రాత్రి 9.30గంటల ప్రాంతంలో హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం
రహదారులు జలమయం
అత్యధికంగా అబ్దుల్లాపూర్‌మెట్‌లో 13.5 సెం.మీ వర్షపాతం నమోదు
రాష్ట్రమంతటా మరో ఐదు రోజులు వర్షాలు
మన తెలంగాణ/హైదరాబాద్/సిటీ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో శనివారం రాత్రి భారీ వర్షం కురిసింది. గ్రేటర్‌లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం సుమారు 45 నిమిషాలు దంచికొట్టింది. మెరుపుల శబ్థాలకు నగర ప్రజలు కొంత ఆందోళన చెందారు. పండుగవేళ పగటిపూట ఎండ ఉండటంతో నగర ప్రజలు అధికంగా రోడ్లపైకి వచ్చారు. అయితే, రాత్రి 9.30 గంటల ప్రాంతంలో భారీ వర్షం కురువడంతో రోడ్లు జలాశయాలుగా మారాయి. వాటర్ లాగింగ్ పాయింట్ల వద్ద మోకాలు లోతు నీరు నిలిచి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. నగర, శివారు ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య మరింత తీవ్రమైంది.
ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్‌నగర్, తార్నాక, రామంతాపూర్, అబిడ్స్, చార్మినార్‌లో భారీ వర్షం పడింది. రోడ్లన్నీ జలమయం కావడంతో.. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయా యి. లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. అబ్ధుల్లాపూర్ మెట్‌లో అత్యధికంగా 13.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. శనివారం నుంచి 15వ తేదీ వరకూ.. భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మే రకు హైదరాబాద్‌కు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షం కారణంగా రోడ్లపై వా హనాలు కదల్లేకపోయాయి. ప్రయాణికుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. కాలనీలు అన్ని జలమయం కావడంతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు.
గ్రేటర్ నగరవాసులు తమ ప్రయాణాన్ని వాతావరణానికి అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని వాతావరణ శాఖ సూచిస్తుంది. జీహెచ్‌ఎంసి, పోలీసులు, హైడ్రా విభాగాల అధికారులతో సహా.. కలెక్టర్లు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని ప్రభుత్వం ఆదేశించింది. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించిం ది. అన్ని విభాగాలతో సమన్వయం చేసుకుం టూ.. ప్రజల రక్షణకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం తెలిపింది. వెంటనే ముందుజాగ్రత్త చర్యలు ప్రారంభించాలని అధికారులకు ప్రభు త్వం ఆదేశాలు జారీచేసింది.
నాలుగు రోజులు అల్పపీడనం ప్రభావం
క్యుములోనింబస్ మేఘాలు, బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వాచ్చే వారం మొత్తం వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదివారం నుంచి మూడు రోజుల పాటు క్యుములోనింబస్ మేఘాలతో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆదివారం రాష్ట్రంలోని నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్క భారీ వ ర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం పే ర్కొంది. ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదులుగాలులు వీస్తాయని ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. దీంతో పాటుగా మరో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని 21 జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.
కాగా, 13న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, దీంతో మరో నాలుగు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 13, 14,15 తేదీలలో రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు వాతావరణ కేంద్రం ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. కాగా, రాష్ట్రంలో శనివారం రాత్రి 8 గంటల వరకు వనపర్తి జిల్లాలోని గోపాల్ పేటలో అత్యధికంగా 103.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని రం గారెడ్డి జిల్లా హయాత్‌నగర్‌లో 75.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిలాల్లో లోటు వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ గణాంకాలు చెపుతున్నాయి.