దేశంలోని మూడో అతి పెద్ద స్పోర్ట్స్ లీగ్ అయిన ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్) తమ ఫ్రాంచైజీ హైదరాబాద్ బ్లాక్ హాక్స్ (హెచ్‌బీహెచ్), వర్సిటీ స్పోర్ట్స్ సంస్థతో కలిసి స్కూల్ వాలీబాల్ లీగ్‌కు శ్రీకారం చుట్టింది. పాఠశాల స్థాయిలోని క్రీడాకారులకు వాలీబాల్ ఆడేందుకు ఒక వేదిక కల్పించడంతో పాటు ఈ క్రీడ వైపు పిల్లలను ఆకర్షించడానికి పీవీఎల్-హెచ్‌బీహెచ్ వర్సిటీ వాలీబాల్ లీగ్‌ను నిర్వహిస్తున్నట్టు హైదరాబాద్ బ్లాక్ హాక్స్ జట్టు యజమాని కంకణాల అభిషేక్ రెడ్డి వెల్లడించారు. దేశంలో లీగ్ ఫార్మాట్‌లో నిర్వహిస్తున్న తొలి వాలీబాల్ లీగ్ ఇదేనని అభిషేక్ తెలిపారు. ఐదు వారాల పాటు జరిగే ఈ లీగ్‌లో 32 బాలుర, 19 బాలికల జట్లు మొత్తంగా 50 టీమ్‌లు బరిలోకి దిగుతున్నాయి. ఈనెల 16 నుంచి వచ్చే సెప్టెంబరు 28వ తేదీ వరకు హైదరాబాద్ వేదికగా ఈ లీగ్ జరగనుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో పూర్తి ప్రొఫెషనల్ విధానంలో
ఈ పోటీలను నిర్వహిస్తున్నాం. వాలీబాల్‌ను కెరీర్‌గా ఎంచుకోవాలనే వర్ధమాన క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఈ లీగ్‌ను రూపకల్పన చేశాం. యువ క్రీడాకారుల్లోని ప్రతిభ, ఉత్సాహం, నైపుణ్యాలను వెలికి తీసేందుకు ఈ లీగ్ ఉపయోగపడనుంది అని అభిషేక్ తెలిపారు. తాను స్కూల్ స్థాయిలో వాలీబాల్ ఆడేందుకు ఇలాంటి లీగ్స్ లేకపోవడంతో ప్రాక్టీసు చేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చేదని హైదరాబాద్ బ్లాక్ హాక్స్ జట్టు స్టార్ క్రీడాకారుడు గురు ప్రశాంత్ చెప్పాడు. దేశంలోనే తొలిసారిగా జరుగుతున్న ఈ లీగ్‌ను యువ క్రీడాకారులను సద్వినియోగం చేసుకోవాలని ప్రశాంత్ కోరాడు. ప్రైమ్, హైదరాబాద్ బ్లాక్ హాక్స్, బైస్కిల్, కైజెన్, సిక్స్5సిక్స్, సంస్థలు ఈ లీగ్ నిర్వహణకు సహకారం అందిస్తున్నారని హైదరాబాద్ బ్లాక్ హాక్స్ జట్టు స్పోర్ట్స్ డైరెక్టెర్ సంజయ్ తెలిపారు. భావి క్రీడాకారులను ప్రోత్సహించడానికి ముందుకు వచ్చిన సంస్థలకు సంజయ్ కృతజ్ఞతలు తెలిపారు.