జిల్లాలో అన్ని విద్యాసంస్థలకు సెలవు.
నిజామాబాద్: అల్ప పీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాను భారీ వర్షం అతలాకుతలం చేసింది. మంగళవారం రాత్రి ప్రారంభమైన వాన బుధవారం రాత్రి వరకు ఏకధాటిగా కురుస్తూనే ఉంది. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కామారెడ్డి పట్టణం నీట మునిగింది. లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరద నీరు చేరింది. దీంతో జిల్లా జలదిగ్భందనంలో ఉంది. అలాగే నిజామాబాద్ నుంచి హైదరాబాద్ కు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. ఉరుములు, మెరుపులతో మొదలైన వర్షం క్రమంగా భారీ వర్షంగా మారింది. దీంతో నగరం దాదాపు జలమయం అయింది. దీంతో భారీగా వరద నీరు చేరి రోడ్లు చెరువులను తలపించాయి. మ్యాన్‌హోల్స్ పొంగిపొర్లాయి. పలు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచి భారీగా ట్రాఫిక్ స్తంభించింది. దీంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు వెళ్లాలంటే ఇబ్బంది పడుతున్నారు.
వర్షం కారణంగా రోడ్లపై నీరు నిలిచిపోవడంతో బయటకు వెళ్లేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
లోతట్టు పరిసర ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అలాగే ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకురావొద్దని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి విజ్ఞప్తి చేశారు. అలాగే ఉమ్మడి జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. అదేవిధంగా తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో గురువారం జరగాల్సిన అన్ని పరీక్షలను అధికారులు వాయిదావేశారు. శుక్రవారం జరగాల్సిన పరీక్షలను యథాతథంగా నిర్వహిస్తామని వెల్లడించారు. శ్రీరామ్ సాగర్ కు ఎగువ నుంచి వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో ప్రాజెక్టు లోతట్లు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూపరింటెండెంట్ జగదీష్ హెచ్చరికలు జారీ చేశారు.
Also Read: క్లౌడ్ బరస్ట్ ?… మెదక్, కామారెడ్డి జిల్లాలు అతలాకుతలం