Sunday, May 18, 2025

స్వయం సంఘాల గ్రూపులకు ఆరోగ్య భద్రత

- Advertisement -
- Advertisement -

మహిళా సంఘాల సభ్యులకు యూనిక్ నెంబర్ లేదా క్యూఆర్ కోడ్ కలిగిన గుర్తింపు కార్డు
ఆరోగ్య, ఆర్థిక పరమైన వివరాలతో కూడిన డేటాబేస్ తయారు
ఈ కార్డు జారీ కోసం స్పెషల్‌డ్రైవ్ పెడతాం
విమెన్ యాక్సిలరేషన్ ప్రోగ్రాం ప్రారంభోత్సవంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
ఈనెల 21న ఇందిరా మహిళ స్టాళ్లను మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు సందర్శిస్తారు

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలోని స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులకు ప్రభుత్వం ఆరోగ్య భద్రత(Health security) కల్పిస్తుందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మహిళా సంఘాల సభ్యులకు యూనిక్ నెంబర్ లేదా క్యూఆర్ కోడ్ కలిగిన ఒక గుర్తింపు కార్డు జారీ చేసే విధానం అమల్లోకి తీసుకురావాలని అధికారులకు సిఎం సూచించారు. ఆరోగ్య, ఆర్థిక పరమైన వివరాలతో కూడిన డేటాబేస్‌ను తయారు చేసి అందరికీ ఆరోగ్య పరీక్షలు చేయించాలని ఆయన అధికారులను ఆదేశించారు. స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఇస్తున్న గుర్తింపు కార్డు స్థానంలో ఒక యూనిక్ ఐడీ కార్డు జారీ చేయడానికి ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టాలని సిఎం అధికారులకు సూచించారు.

ముఖ్యంగా మహిళలకు అవసరమైన హెల్త్ చెకప్ చేయించడం, హెల్త్ ప్రొఫైల్స్ తయారు చేయించడం, ఆరోగ్యం దెబ్బతిన్న తర్వాత సాయం అందించకుండా వైద్య పరీక్షలు నిర్వహించడం ద్వారా ముందస్తుగా ఆరోగ్య పరమైన సమస్యలు రాకుండా వారికి సాయం అందించవచ్చని ఆయన పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ జేఆర్సీ కన్వెన్షన్‌లో వి హబ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ముఖ్యమంత్రి విమెన్ యాక్సిలరేషన్ ప్రోగ్రాంను ప్రారంభించారు. ఆవరణలో స్వయం సహాయక సంఘాల మహిళల(Health security) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను సిఎం రేవంత్ సందర్శించారు. మహిళా సంఘాలతో కలిసి పనిచేయడానికి సంబంధించి వివిధ సంస్థలకు మధ్య కుదిరిన అవగాహన ఒప్పంద పత్రాలను ముఖ్యమంత్రి సమక్షంలో మార్చుకున్నారు.

కోటి మంది మహిళలు కోటీశ్వరులు కావాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలను ప్రోత్సహించాలని, వారిని ఆర్థికంగా నిలబెట్టాలని సిఎం రేవంత్ అన్నారు. ఆర్థిక క్రమ శిక్షణతో ముందుకు వెళుతున్నామని ఆయన తెలిపారు. దేశాన్ని గెలిపించే శక్తి మహిళలకు(Health security) ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఎన్నో ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైన స్వయం సహాయక సంఘాలను ఆర్థికంగా నిలబెట్టాలన్న లక్ష్యంతో ప్రభుత్వం రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలని సంకల్పించిందని ముఖ్యమంత్రి రేవంత్ తెలిపారు. తెలంగాణ వన్ ట్రిలియన్ ఎకానమీ లక్ష్యం సాధించాలంటే రాష్ట్రంలో కోటి మంది మహిళలు కోటీశ్వరులు కావాలన్నారు.

ఆ లక్ష్య సాధనలో భాగంగానే మహిళలకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని సిఎం రేవంత్ తెలిపారు.. మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసిలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం ద్వారా ఒక్కో మహిళ నెలకు దాదాపు 5 వేల రూపాయల మేరకు ఆదా అయ్యిందన్నారు. ఆర్టీసి కూడా లాభాల బాట పట్టిందన్నారు. ఆర్టీసి ద్వారా బస్సులను నడుపుకోవడానికి మహిళా గ్రూపులకు ఇప్పటికే 150 బస్సులను కేటాయించామన్నారు. అవసరమైతే భవిష్యత్‌లో మరిన్ని బస్సులను కేటాయిస్తామన్నారు. రూ. 500 లకే సిలిండర్, పాఠశాలల నిర్వహణ మహిళా సంఘాలకే అప్పగించామని సిఎం రేవంత్ తెలిపారు.

యూనిఫాం డ్రెస్సుల బాధ్యత కూడా సంఘాలకే…

పాఠాశాలల్లో విద్యార్థులకు కోటి 30 లక్షల యూనిఫాం డ్రెస్సుల బాధ్యత కూడా వారికే అప్పగించామని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు మాత్రమే నిర్వహించే వ్యాపారాల్లో సైతం మహిళా సంఘాలను ప్రోత్సహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఆడపడుచులకు పెట్రోల్ బంకులు పెట్టుకునే అవకాశం కల్పిస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. వెయ్యి మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తికి మహిళా సంఘాలను ప్రోత్సహించి రాష్ట్ర విద్యుత్ శాఖ ద్వారా ఒప్పందాలు చేస్తున్నామన్నారు. ప్రఖ్యాత సాఫ్ట్ వేర్ కంపెనీలున్న హైటెక్ సిటీ దగ్గరలో మూడున్నర ఎకరాల స్థలంలో మహిళా సంఘాల ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకునే సౌలభ్యం కల్పించామని సిఎం తెలిపారు. ఇలా ప్రతి చోటా, ప్రతి సందర్భంలోనూ మహిళలకు ప్రోత్సాహాన్ని అందిస్తున్నామన్నారు. మహిళా శక్తిని ప్రోత్సహించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. దేశంలో రూ.16 లక్షల కోట్లు కార్పొరేట్ కంపెనీలకు అప్పు ఇస్తే ఎగ్గొట్టి దేశం విడిచి వెళ్లారని, కానీ, ఆడబిడ్డలకు అప్పు ఇస్తే ఒక్క రూపాయి ఎగ్గొట్టకుండా వడ్డీతో సహా చెల్లిస్తున్నారని, ఆర్ధిక క్రమశిక్షణ తమ ఆడబిడ్డల సొంతమని ఆయన తెలిపారు.

రూ.20 వేల కోట్లను తిరిగి చెల్లించారు

గతేడాది రూ.20 వేల కోట్ల మేరకు బ్యాంకుల నుంచి రుణాలు అందిస్తే ఒక్క రూపాయి కూడా ఎగవేయకుండా ఎంతో ఆర్థిక క్రమశిక్షణతో తిరిగి ఆడబిడ్డలు చెల్లించారని ఆయన తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున సభ్యులను మహిళా సంఘాల్లో చేర్పించాల్సిన అవసరం ఉందని సిఎం తెలిపారు. ఆడబిడ్డలు వ్యాపారాల్లో నిలదొక్కుకున్నప్పుడే కుటుంబాలు ఆర్థికంగా నిలబడుతాయన్నారు. 1967లో చైనాతో, 1971లో పాకిస్తాన్ తో యుద్ధం జరిగిన సందర్బంగా ఇందిరా గాంధీ మహిళా శక్తిని ప్రపంచానికి చాటి చెప్పారన్నారు.

మహిళా శక్తి అండగా ఉంటే దేశం అభివృద్ధి పథం వైపు నడుస్తుందని ముఖ్యమంత్రి వివరించారు. మహిళా శక్తిని కాంగ్రెస్ ఎప్పుడూ తక్కువగా అంచనా వేయలేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. దేశానికి మహిళలు ఆదర్శమని, మహిళా శక్తి దేశానికి అండ అని నిరూపించినా ఘనత కాంగ్రెస్‌దేనని ఆయన తెలిపారు. ఈనెల 21న ఇందిరా మహిళ స్టాళ్లను మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు సందర్శిస్తారని సిఎం పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపి రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ రెడ్డి, విహబ్ ప్రతినిధులు, వివిధ సంస్థలు, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News