ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్,
వరంగల్ జిల్లాల్లో విజృంభించిన వరుణుడు
పొంగిపొర్లుతున్న వాగులు, మత్తడి
దుంకుతున్న చెరువులు జనజీవనానికి తీవ్ర
ఆటంకం పలుచోట్ల కూలిన ఇళ్లు, భారీ
వృక్షాలు జలదిగ్బందంలో కుటుంబాలు
రక్షించిన సహాయక బృందాలు రోడ్లు
కొట్టుకుపోవడంతో రాకపోకలకు
అంతరాయం ఏడుపాయల ఆలయాన్ని
చుట్టుముట్టిన వరద నీరు మరో నాలుగు
రోజులు భారీ వర్షాలు పలు జిల్లాలకు
రెడ్, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండి
మన తెలంగాణ/హైదరాబాద్: గత వారం రోజులుగా కురుస్తు న్న వర్షాలకు రాష్ట్రంలో జనజీవనం అస్థవ్యస్థం అతాకుతలం అయింది. శనివారం ఎడతెరిపి లేకుండా ఉమ్మడి ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్,నిర్మల్, నిజామాబాద్, మెదక్, వరంగల్, ములుగు జిల్లాల్లో వరుణుడు విజృంభించాడు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని బెజ్జూర్, పెంచికలపేట, చింతల మానపెళ్లి మండలంలో భారీ వర్షాలకు బెజ్జూర్ మండలం హే టిగూడెం గ్రామానికి చెందిన పంబాల సన్యాసి ఇల్లు పూర్తిగా కూలిపోయింది. ఇంట్లోని ధాన్యం తడిసి ముద్దయినట్లు బాధితుడు తెలిపారు. భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొ ర్లుతున్నాయి.
బెజ్జూర్ మండలంలోని సుష్మీర్ వాగు పొంగి పొ ర్లడంతో 12 గ్రామాల ప్రజల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దహెగాం మండలంలోని అయినం గ్రామం వద్ద వరద నీరు ప్రవహిస్తుంది. లో లెవెల్ వంతెన మీదుగా నీరు ప్రవహించడంతో దహేగం, కాగజ్‌నగర్ రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ముధోల్ తాలూకాలోని భైంసా, ముధోల్, కుంటాల, కుబీర్, తానూర్, లోకేశ్వరం, బాసర మండలాల్లో వర్షం విస్తారంగా కురుస్తోంది. పట్టణంలోని గడ్డెన్నవాగు ప్రాజెక్ట్‌లో భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో అధికారులు ఐదు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఇప్పటికే 10,500 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్ట్ లో చేరగా, ప్రస్తుతం 20 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.
ప్రాజెక్టు దిగువ పరివాహక ప్రాంతంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. భారీ వర్షాలకు ముత్నూర్ త్రివేణి సంగం కాలువ ఉప్పొంగడంతో సమీపంలోని ఉట్నూర్, ఆదిలాబాద్ వెళ్లే రోడ్డును అనుకోని ప్రవహించడంతో రోడ్డు చాలా వరకు తెగిపోయింది. దీంతో రాకపోకలకు తీవ్ర ఆటంకం నెలకొంది. అనంతరం అధికారులు తాత్కాలికంగా రోడ్డుకు మరమ్మతులు చేపట్టడంతో రాకపోకలు కొనసాగాయి. ఆదిలాబాద్ రూరల్ మండలంలోని తంతోలి, అంకోలి, చించుఘాట్, లింగుగూడ, మామిడిగూడ, పిప్పల్దరి వంతెనలపై భారీగా వరద నీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. జైనథ్ మండలం తర్నం బ్రిడ్జి వద్ద రెండు లారీలు వరద ప్రవాహానికి కొట్టుకుపోగా లారీ డ్రైవర్ ను పోలీసులు సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. భీంపూర్ మండలం నిపానిలో ఓ మహిళకు తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించేందుకు ఆమెను స్ట్రెచర్ పై 108 సిబ్బందితో కలిసి స్థానికులు వాగు దాటించారు.
పెన్ గంగా నది వరద ఉధృతికి ఆనంద్ పూర్ బ్రిడ్జి పై వరద నీటి ప్రవాహం పెరగడంతో తెలంగాణ మహారాష్ట్రకు రాకపోకలు ఆగిపోయాయి. సీతాంగొంది జాతీయ రహదారి వద్ద ఓ ఇంటి చుట్టూ నీరు చేరడంతో ఆరుగురు కుటుంబ సభ్యులు అందులో చిక్కుకున్నారు. దీంతో పాటు ఆదిలాబాద్ పట్టణంలోని సుభాష్ నగర్ లో ఓ ఇంటి చుట్టూ వర్షపు నీరు చేయడంతో కుటుంబ సభ్యులు అందులో చిక్కుకున్నారు. విషయం తెలుసుకున్న ఎస్డీఆర్‌ఎఫ్ బృందం సహాయంతో వారిని కాపాడారు. పట్టణంలోని నటరాజ్ సినిమా థియేటర్ లోనికి భారీగా వరద నీరు వచ్చి చేరింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని తాంసీలో 16.7 సెంటీమీటర్ల వర్షపాతం గత రాత్రి నమోదు అయింది. అలాగే మంచిర్యాల జిల్లా కన్నెపల్లిలో 14 సెంటీమీటర్ల వర్షపాతం పడింది. న్మిల్ జిల్లాలో కడెం ప్రాజెక్టు17 గేట్ల్ను ఎత్తి నీటిని కిందికి వదిలారు. చేపల వేటకు వెళ్లిన కామ్నాపూర్ గ్రాఆమనికి చెందిన తిప్పిరెడ్డి గంగాదర్ అనే యువకుడు ప్రవాహంలో చిక్కుకుపోయాడు.
ఆతన్ని కాపాడేందుకు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు కృషి చేస్తున్నాయి. వరంగల్ జిల్లాలో నర్సంపేట డివిజన్లోని ఖానాపురం మండలంలోని అశోక్ నగర్ పాకాల చెరువు నుంచి వచ్చే వరద నీటిలో లెవల్ కాజ్ వే, నల్లబెల్లి మండలంలోని లెంకాలపల్లి గ్రామం వద్ద కాజ్ వే, నర్సంపేట నుంచి చెన్నారావుపేట వెళ్లే రహాదారిలో పాత ముగ్దుంపురం వద్ద, నర్సంపేటలోని మాధన్నపేట వద్ద కాజ్ వేలను కలెక్టర్ సత్యశారద పరిశీలించారు. దుగ్గోండి మండలంలోని 76 పంచాయతీరాజ్ చెరువులు, 14 చెరువులు మత్తళ్లు పోశాయి. మండలంలోని తిమ్మంపేట, నారాయణతండా మధ్య ఉన్న కాజ్‌వేపై వరద నీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. నర్సంపేట నుంచి నెక్కొండ వైపు వెళ్లే ప్రధాన రహదారి చెన్నారావుపేట మండలం పాతముగ్ధుంపురం వద్ద ఉన్న లోలెవల్ వంతెనపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలోని కాళేశ్వరం గ్రామంలోని ఎస్‌టి కాలనీలో వర్షపు నీరు చేరడంతో కాలనీ జలమయంగా మారింది.
భూపాలపల్లి టౌన్‌లోని అంబేద్కర్ సెంటర్లోని చెట్టుకూలి ఆటో ధ్వంసం కావడంతో డ్రైవర్‌కు గాయాలైయ్యాయి. ములుగు జిల్లా గోవిందరావు పేట మండలంలో లక్నవరం సరస్సులో 34 ఫీట్లు నీరు చేరి నిండుకుండ లాగా మారింది. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం పేరుపల్లి నుంచి మాదారం వెళ్లే రోడ్డుపై బుగ్గ వాగు వరద ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో పాటు పేరుపల్లి గ్రామ శివారులో గల డబల్ బెడ్ రూమ్ ఇళ్లలోకి వరద నీరు చేరింది. సూర్యాపేట జిల్లా అర్వపల్లిలో జాజిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన వంగూరి సైదమ్మ ఇళ్లు పూర్తిగా నేలమట్టం అయ్యాయి. నాగర్ కర్నూల్ జిల్లా నాగనూల్ సమీపంలో భారీ వర్షాల కారణంగా వచ్చిన వరద నీటితో గత మూడు రోజులుగా రాకపోకలు బంద్ అయ్యాయి. మెదక్ జిల్లాలో సింగూరు ప్రాజెక్ట్ తాకిడితో ఏడుపాయల వనదుర్గా అమ్మవారి దేవాలయాన్ని జలద్భిందంలో ఉంది. సింగూరు ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో అమ్మవారి ఆలయం వద్ద మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తోంది.
విస్తారంగా కురుస్తున్నా 91 మండలాల్లో లోటు వర్షపాతమే
రాష్ట్రంలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నప్పటికీ, ఇంకా 91 మండలాల్లో లోటు వర్షపాతం ఉన్నట్లు వాతావరణ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. వీటిలో అధిక శాతం ఉత్తర తెలంగాణలోని అటవీ ప్రాంత జిల్లాల్లోనే ఉన్నాయి. ప్రస్తుత వర్షాకాలంలో రాష్ట్రవ్యాప్తంగా అధికంగా వర్షాలు కురిసినప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదు కాలేదు. దీనివల్ల ఆయా మండలాల్లో వ్యవసాయ పనులు, తాగునీటి సరఫరా పై ప్రభావం పడే అవకాశం ఉంది.
255 మండలాల్లో సాధారణ వర్షపాతం
రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 255 మండలాల్లో నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక వర్షపాతం 90 మండలాల్లో, అధిక వర్షపాతం 185 మండలాల్లో నమోదైంది. రాష్ట్ర సగటు వర్షపాతం సాధారణ స్థాయికి చేసుకున్నప్పటికీ, ప్రాంతాలవారీగా చూస్తే ఈ వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం, మరో తుపాను సంభవిస్తే తప్ప ఈ లోటు వర్షపాతం భర్తీ అయ్యే అవకాశం లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
నాలుగు రోజుల పాటు అతిభారీ వర్షాలు
అల్పపీడన ప్రభావంతో రాగల నాలుగు రోజులు రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదివారం రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, మహబూబాబాద్, ములుగు, వరంగల్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని రెడ్ అలర్ట్ జారీ చేయగా, ఆదిలాబాద్, జయశంకర్ భూపాలపల్లి, జనగాం, ఖమ్మం, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, సిద్దిపేట, సూర్యాపేట, జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, మెదక్, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి భువనగిరి, జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
ఆంధ్ర ప్రదేశ్‌లో మూడు రోజులు పాటు భారీ వర్షాలు
అల్పపీడన ప్రభావంతో మూడు రోజుల పాటు ఆంద్రప్రదేశ్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. దక్షిణ చత్తీస్‌గఢ్, పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోందని, సోమవారం నాటికి మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. మత్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది.