ములుగు జిల్లా, వాజేడు మండలంలో బుధవారం ఉదయం సుమారు నాలుగు గంటల పాటు కురిసిన భారీ వర్షానికి అతలాకుతలమైంది. భారీ వర్షాల కారణంగా ప్రసిద్ధ బొగత జలపాతం ఉగ్రరూపం దాల్చింది, జలధారలు పొంగిపొర్లుతున్నాయి. పరిస్థితి తీవ్రత దృష్ట్యా, అధికారులు ముందుజాగ్రత్త చర్యగా బొగత జలపాతం సందర్శనను నిలిపివేశారు. సందర్శకుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. మండలంలో కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాల వల్ల వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. అనేక గ్రామాలలో ప్రజల ఇళ్ల చుట్టూ వరద నీరు చేరడంతో వారి దైనందిన జీవితానికి తీవ్ర అంతరాయం కలిగింది. ప్రజలు రాకపోకలకు, ఇతర అవసరాలకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
పిడుగుపాటుకు యువకుడు మృతి:
భారీ వర్షాల మధ్య పిడుగుపాటుకు గురై ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. వాజేడు మండలం, పేరూరు గ్రామానికి చెందిన తోటపల్లి ఎల్లయ్య, సమ్మక్క దంపతుల కుమారుడు వేణు (20) పేరూరు నుండి ఏటూరునాగారంనకు పని నిమిత్తం ద్విచక్ర వాహనంపై వెళ్తున్నాడు. ఈ క్రమంలో పెద్ద గొల్లగూడెం గ్రామ శివారులో పిడుగుపాటుకు గురయ్యాడు. పిడుగు పడటంతో ద్విచక్ర వాహనం అదుపు తప్పి పడిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో మండలంలో విషాదఛాయలు అలుముకున్నాయి. స్థానికులు అప్రమత్తంగా ఉండాలని, వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని సూచించారు.