అయినా ఈ సీజన్‌లో 10 శాతం లోటే
వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిన వర్షాలు
మన తెలంగాణ/హైదరాబాద్ : గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా రాష్ట్రంలో సమృద్దిగా వర్షాలు కురిసాయి. వారం రోజుల పాటు కురిసిన వర్షానికి గత నెల ఉన్న లోటు వర్షపాతం ఈ నెలలో భర్తీ అయినట్లు వాతావరణ శాఖ గణాంకాలు చెపుతున్నాయి. అయితే ఈ సీజన్‌లో సగటు వర్షపాతం మాత్రం 10 శాతం లోటు ఉందని భారత వాతావరణ కేంద్రం నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ ఏడాది వర్షాకాలంలో కురవాల్సిన సగటు వర్షపాతం జూలై 23వ తేదీ వరకు భారత వాతావరణ శాఖ గణాంకాల ప్రకారం.. సాధారణ సగటువర్షపాతం 286.5 మిల్లీమీటర్లకు గాను 257.8 మిల్లీమీటర్ల వర్షపాతం కురవగా, 10 శాతం లోటు వర్షపాతం నమోదైంది.
రాష్ట్రంలోని 33 జిల్లాలకు గాను 17 జిల్లాల్లో సాధారణ వర్షపాతం, 3 జిల్లాల్లో స్వల్పంగాఅధిక వర్షపాతం, 13 జిల్లాల్లో లోటు వర్షపాతం కురిసింది. ఈ నెల 17వ తేదీ నుంచి 23వ తేదీ వరకు సాధారణ వర్షపాతం 50.2 మిల్లీ మీటర్లకు గాను, 88.6 మిల్లీమీటర్ల వర్షపాతంతో 77 శాతం అధికంగా వర్షాలు కురిసాయి. ఈ వారం రోజుల పాటు 22 జిల్లాలో అధిక వర్షపాతం నమోదైంది. అయితే నైరుతి రుతుపవనాల ముందస్తు రాకతో అన్నదాతల్లో వెల్లివిరిసన ఆనందం జూన్ నెల లోటు వర్షపాతంతో ఆవిరైంది.
ఈ క్రమంలో బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి అల్పపీడన ప్రభావంతో ఈ నెల రెండవ, మూడవ వారంలో కురిసిన వర్షాలకు గత నెలలో నమోదైన లోటు వర్షపాతం ఈ నెలలో భర్తీ అయింది. ఈ క్రమంలో జూన్ 1వ తేదీ నుంచి ఆదివారం(ఈ నెల 27) వరకు వర్షపాత గణాకాంలను హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. సాధారణ వర్షపాతం 336.8 మిల్లీ మీటర్లు నమోదు కావాల్సి ఉండగా, ఇప్పటి వరకు 334.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.