పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో వారం రోజులుగా రాష్ట్రంలో కుండపోతగా వర్షాలు కురిసాయి. ఈ వర్షాలు కొంత తగ్గుముఖం పట్టాయని రాష్ట్ర ప్రజలు ఊరిపి పీల్చుకునేలోపే వాతావరణ శాఖ మరోక అలర్ట్ ఇచ్చింది. సోమవారం బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని దీంతో రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈ మేరకు సోమవారం రాష్ట్రంలోని ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో అతిభారీ నుంచి
అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని రెడ్ అలర్ట్ ఇవ్వగా, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, హన్మకొండ, కామారెడ్డి, ఖమ్మం, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, నిర్మల్, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, వరంగల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. కాగా, ఆదివారం మెదక్ జిల్లా, ఎల్దుర్తి మండలం, దామరంచ గ్రామంలో అత్యధికంగా 103.3 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసినట్లు, వాతావరణ శాఖ వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్‌లో …
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరోక అల్పపీడనం ఏర్పడనుందని, ఇది ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు ఆనుకుని కేంద్రీకృతమై ఉందని ఆంద్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతున్న అల్పపీడనం 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. దీంతో తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు వీస్తాయని, ప్రధాన పోర్టుల్లో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసింది. విశాఖ, గంగవరం, కాకినాడ, నిజాంపట్నం, మచిలీపట్నం, కృష్ణపట్నం పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది. ఐదు రోజుల పాటు వేటకు వెళ్లొద్దని మత్యకారులను హెచ్చరించింది.