ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. గోబెల్స్‌ను మించిపోయారని బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ, మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. రేవంత్ రెడ్డి మాటలు వింటే అబద్ధాలు సైతం ఆత్మహత్య చేసుకుంటాయన్నారు. మూసీకి ఎల్లంపల్లి శ్రీపాదసాగర్ నీళ్లు వస్తున్నాయని రేవంత్ పచ్చి అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు. కెసిఆర్ కట్టిన కాళేశ్వరం నీళ్లతోనే సిఎం రేవంత్ రెడ్డి.. మూసీ ప్రాజెక్టును చేపట్టారని చెప్పారు. కాళేశ్వరం ప్రాజక్టులో భాగంగానే మల్లన్నసాగర్‌కు నీళ్లు వస్తున్నాయన్నారు తెలిపారు. కెసిఆర్ నిర్మించిన మల్లన్నసాగర్ హైదరాబాద్‌కు వరంగా మారిందని స్పష్టం చేశారు. నిజాలు ఒప్పుకుని.. ప్రజలకు క్షమాపణలు చెప్పాలంటూ సిఎం రేవంత్ రెడ్డిని ఆయన డిమాండ్ చేశారు.
అన్నీ వదిలేసి.. నడి బజారులో నిలబడినట్లుగా ముఖ్యమంత్రి తీరు ఉందంటూ నిప్పులు చెరిగారు. కెసిఆర్ నిర్మించిన ప్రాజక్టులకు రిబ్బన్లు కట్ చేయటానికి.. జేబులో కత్తెర పెట్టుకుని రేవంత్ రెడ్డి తిరుగుతున్నారంటూ ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి కుర్చీకి ఉన్న గౌరవాన్ని రేవంత్ రెడ్డి తగ్గిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్‌లో మంగళశారం మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, బిఆర్‌ఎస్ నేతలతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ, ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్‌కు నీళ్లు తెస్తామన్న సిఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై స్పందించారు. మేడిపండు చూడు మేలిమై ఉండును పొట్ట విప్పి చూడు పురుగులు ఉండును అన్నట్టు రేవంత్ రెడ్డి నోరు విప్పితే అబద్ధాలు తప్ప ఏం లేదని రుజువయిందని దుయ్యబట్టారు.
ఎల్లంపల్లిని మా హయాంలోనే పూర్తి చేశాం
తాము అధికారంలో ఉన్నప్పుడే ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌ఉను పూర్తి చేశామని హరీష్‌రావు తెలిపారు. సోమవారం రేవంత్ రెడ్డి ప్రారంభించిన ట్యాంకులు కెసిఆర్ హయాంలో ప్రారంభించినవి అని పేర్కొన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు తామే కట్టామంటున్నారని, వారిలాగా చిన్నగా ఆలోచించి పేర్లు మార్చాలని తాము అనుకోలేదని అన్నారు. టిఆర్‌ఎస్ వచ్చిన తర్వాత నీటిపారుదుల శాఖ మంత్రిగా తానే ఉన్నానని, ఎల్లంపల్లి ప్రాజెక్టు హై లెవెల్ బ్రిడ్జి, ఆర్‌అండ్‌ఆర్ పూర్తి కాలేదని చెప్పారు. భూ సేకరణ పూర్తి కాలేదని, గ్రామ ప్రజలను ఖాళీ చేయించలేదని అన్నారు. టిఆర్‌ఎస్ వచ్చిన తర్వాత ఎల్లంపల్లి ప్రాజెక్టును 2052 కోట్లతో పూర్తి చేసి 2016లో పూర్తిస్థాయిలో 20 టిఎంసిల నీళ్లు నింపామని వెల్లడించారు. రేవంత్‌రెడ్డి లాగా తాము చిల్లర రాజకీయాలకు పోలేదని, సోమవారం సిఎం చేసిన శంకుస్థాపనకు కూడా తాము నిర్మించిన కాళేశ్వరం నీళ్లనే తీసుకెళ్తున్నారని అన్నారు.
ఎల్లంపల్లి కెపాసిటీ 20 టిఎంసిలు అని అందులో డెడ్ స్టోరేజ్ మూడు టిఎంసిలు అని, మిగిలిన 17 టిఎంసిల్లో సొంత ఆయకట్టు 1,65,000 ఎకరాలు అంటే 12 టిఎంసిలు పోతాయని చెప్పారు. ఎన్‌టిపిసి విద్యుత్ ఉత్పత్తికి ఆరున్నర టిఎంసిలు అని, మంచిర్యాల నియోజకవర్గంలో గూడెం లిఫ్ట్‌కు మూడు టీఎంసీలు అని చెప్పారు. లోకల్లో రామగుండం లిఫ్ట్‌కు ఒక టిఎంసి వాడుకుంటామని, దానికి సామర్ధ్యం కంటే ఎక్కువ ఇప్పటికీ వాడుతున్నామన్నారు. సిఎం రేవంత్‌రెడ్డి ఎల్లంపల్లి కెపాసిటీకి మించి మరో 20 టిఎంసిలు హైదరాబాద్‌కి ఎలా తెస్తారని ప్రశ్నించారు. గండిపేట దగ్గర కొబ్బరికాయ కొట్టారంటే ఆ గండిపేటకు హిమాయత్ సాగర్‌కి వచ్చే నీళ్లు కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు అని పేర్కొన్నారు. కాళేశ్వరం అంటే మూడు బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, 21 పంప్ హౌస్‌లు, 98 కిలోమీటర్ల ప్రెజర్ మెన్,
203 కిలోమీటర్ల టన్నెలు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్ అని, ఈ 15 రిజర్వాయర్లలో ఒక రిజర్వాయర్ మల్లన్న సాగర్ అని,అది కాళేశ్వరంలో అంతర్భాగం అని వ్యాఖ్యానించారు. ఎల్లంపల్లి నుండి మల్లన్న సాగర్‌కు నీళ్లు గాలిలో వస్తున్నాయా..? అని నిలదీశారు. ఎల్లంపల్లిలో మేడారం దగ్గర మోటర్లు ఆఫ్ చేస్తే మేడారం రిజర్వాయర్లో పడతాయని, లక్ష్మీ పంప్ హౌస్ ఆన్ చేస్తే వరద కాలువలో పడతాయని చెప్పారు. అక్కడి నుంచి మిడ్ మానేరుకు నీళ్లు వస్తాయని, అక్కడి నుంచి అనంతగిరి రిజర్వాయర్‌కు వస్తాయని తెలిపారు. అక్కడ నుండి రంగనాయక సాగర్‌కు, అక్కడి నుంచి మళ్లీ మోటార్ ఆన్ చేస్తే మల్లన్న సాగర్‌కు వస్తాయని వివరించారు. ఎల్లంపల్లి నుండి మిడ్ మానేరు దాకా కూడా కెనాల్స్ గాని, గ్రావిటీ కెనాల్ కానీ, రిజర్వాయర్లు గాని, సబ్ స్టేషన్లు గాని, పంప్ హౌస్‌లు అన్ని నిర్మించింది బిఆర్‌ఎస్ ప్రభుత్వమే అని పేర్కొన్నారు.
మల్లన్నసాగర్ కట్టొద్దని రేవంత్‌రెడ్డి దీక్ష చేశారు
మల్లన్నసాగర్ కట్టొద్దని 2016లో రేవంత్‌రెడ్డి దీక్ష చేశారని హరీష్‌రావు అన్నారు. మల్లన్న సాగర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కట్టారని అంటున్నారని, 2009లో వైఎస్‌ఆర్ మల్లన్న సాగర్ కడితే 2016లో రేవంత్‌రెడ్డి దీక్ష ఎందుకు చేశారని ప్రశ్నించారు. తమ హయాంలో మల్లన్న సాగర్‌లో నష్టపోయిన బాధితులకు 250 గజాల స్థలంలో డబుల్ బెడ్‌రూమ్ ఇల్లను కట్టించామని చెప్పారు. రేవంత్‌రెడ్డి మూసీలో ఇళ్లు కోల్పోయిన కుటుంబాలకు కెసిఆర్ కట్టించిన డబుల్ బెడ్‌రూమ్‌లను ఇచ్చారని అన్నారు. 2008లో కేంద్రానికి డిపిఆర్ పంపితే 2012లో డిపిఆర్‌ను తిప్పి పంపారని చెప్పారు. కెసిఆర్ ప్రభుత్వం సాధించిన విజయాలను కూడా రేవంత్‌రెడ్డి తన విజయంగా చెప్పుకుంటారని విమర్శించారు.
రేవంత్‌రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా కెసిఆర్ ఒక దీక్షతో మల్లన్న సాగర్ కట్టారని, ఆ మల్లన్న సాగర్ ఇప్పుడు హైదరాబాద్‌కు, రైతులకు ఒక వరంగా మారిందని వ్యాఖ్యానించారు. ఇంకా కొన్ని రోజులైతే సెక్రటేరియట్‌కి కూడా పునాదిరాళ్లు తానే మోసానని రేవంత్‌రెడ్డి అంటాడేమో అని పేర్కొన్నారు. అమరవీరుల స్థూపానికి కూడా తానే మేస్త్రి అని అంటారని, జిల్లాల్లో కట్టిన కలెక్టరేట్లను కూడా కాంగ్రెస్ కట్టిందని అంటే కూడా ఆశ్చర్యపోవాల్సిందే లేదని, ఎక్కువ మాట్లాడితే చార్మినార్ కూడా తన తాత కట్టిండు అని చెప్పుకుంటారని విమర్శించారు. అధికార మదంతోనో, ధన బలంతోనో తిమ్మినిబమ్మిని చేద్దామని చూస్తే జనం సహించరు అని, జనం బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు.