Wednesday, April 30, 2025

హార్వర్డ్‌పై ట్రంప్ దాడా?

- Advertisement -
- Advertisement -

కొన్ని వార్తలు నమ్మశక్యం కాకుండా ఉంటాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జనవరి 20న బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి గత 85 రోజులుగా తీసుకుంటున్న చర్యలు అసాధారణమైనవి కావటం, వాటి ప్రభావాలతో బయటి ప్రపంచమే గాక అంతర్గతంగా ఆయన దేశం కూడా తీవ్రమైన సమస్యలకు గురవుతుండటం తెలిసిందే. ఈ పరిస్థితులు కుదుటపడే అవకాశం కనుచూపు మేరలో తోచటం లేదు సరికదా, మరింత కల్లోలానికి దారితీయ వచ్చునన్నది ఇంటా, బయటా నిపుణులందరి నుంచి వినవస్తున్న అభిప్రాయాలు. ట్రంప్ చర్యలలో పరిశ్రమలు, ఉత్పత్తులు, దిగుమతులు, సుంకాలు, ఆదాయాలు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు, ప్రకృతి వనరులూ, ఖనిజాల సేకరణ వంటివి ఒక కోణం. తమను చైనా ఎట్టి పరిస్థితులలో మించిపోరాదన్న ఆధిపత్య కోణం రెండవది.

ఇజ్రాయెల్ ఎన్నెన్ని దుర్మార్గాలకు పాల్పడినా పశ్చిమాసియా ప్రాంతంలో తమ అనుచర దేశంగా కొనసాగాలనే రిపబ్లికన్, డెమోక్రటిక్ ద్వైపాక్షిక విధానాన్ని యథాతథంగా నిలబెట్టటం మూడవది. ఇవన్నీ కూడా అమెరికా పెట్టుబడిదారీ, సామ్రాజ్యవాదాల పరిధిలోకి వస్తాయి. అమెరికా మొదటి నుంచి అనుసరిస్తున్న ఇవే విధానాలను ట్రంప్ ఏ పద్ధతిలో అనుసరించ జూస్తున్నారన్నది ప్రశ్న. కాని, పద్ధతిలో తేడా తప్ప మౌలికంగా లక్షాలలో, విధానాలలో తేడాలు లేవు. అందువల్ల ట్రంప్‌ను అదే పరిధిలో భిన్నమైన విధంగా వ్యవహరిస్తున్న నాయకునిగా అర్థం చేసుకోవాలి. ఆయన చర్యలు వల్ల బయటి ప్రపంచంతోపాటు అమెరికాకు కలుగుతున్న నష్టాలు కనిపిస్తున్నవే గాని అది వేరే చర్చ.

అదే సమయంలో మనకొక నమ్మలేని స్థితి కూడా కనిపిస్తున్నది. అది ఏ విధంగా అర్థం చేసుకోవాలన్నా అర్థం కాకుండా ఉన్నది. ఆ చర్చను హార్వర్డ్ యూనివర్సిటీపై అమెరికా అధ్యక్షుని దాడితో ఆరంభిద్దాం. హార్వర్డ్ మొత్తం ప్రపంచంలోనే ఎప్పటి నుంచో ప్రథమ స్థానంలో ఉంటున్న విద్యా సంస్థ. చదువులు, పరిశోధనలు, ఆస్పత్రుల నిర్వహణ వంటి అనుబంధ రంగాలకు, స్వేచ్ఛాయుత వాతావరణానికి, పూర్తి స్వయం ప్రతిపత్తికి పేరు బడినటువంటిది. ప్రపంచమంతటా గౌరవ ప్రతిష్ఠలు గలది. ఉపాధ్యాయులలో, విద్యార్థులలో, మేధావులకు, వక్తలకు, గ్రంథకర్తలకు నిలయమైనది. దాదాపు 380 సంవత్సారాల ప్రాచీనమైనది. స్వయంగా 53 బిలియన్ డాలర్ల ట్రస్ట్ నిధులు యూనివర్శిటీకి ఉన్నాయి. ఈ వివరాలను బట్టి దాని బలమేమిటో, స్థాయి ఏమిటో అంచనా వేయవచ్చు. అటువంటి సంస్థ జోలికి వెళ్లాలంటేనే ఎవరైనా జంకుతారు. ఇంత సుదీర్ఘకాలంలో ఎవరూ అందుకు సాహసించలేదు సరికదా, అందరూ గౌరవించారు.

అటువంటిది ఇపుడు మొదటి సారిగా, డొనాల్డ్ ట్రంప్ హార్వర్డ్ పై ఎటువంటి జంకుగొంకు లేకుండా దాడికి సాహసించారు. దానికదే ప్రపంచ వ్యాప్తంగా ఒక పెద్ద వార్త కాగా, ట్రంప్ ఒత్తిళ్లకు లొంగే ప్రసక్తి లేదంటూ యూనివర్శిటీ అధ్యక్షుడు అలాన్ ఎం. గార్బర్ స్పష్టంగా ప్రకటించటం అంతే పెద్ద వార్త అయింది. చైనాపై ఒత్తిళ్లు, వారు లొంగబోమనటం ఆర్థిక వ్యవహారం. కాని అమెరికా అభివృద్ధికి మూలస్తంభాలలో ఒకటైన విద్యారంగాన్ని లొంగదీసే ఆలోచనలేమిటి?ఇంతకూ ఈ వివాదానికి మూలం ఎక్కడుంది? అది హార్వర్డ్‌తో మొదలుకాలేదు. మూలం గాజా పాలస్తీనా సమస్యలో ఉంది. పాలస్తీనా సమస్య, గాజాలో ఇజ్రాయెల్ మారణకాండల గురించి తెలిసిందే. ఆ దారుణానికి నిరసనగా అమెరికాలోని అనేక యూనివర్శిటీలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు నిరసన ప్రదర్శనలు చేస్తూ పోయారు.

మారణకాండ ఆగాలని, పాలస్తీనా దేశాన్ని గుర్తించాలని డిమాండ్ చేసారు. 60 ఏళ్లనాటి వియత్నాం యుద్ధానికి వ్యతిరేకంగా ఇవే యూనివర్శిటిల విద్యార్థుల హింసాత్మక నిరసలకు తలపడగా, ప్రస్తుత నిరసనలు పూర్తి శాంతియుతంగా జరిగాయి. అయినప్పటికీ ట్రంప్ ప్రభుత్వం ఎంతమాత్రం సహించలేకపోయింది. అంతకన్న గమనించదగినదేమంటే, ఇజ్రాయెల్‌తో గల యూదుల లాబీకి పూర్తిగా భరించలేనిదయింది. స్వయంగా ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహూ ఈ విషయమై పట్టుబట్టారు. యథాతథంగా అమెరికాకు చెందిన రిపబ్లికన్, డెమోక్రటిక్ పార్టీలు రెండూ తమ సామ్రాజ్యవాద ప్రయోజనాలకోసం ఇజ్రాయెల్ ద్వారా పశ్చిమాసియాలో అనుసరిస్తున్న విధానాలు తెలిసినవే. ఇవన్నీ ఒకదానికొకటితోడు కావటంతో ట్రంప్ దాడి అసలు అన్ని విద్యాసంస్థలపై మొదలై ఇపుడు హార్వర్డ్‌కు చేరింది.

వివిధ విద్యాసంస్థలకు వ్యతిరేకంగా చర్యలు వేర్వేరు రూపాలలో సాగాయి. నేరుగా విద్యార్థుల అరెస్టు, వారి వీసాలు రద్దు చేసి తమ దేశాలకు పంపి వేయటం, వారి అడ్మిషన్లు రద్ధు చేయవలసిందిగా యూనివర్శిటీలపై ఒత్తిడి, నిరసన ప్రదర్శనలపై నిషేధం, హాస్టళ్ల నుంచి ఖాళీ చేయించటం, ఇక నుంచి అడ్మిషన్లపై పలు నియంత్రణలు, స్కాలర్ షిప్‌ల రద్దు, ముస్లిం దేశాల నుంచి వచ్చే వారిపై ప్రత్యేక ఆంక్షలు, బలహీన వర్గాలకు చెందిన నల్లవారిని, లాటినోలను చదువులో ప్రోత్సహించేందుకు యూనివర్శిటీలు ప్రవేశపెట్టిన పథకాలకు నిధుల నిలిపివేత, అదంతా నిధుల వృథా అనటం, జాతులూ శరీర వర్ణాన్ని బట్టి వివక్ష చూపుతున్నారనే కుత్సితమైన వాదనలు, ఈ రకరకాలు ఆంక్షలకు ఉపాధ్యాయులను, సిబ్బందిని సైతం గురి చేయటం, ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా వ్యవహారించని వారి గురించి యూనివర్శిటీలు స్వయంగా హోం శాఖకు, పోలీసులకు ఫిర్యాదు చేయాలన్న ఆదేశం వైవిధ్యత సమానత్వం సమ్మిళితత్వం’ (డైవర్శిటీ ఈక్వాలిటీ ఇంక్లూజన్, లేదా డిఇఐ) పేరిట చట్ట విరుద్ధతను ప్రవేశపెడుతున్నారనే ఆరోపణలు మొదలైనవి విద్యా సంస్థలకు ఊపిరాడకుండా చేస్తున్నాయి. మునుముందు మరేమి జరుగుతుందో తెలియదు.

ట్రంప్ టారిఫ్‌ల యుద్ధం, ఉక్రెయిన్, గాజా పరిణామాలతో విద్యారంగ వార్తలు బయటి ప్రపంచానికి అంతగా తెలియటం లేదు గాని, అమెరికాకు టారిఫ్‌ల యుద్ధంతో ఏ లాభం జరిగినా జరుగకున్నా ఈ విద్యా రంగ యుద్ధంతో మాత్రం మౌలికమైన స్థాయిలో దీర్ఘ కాలిక నష్టాలు జరగనున్నాయన్నది ఈ రంగంతో సంబంధం గల నిపుణుల ఆందోళన. అమెరికా బలానికి గల మూలస్తంభాలలో విద్య, పరిశోధనలు, శాస్త్రసాంకేతిక రంగాలు ఒకటి. కనుకనే వాటికి అక్కడి ధనికులు, సంస్థలు, ప్రభుత్వాలు భారీ మొత్తంలో విరాళాలు ఇస్తుంటాయి. హార్వర్డ్ విషయమైనా అంతే. ఈ రంగం అంతిమంగా అమెరికా శాస్త్ర సాంకేతిక పరిశోధనలకు, బలానికి, సంపన్నతకు, ప్రపంచాన్ని మేథోపరంగా ప్రభావవంతం చేసేందుకు ఉపయోగపడుతుంది. అక్కడి యూనివర్శిటీ సమాజాల స్వతంత్ర ఆలోచనలు, ఆందోళనలు, ధోరణులు కూడా అందులో భాగమే. ఈ విషయాన్ని ముఖ్యంగా ప్రజాస్వామిక వ్యవస్థలు ప్రభుత్వాలు, అర్థం చేసుకోవాలి.

చివరకు ట్రంప్ ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ (మాగా) లక్షం అయినా అ విధంగా నెరవేరవలసిందే తప్ప, గొప్పతనానికి సుంకాల డబ్బు ఆర్జించటం ఒక్కటే మార్గమని భావించటం సరైన అవగాహన లేకపోవటం, సంకుచిత దృష్టి అవుతుంది. అందువల్ల మరింత హాని కలుగుతుంది.ట్రంప్ తమ విద్యా సంస్థలకు ఇప్పటికే గత రెండు మాసాలలో చాలా హాని చేసారు. యథతథంగా అసలు ప్రభుత్వ విద్యా శాఖనే రద్దు పరచే కార్యక్రమం మొదలుపెట్టారు. ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్’ (ఐసిఇ) పేరిట గల నిఘా సంస్థను క్యాంపస్‌లలో, బయటా తిప్పి పెద్ద సంఖ్యలో విద్యార్థులను, ఇతరులను నిర్బంధించారు. అది ఇంకా సాగుతున్నది. సెమిటిక్ లేదా యూదు జాతికి వ్యతిరేక కార్యకలాపాలు సాగిస్తున్నాట్లు వారిపై, వారి విద్యాసంస్థలపై ఆరోపణలు చేస్తున్నారు. ప్రభుత్వం ఆదేశించినట్లు నడుచుకోకపోతే ఆయా సంస్థలకు కేంద్ర నిధులు ఆపివేయగలమంటూ ఇప్పటికే ఆ పని మొదలుపెట్టారు.

తాజాగా హార్వర్డ్‌కు సుమారు రెండు బిలియన్ల డాలర్లను ఆ యానివర్శిటీ అధ్యక్షుడు తాము తమ స్వేచ్ఛను కాపాడుకుంటాము తప్ప లొంగే ప్రసక్తి లేదని జవాబిచ్చిన వెంటనే రద్దు చేసారు. మరొక ఎనిమిది బిలియన్లు కూడా ఆపే అవకాశం ఉందన్న వార్తలు వెలువడుతున్నాయి. ఈ బెదిరింపులు అమెరికాలో అతి శ్రేష్ఠమైనవని పరిగణించే ఇల్వీలీగ్ యూనివర్శిటీలకు అందులో భాగంగా కొలంబియా, జాన్ హాస్కిన్స్, న్యూయార్క్ సిటీ యూనివర్శిటీ, ఎంఐటి, మిషిగన్, పెన్సిల్వేనియా వంటి సంస్థలకు, మొత్తం సుమారు వంద కాలేజీలకు నోటీసులు అందటంతో వాతావరణం ఏవిధంగా మారి ఉంటుందో ఇక్కడినుంచి ఊహించటం కూడా కష్టమే. మొదట కొలంబియా యూనివర్శిటీపై ఇటువంటి చర్యలే తీసుకోగా వారు ఒత్తిడిని తట్టుకోలేక ప్రభుత్వం చెప్పిన షరతులకు అంగీకరించారు. దానితో అందరి దృష్టి హార్వర్డ్ వైపు మళ్ళగా వీరు ధిక్కరించటంతో అంతటా ఒకేసారి ఉత్సాహం, ధైర్యం కన్పించింది. ‘బిగ్ 10’ అనబడే మరికొన్ని ప్రముఖమైన విశ్వవిద్యాలయాలు ధిక్కరించటం మొదలైంది.

మొత్తం మీద, హార్వర్డ్ ధిక్కారానికి ముందు ట్రంప్ మాట్లాడుతూ, “మేము ఈ కాలేజీల విషయం ఏం చేస్తున్నామో చూడండి. వాళ్లంతా మోకరిల్లుతూ సర్, చాలా థ్యాంక్స్ మీరు చేసేది బాగున్నది అంటున్నారు” అన్నారు. తర్వాత హార్వర్డ్ అధ్యక్షుడు అలానే గార్బర్ ఒక బహిరంగ లేఖ రాస్తూ, ఏ పార్టీ ప్రభుత్వమైనా సరే ప్రైవేట్ యూనివర్శిటీలు ఏమి బోధించాలి, ఏ విద్యార్థులను చేర్చుకోవాలి, ఏ సిబ్బందిని నియమించుకోవాలి. ఏ పరిశోధనలు జరపాలి అనే విషయాలు ఆదేశించజాలవు. ప్రభుత్వం చేస్తున్నది మొత్తం హార్వర్డ్ సమాజాన్ని నియంత్రించ చూడటం. యూనివర్శిటీ తన స్వాతంత్య్రాన్ని ప్రభుత్వాధీనం చేయబోదు, రాజ్యాంగ హక్కులను వదలుకోబోదు” అని ప్రకటించారు. అదే లేఖను ట్రంప్ ప్రభుత్వానికి లాయర్ల ద్వారా పంపారు. ఇంతా అయినాక ప్రభుత్వం విచిత్రమైన సాకులు వెతకటం మొదలుపెట్టింది. క్యాంపస్ కార్యకలాపాల వల్ల పశ్చిమాసియా శాంతికోసం తాము చేస్తున్న ప్రయత్నాలకు భంగం వాటిల్లుతుందట. నిజమే, ఇజ్రాయెల్, అమెరికాలు కలిసి నరమేధం ద్వారా సాగిస్తున్న శాంతి యజ్ఞానికి భంగం వాటిల్లే ప్రమాదం లేకపోలేదనుకోవాలి!

– టంకశాల అశోక్ ( దూరదృష్టి) (రచయిత సీనియర్ సంపాదకీయులు)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News