లాహోర్ : పాకిస్థాన్‌లో భారీ వర్షాలతోపాటు వరదలు ముంచెత్తుతున్నాయి. వర్షాల సంబంధిత సంఘటనల కారణంగా గత 24 గంటల్లో పంజాబ్ ప్రావిన్స్‌లో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. 150 మంది గాయపడ్డారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా మృతుల సంఖ్య ఇప్పటికి 140 కు పెరిగింది. గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా లాహోర్, పంజాబ్ లోని కొన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయని, గురువారం వరకు ఇవి కొనసాగుతాయని అధికారులు చెప్పారు. లాహోర్‌లో పిడుగు పడి ఇళ్ల పైకప్పులు కూలిన మూడు సంఘటనల్లో 12 మంది చనిపోయారు. వీరిలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఉన్నారు. థోకర్ నియాజ్ బెయిగ్ ఏరియాలో ఈ సంఘటన జరిగింది.
ఫైసలాబాద్‌లో ముగ్గురు, పాక్‌పట్టమ్‌లో ఒకామె, ఇద్దరు పిల్లలు చనిపోయారు. షేక్‌పుర, భక్కర్, బాహవలినగర్, షక్కోట్‌ల్లో ఒక్కొక్కరు వంతున ఒకారోలో ఇద్దరు ఇళ్లు కూలి చనిపోయారు. మంగళవారం నేషనల్ డైసాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ఎన్‌డిఎంఎ) వర్షాల వల్ల కలిగే నష్టాలను అంచనా వేసింది. జూన్ 26 నుంచి ఈ సంఘటనల్లో 116 మంది చనిపోయారని తెలిపింది. పంజాబ్ ముఖ్యమంత్రి మర్యం నవాజ్ మృతుల కుటుంబాలకు తీవ్ర సంతాపం తెలిపారు. సహాయ కార్యక్రమాలు సరిగ్గా జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు.