ ప్రజంటేషన్‌లో తెలంగాణ జలాలు కాపాడే వివరణ ఇవ్వకుండా, ఎపిని విమర్శించకుండా రేవంత్‌రెడ్డి చంద్రబాబును పొగుడుతూ కెసిఆర్‌ను తిట్టే పని పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం ఉన్నపుడే టెలిమెట్రీ ఇన్‌స్టాల్ చేసిందని, దాంటో కాంగ్రెస్ చేసిన గొప్ప ఏంటని నిలదీశారు. కెసిఆర్‌ను తిట్టడం తప్ప ఏడాదిన్నరలో కాంగ్రెస్ చేసింది ఏమి లేదని మండిపడ్డారు.
తెలంగాణ పాలిట రేవంత్ రెడ్డి మరణ శాసనం రాశారు
సెంట్రల్ వాటర్ కమిషన్, జిఆర్‌ఎంబి, పోలవరం ప్రాజెక్టు అథారిటీలు బనకచర్ల ప్రీ ఫీజబులిటి రిపోర్టును తిరస్కరించాయని, పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పడ్డ సంస్థలు నిర్ద్వంద్వంగా అనుమతులు తిరస్కరించాయని హరీష్‌రావు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు తిరస్కరించాక కేంద్రం ఎలా సమావేశం పెట్టిందని నిలదీశారు. రాష్ట్ర విభజన చట్టం, జీఆర్‌ఎంబీ, అపెక్స్ అనుమతి ఇవ్వకుండా బనకచర్లను రిటర్న్ కొడితే, దానికి రేవంత్ రెడ్డి కమిటీపై సంతకం పెట్టడం ఏమిటి..? అని ప్రశ్నించారు.తెలంగాణ పాలిట రేవంత్ రెడ్డి మరణ శాసనం రాశారని ఆవేదన వ్యక్తం చేశారు. కెసిఆర్ ఉన్నంత కాలం, బిఆర్‌ఎస్ ఉన్నంత కాలం తెలంగాణకు అన్యాయం జరిగితే సహించేది లేదని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి అంటే తెలంగాణ ద్రోహి అని,కానీ పక్కన ఉన్న ఉత్తమ్ చేస్తున్నారని అడిగారు.
బిజెపి, కాంగ్రెస్ రెండు పార్టీలు తెలంగాణకు ద్రోహం చేస్తున్నాయని మండిపడ్డారు.చంద్రబాబు, బిజెపితో ఉన్న బాయి బాయి రాజకీయాలపై, ఒప్పందాలపై రేవంత్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు తీరని ద్రోహం చేసిన వ్యక్తి, పాలమూరును వ్యతిరేకించిన వ్యక్తిని రాష్ట్ర సలహాదారుగా ఎలా పెట్టుకుంటారని అడిగారు. కాంగ్రెస్ నామినెటెడ్ పోస్టుల్లోనూ బాబు మాటలు రేవంత్ శిరసా వహిస్తున్నారని ఆరోపించారు. అఖిల పక్షం డిల్లీకి తీసుకుకోవాలని గతంలోనే తాము డిమాండ్ చేశామని గుర్తు చేశారు. తమకు బేషజాలు లేవు అని, తమకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం అని స్పష్టం చేశారు.
రేవంత్‌ను చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుంది
ఊసరవెల్లి కూడా రేవంత్‌ను చూసి సిగ్గుపడుతుందని హరీష్‌రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో జరుగనున్న సిఎంల సమావేశాన్ని బాయ్ కాట్ చేస్తామని లీకులు ఇచ్చి, ఆయన ఎందుకు డిల్లీకి వెళ్లారని ప్రశ్నించారు. అర్ధరాత్రి జరిగిన చీకటి ఒప్పందం ఏమిటి..? అని నిలదీశారు. గతంలో కూడా నీతి అయోగ్ మీటింగ్‌కు వెళ్లను అని అసెంబ్లీలో చెప్పి తర్వాత నీతి అయోగ్ సమావేశానికి హాజరయ్యారని గుర్తు చేశారు. కెటిఆర్ ప్రెస్‌క్లబ్‌లో చర్చకు రావాలని సవాల్ విసిరితే రేవంత్ రెడ్డికి మొహం చాటేశారని హరీష్‌రావు విమర్శించారు. క్లబ్లులకు, పబ్బులకు రాను అని సిఎం బిల్డప్ ఇచ్చారని, కానీ బుధవారం రేవంత్ రెడ్డి సెవన్ స్టార్ హోటల్ లీలా ప్యాలెస్‌లో ప్రెస్‌మీట్ పెట్టారని అన్నారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్ ఉంటుంది, సిఎం అధికారిక నివాసం ఉంటుందని, అక్కడ ప్రెస్‌మీట పెట్టకుండా సెవన్ స్టార్ హోటల్‌లో సిఎం ప్రెస్‌మీట్ పెట్టారని విమర్శించారు. రేవంత్ మాటలకు చేతలకు పొంతన ఉండదని హరీష్‌రావు విమర్శించారు.