- Advertisement -
ఎడతెరిపి లేకుండా కురిసిన అకాల వర్షంతో జిల్లాలో పలు ప్రాంతాలు నీట మునిగాయాయి. ఉపరితల ఆవర్తనం వల్ల భారీ వర్షం కురిసింది. జిల్లా కేంద్రంలో సుమారు మూడు గంటల పాటు కురిసిన వర్షానికి పట్టణంలోని ప్రధాన రహదారులతో పాటు లోతట్టు ప్రాంతాలు, పలుకాలనీలు నీటితో నిండి చెరువుల్లా తలపించాయి. ఉదయం 9.30 గంటల నుండి 12.30 వరకు ఏకదాటిగా వర్షం కురియడంతో పట్టణంలోని ప్రధాన రహదారిపై నీరు చేరి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అంతేకాకుండా వరదనీరు పలు దుకాణాలల్లోకి, నివాస గృహాలలోకి చేరాయి. వెంకట్రావ్‌నగర్, సాయినగర్, బృందావల్ కాలనీ, గాంధీనగర్, ఫతేనగర్ కాలనీలలో ఇళ్లల్లోకి నీరు చేరాయి. రాందాస్ చౌరస్తా, ఎంజీ రోడ్డు, జేయన్ రోడ్డు, మున్సిపల్ కాంప్లెక్స్ రోడ్లు చెరువులను తలపించాయి.
Also Read: వర్షాలకు కూలిన కలెక్టర్ భవనం పైకప్పు
మోకాళ్ల లోతు నీటితో రోడ్డు దాటుతూ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దుకాణాల సముదాయాల వద్ద ప్రధాన రోడ్డుపై భారీగా నీరు నిలిచిపోవడంతో పార్కింగ్ చేసిన ఆటోలు, కార్లు, బైక్‌లు ఇతర వాహనాలు సగం వరకు నీట మనిగిపోయాయి. ఇక ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ఆవరణలోకి నీరు చేరుకోగా విద్యార్థినీలు సురక్షితంగా బయటకు వచ్చారు. జిల్లాలోని మెదక్‌తో పాటు హవేళిఘణపూర్, కొల్చారం, కౌడిపల్లి, పాపన్నపేట, రామాయంపేట, నార్సింగి, అల్లాదుర్గం, పెద్దశంకరంపేట మండలాల్లో వర్షం కురిసింది. మెదక్ పట్టణంలో మూడు గంటల్లోనే 17.5 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ప్రధాన రహదారిపై నిలిచిన నీటిని మున్సిపల్ అధికారులు రంగంలోకి దిగి రాందాస్ చౌరస్తా వద్ద కొంత డివైడర్‌ను జేసీబీ సహాయంతో తొలగించి వరద నీటిని వెళ్లిపోయేలా చేశారు.
- Advertisement -