శ్రీశైలం జలాశయానికి మరో సారి భారీ వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ కర్ణాటక, మహారాష్ట్రాలతో పాటు తెలుగు రాష్ట్రాలలో సైతం భారీ వర్షాలు నమోదు అవుతుండడంతో ఒక పక్క జూరాల, మరోపక్క సుంకేసుల బ్యారేజీల నుంచి శ్రీశైలం జలాశయానికి లక్షా 54 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. శనివారం రాత్రి వరకు శ్రీశైలం జలాశయంలో జూరాల 23 గేట్లు ఎత్తి 90 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. విద్యుత్ ఉత్పత్తి ద్వారా 38 వేల క్యూసెక్కులు, తుంగభద్ర నుంచి వస్తున్న వరదను వచ్చినట్లే సుంకేసుల బ్యారేజీ ద్వారా 35 వేల క్యూసెక్కుల చొప్పున శ్రీశైలం జలాశయానికి లక్షా 54 వేల క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. శ్రీశైలం ఎడమ, కుడి గట్లు జల విద్యుత్ కేంద్రాలలో నిరంతరాయంగా విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తున్న దిగువ నాగార్జునసాగర్‌కు 67 వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.
రాత్రికి శ్రీశైలం గేట్లు ఎత్తే అవకాశాలు
శ్రీశైలం జలాశయానికి భారీ వరద ప్రవాహం కొనసాగుతుండడంతో పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులకు గాను 882.30 అడుగులకు నీరు చేరుకుంది. దీంతో ప్రాజెక్టు అధికారులు శనివారం అర్ధరాత్రి వరకు మూడు గేట్లు ఎత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి.