హైదరాబాద్‌ను ముంచెత్తిన కుండపోత వర్షం
నదులను తలపించిన రోడ్లు.. నీటిమునిగిన లోతట్టు ప్రాంతాలు
కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు
మారేడుపల్లిలో 11.43 సెం.మీ.ల అత్యధికంగా వర్షపాతం
నేడు కూడా భారీ నుంచి అతిభారీ వర్షాలు: వాతావరణ శాఖ హెచ్చరిక
మరో నాలుగు రోజుల పాటు ఇదే పరిస్థితి
మనతెలంగాణ/హైదరాబాద్ సిటీ బ్యూరో: నీటమునిగిన లోతట్టు ప్రాంతాలు.. కాలువలను తలపించిన రహదారులు.. కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు.. ట్రాఫిక్ జామ్‌తో ఇబ్బందులకు గురైన వాహనదారులు.. కరెంట్ సరఫరాలేక అంధకారంలో కాలనీలు.. ఒక్క వర్షానికే రాజధాని నగరం అతలాకుతలమైంది. శుక్రవారం మధ్యహానం నుండి సాయంత్రం వరకు కురిసిన కుండపోత వర్షానికి హైదరాబాద్ మహానగరం వణికింది. మారెడ్ పల్లిలో 11.43 సెం.మీ.లు.
బాలానగర్ 11.35 సెం.మీ.లు. ఉప్పల్‌లో 10.10 సెం.మీ.లు. ముసారంబాగ్ 9.85 సెం.మీ.లు మల్కాజగిరి 9.78 సెం.మీ.లు. ముషీరాబాద్‌లో 9.00 సెం.మీ.లు. కుత్భుల్లాపూర్‌లో 8.73, అంబర్‌పేట్ 8.50 సెం.మీ.లు. శేరిలింగంపల్లి 7.90 సెం.మీ.లుగా వర్షం కురిసింది. దీంతో ఆయా ప్రాంతాలు పూర్తిగా జలమయం కాగా.. అక్కడి రోడ్లు నదులను తలపించాయి. మ్యాన్‌హోళ్ళు తెరుచుకున్నాయి. రోడ్లపై మోకాల్లోతు వరద ప్రవహించడంతో వాహనాదారులు అందులో చిక్కుకున్నారు. మాసాబ్ ట్యాంక్, హైటెక్ సిటీ, అయ్యప్ప సొసైటీ, గాజులరామారం, కూకట్‌పల్లి, హాఫిజ్‌పేట్ వంటి ప్రాంతాల్లో భారీగా నీరు నిలిచినట్లు హైడ్రా కంట్రోల్ రూంకు సమాచారం అందింది. హైడ్రా బృందాలు, మాన్‌సూన్ అత్యవసర టీలు, జీహెచ్‌ఎంసికి సంబంధించిన అత్యవసర సేవలందించే బృందాలు, జలమండలి, విద్యుత్ సంస్థల టీంలు రంగంలోకి దిగి సేవలందించడంలో మునిగాయి.
నదులైన రోడ్లు..
గ్రేటర్ రోడ్లపై ఎక్కడికక్కడ వరద నీరు నిలిచిపోయింది. జూబ్లీహిల్స్, ఫిల్మ్ నగర్, మెహదీపట్నం, మణికొండ, టోలిచౌకి, షేక్‌పేట్, గోల్కొండ, అత్తాపూర్, లంగర్‌హౌస్, బంజారాహిల్స్, తార్నాక, ఓయూ, నాచారం, మల్లాపూర్, హబ్సిగూడ, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ కాలనీ, నిజాంపేట్, మియాపూర్, మూసాపేట్ సహా బాలానగర్, సనత్‌నగర్, ఎర్రగడ్డ మాదాపూర్, హైటెక్ సిటీ, కొండాపూర్, శేరిలింగంపల్లి, హకీంపేట్, కంటోన్మెంట్, ఖైరతాబాద్‌లోనూ భారీగా వర్షం కురిసింది. వరదలతో నగర జనం అవస్థలు పడుతున్నారు. మరోవైపు వాహనదారులు రోడ్లలోని వరద నీటిలో తీవ్ర ఇక్కట్లు పడ్డారు. బస్తీలు, లోతట్టు ప్రాంతాల్లో ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది. వర్షం నేపథ్యంలో అధికారులను జీహెచ్‌ఎంసీ అప్రమత్తం చేసింది. వర్షం తగ్గేంత వరకూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలకు సూచనలు చేసింది. షేక్ పేట్, ఖాజాగూడ, రాయదుర్గం, గచ్చిబౌలిలో భారీ వర్షం కారణంగా జనం అవస్థలు పడ్డారు. కొండాపూర్, హఫీజ్ పేట్, మాదాపూర్, మియాపూర్‌లో భారీ వర్షం పడింది.
ట్రాఫిక్ కష్టాలు..
ఐటీ కారిడార్‌లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహనదారులు వర్షంలోనే నానుతూ వాహనాలు ముందుకు కదలక తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. సాయంత్రం వేళ ఆఫీసు నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో రోడ్లన్నీ వాహనాలతో నిడిపోయాయి. ట్రాఫిక్ జామ్ అయ్యింది. రాయదుర్గం, షేక్‌పేట్ మార్గంలో 3 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి.. ఎటూ వెళ్ళలేని పరిస్థితిలో చిక్కుకుపోయారు. ట్రాఫిక్ పద్మవ్యూహంలో ఐటీ కారిడార్ ఉందా అన్నట్టుగా పరిస్థితి. కొన్ని రోడ్లు నాలాలను తలపించాయి. రాయదుర్గం, బయోడైవర్సిటీ, ఐకియా జంక్షన్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. గచ్చిబౌలి పిజేఆర్ ఫ్లైఓవర్‌పై వాహనాలు బారులు తీరి నిలిచాయి. ఏఎంబీ మాల్ ముందు వర్షపు నీరు చేరి నిలిచిపోయింది. హఫీజ్‌పేట్, ఆల్విన్ కాలనీ, చందానగర్ మార్గంలో ట్రాఫిక్ సమస్య నెలకొన్నది. పలువురు మెట్రో పిల్లర్ల కింద తలదాచుకున్నారు. ద్రోణి ప్రభావంతో గురువారం రాత్రి గ్రేటర్‌లోని పలు చోట్ల వాన దంచికొట్టింది. రాత్రి 10 గంటల వరకు ఉప్పల్‌లో అత్యధికంగా 8.58 సెం.మీలు, నాచారంలో 7.88 సెం.మీలు, మెట్టుగూడలో 6.93 సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైనట్లు టీజీడీపీఎస్ అధికారులు వెల్లడించారు.
నమోదయిన వర్షపాతం
హైదరాబాద్ నగరంలో 25.7 మి.మీ
మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 18.3 మి.మీ
రంగారెడ్డిలో 13.8 మి.మీ
యాదాద్రి భువనగిరిలో 8.0 మి.మీ
సిద్దిపేటలో 7.5 మి.మీ
ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రబావంతో రాష్ట్రంలో మరో నాలుగు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్ర ప్రకటించింది. ఈ క్రమంలో శుక్రవారం అర్దరాత్రి నుంచి శనివారం వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పలు ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రంలోని శనివారం సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్ జిల్లాలో వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.దీంతో పాటు మరో మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.