తెలంగాణకు బిజెపి ఏమాత్రం న్యాయం చేయలేదు సరికదా.. పూర్తిగా అన్యాయం చేసిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎంఎల్‌ఎ హరీశ్‌రావు విమర్శించారు. రంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గంలోని న్యాలకల్ మండలం, రత్నాపూర్ గ్రామం నుండి 50 మంది బిజెపి నాయకులు, కార్యకర్తలు హైదరాబాద్ లో ఎంఎల్‌ఎ మాణిక్ రావు ఆధ్వర్యంలో హరీశ్ రావు సమక్షంలో బిఆర్‌ఎస్‌లో చేరారు. మాజీ ఎంపిటిసి దేశీటి పటేల్, రవి కుమార్, మాజీ సర్పంచ్, సీనియర్ నాయకులు తుకారాం, భాస్వరం, సంగశీటి, సంజీవ్, అమృత్ బిఆర్‌ఎస్‌లో చేరిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు బిఆర్‌ఎస్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా వారిని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో డిసిఎంఎస్ ఛైర్మన్ శివకుమార్, బిఆర్‌ఎస్ స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ..
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో పూర్తిగా విఫలమైందని పేర్కొన్నారు. బిఆర్‌ఎస్ ప్రారంభించిన బసవేశ్వర సంగమేశ్వర ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టిందని ఆరోపించారు. జహీరాబాద్ నియోజకవర్గానికి అన్యాయం చేసింది కాంగ్రెస్ అని మండిపడ్డారు. సంగారెడ్డి జిల్లా అభివృద్ధిని కాంగ్రెస్ నిర్లక్ష్యం చేస్తోందని పేర్కొన్నారు. సంగమేశ్వర ప్రాజెక్టు పూర్తయితే జిల్లా మొత్తం సాగు నీటితో సస్యశ్యామలం అవుతుందని అన్నారు. బసవేశ్వర ప్రాజెక్టు పూర్తి చేయడానికి తమ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పారు. తాగు, సాగు నీరు కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. బిఆర్‌ఎస్ ఉన్నపుడు వచ్చిన నీళ్ళు.. ఇప్పుడు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. పాలనా వైఫల్యం, కాంగ్రెస్ నిర్లక్షం ప్రజలకు శాపంగా మారాయని, ప్రజలకు కాంగ్రెస్ మోసం తెలిసిపోయిందని అన్నారు. మళ్ళీ వచ్చేది బిఆర్‌ఎస్ ప్రభుత్వమేనని, తెలంగాణ అభివృద్ధి తమ పార్టీతోనే సాధ్యమవుతుందని అన్నారు.