హైదరాబాద్: నాగార్జునసాగర్, శ్రీశైలం జలాశయాలకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు 5 గేట్లను 10 అడుగులు ఎత్తి దిగువకు నీటి విడుదల చేశారు. శ్రీశైలం ప్రాజెక్ట్ కు ఇన్ ఫ్లో 2,32,290 క్యూసెక్కులుండగా ఔట్ ఫ్లో 2,01,743 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులుకాగా ప్రస్తుత నీటిమట్టం 883 అడుగులుగా ఉంది. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది.
శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో నాగార్జున సాగర్ కు భారీగా వరద ప్రవాహం వస్తోంది. నాగార్జున సాగర్ లో ఇన్‌ఫ్లో 2,01,743 క్యూసెక్కులుండగా ఔట్‌ఫ్లో 41,985 క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుత నీటిమట్టం 586.40 అడుగులుకాగా పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులుగా ఉంది. నాగార్జునసాగర్‌లో నేడు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటించనున్నారు. మంత్రులు నాగార్జునసాగర్ నుంచి దిగువకు నీరు విడుదల చేయనున్నారు. 18 ఏళ్ల తర్వాత జూలై నెలలో క్రస్ట్ గేట్లు తెరుచుకోనున్నాయి.