ఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీగా వర్షాలు కురవడంతో భారీగా వరద ప్రవహిస్తోంది. భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతుండగా కుంటలు, చెరువులు అలుగు పారుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి. జీఎస్ ఎస్టేట్, భుక్తాపూర్, వికలాంగుల కాలనీ, బొక్కలగూడ, లక్ష్మీనగర్, భాగ్యనగర్, తాటిగూడ, మణిపూర్, పంజాబ్‌చౌక్,శాంతినగర్,రవీంద్రనగర్ కాలనీలు నీట మునిగాయి. భారీగా వరద నీరు రావడంతో ఇండ్లు మునిగిపోయాయి. ఇళ్లలోని బియ్యం, నిత్యావసర సరుకులు, ఎలక్ట్రానిక్ వస్తువులు తడిసిపోయాయి. భారీగా ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వరద బాధితుల డిమాండ్ చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలతో భారీగా పంట నష్టం జరిగింది. గుడిహత్నూర్, సిరికొండ, తాంసి, తలమడుగు, జైనథ్, బేల,ఇంద్రవెల్లి మండలాల్లో వందలాది ఎకరాల మునిగిపోవడంతో పంట నష్టం జరిగింది.