ముందుగానే ఆరంభమైన వర్షాకాలం..!
వ్యవసాయానికి సన్నద్దమవుతున్న రైతులు
మన తెలంగాణ/హైదరాబాద్: ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితులు చూస్తుంటే ఈ ఏడాది రోహిణి కార్తెలో (Heavy rains Rohini Karthi) భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. రోహిణి కార్తె లో రోళ్లు పగులుతాయని నానుడి ఉంది. త్రీవమైన ఎండలకు మారు పేరుగా రోహిణి కార్తెను భావిస్తారు. ప్రతి సంవత్సరం 15 రోజులు పాటు రోహిణి కార్తెలో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తాడు. ఈ ఏడాది రోహిణి కార్తె మే 25వ తేదీతో ప్రారంభమై జూన్ 8వ తేదీతో ముగియనుంది. ఎనిమిది రోజుల ముందుగానే నైరుతి రుతుపవనాలు కేరళను తాకడంతో మరో రెండు, మూడు రోజుల్లో రాష్ట్రానికి విస్తరిస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
ఈ నేపథ్యంలో రోహిణి కార్తె ఎండలు లేనట్లేనని నిపుణులు భావిస్తున్నారు. ఈ ఏడాది వేసవికాలం తన సంప్రదాయాన్ని వదిలేసినట్టు కనిపిస్తుంది. వేసవి కాలంలో అడపాదడపా వర్షాలు కురవడం, రోహిణి కార్తెలో ఎండ వేడికి బదులు చల్లటి వాతావరణమే ఇందుకు నిదర్శనంగా ఉంది. కేరళను(ఈ నెల 24వ తేదీ) ఇప్పటికే నైరుతి రుతుపవనాలు తాకాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. వీటి ప్రభావంతో వేడి తగ్గిపోయి వర్షాలు కురవడంతో రైతులు వ్యవసాయ పనులకు శ్రీకారం చుడుతున్నారు.
ఇటువంటి అకాల వర్షాల (Heavy rains Rohini Karthi) కారణంగా భూసారంలో తేడా వచ్చే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు గమనిస్తే సాధారణం కంటే ముందుగా వర్షాకాలం ప్రారంభమైంది. ఈ పరిస్థితుల్లో ముందుగా వర్షాలు పడి సరైన సమయంలో వర్షాలు పడకపోతే పరిస్థితి ఏ విధంగా ఉంటుందోనని రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. ఖరీఫ్ పంటను సాగు చేసేవారు వాతావరణంలో మార్పులు ఎలా ఉన్నా వారి జాగ్రత్తల్లో వారు ఉండటం మంచిదని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు. మరి రోహిణి కార్తెలో వర్షాలు రైతులకు ఎంత వరకు మేలు చేస్తుందో వేచి చూడాలి.