Friday, August 22, 2025

తెలంగాణలో త్వరలో హెలి టూరిజం

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో త్వరలో హెలి టూరిజం దిశగా అడుగులు పడబోతున్నాయని పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. నాగర్‌కర్నూల్ జిల్లా, కొల్లాపూర్ మండలం,అమరగిరి సోమశిల వద్ద పర్యాటక శాఖ ఆధ్వర్యంలో సోమశిల నల్లమల అమరగిరి ఐలాండ్ ఈగలపెంట ప్రాంతాల్లో వెల్నెస్ స్పిరిచ్యువల్ రిట్రీట్ ప్రాజెక్టుకు ఆయన శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమవేశంలో మంత్రి మాట్లాడుతూ..త్వరలోనే తెలంగాణలో హైదరాబాద్, సోమశిల, శ్రీశైలం మధ్య సేవలు టూరిజం ద్వారా నిర్వహించేందుకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నామని అన్నారు. పర్యాటకులను విశేషంగా ఆకర్షించేందుకు హెలి టూరిజం నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని అన్నారు. గగనతలంలో కొద్దిసేపు విహరింపజేసి పర్యాటకులకు ఆహ్లాదాన్ని, అనుభూతిని కల్పించేందుకు హెలి టూరిజం నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు.

అందులో భాగంగా ఇన్‌మై ట్రిప్ సంస్థ సహకారంతో హైదరాబాద్ నుంచి సోమశిల అక్కడి నుంచి శ్రీశైలం మీదుగా హైదరాబాద్ వరకు హెలి టూరిజం నిర్వహణకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నామని అన్నారు. దీంతో పర్యాటక రంగం కూడా కొత్త మలుపు తిరిగనుందని అభిప్రాయపడ్డారు. కొల్లాపూర్ మండలంలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంఎల్‌సి కూచకుళ్ల దామోదర్ రెడ్డి, కలెక్టర్ బాదావత్ సంతోష్, పర్యాటక అభివృద్ధి సంస్థ ఛైర్మన్ పటేల్ రమేష్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. రూ. 68.10 కోట్ల అంచనా వ్యయంతో సోమశిలలో వెల్నెస్ స్పిరిచ్యువల్ నల్లమల ప్రాజెక్టు అభివృద్ధి పనులకు మంత్రి జూపల్లి శ్రీకారం చుట్టారు. అమరగిరిలో రూ. 45.84 కోట్ల వ్యయంతో అమరగిరి ఐలాండ్ వెల్నెస్ రిట్రీట్ నిర్మాణ పనుల్లో భాగంగా యోగా డెక్ పవిలియన్ స్పా ఏరియా కాటేజీలు, సిబ్బంది వసతి, స్విమ్మింగ్ పూల్, ఇండోర్, అవుట్‌డోర్, యాక్టివిటీస్, స్టోర్ రూం, జెట్టీ, ధ్యానాలయం, గార్డెనింగ్, ఎస్‌టిపి, నీటి పారుదల, విద్యుత్ తదితర పనులు చేపట్టనున్నారు.

రూ.1.60 కోట్లతో సోమశిలలో విఐపి ఘాట్ బోటింగ్ పాయింట్ కోసం టీచింగ్ పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పర్యాటక అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో అన్నివిధాల అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వం అనేక పర్యాటక ప్రాజెక్టులను చేపడుతోందని అన్నారు. టూరిజం అభివృద్ధికి తెలంగాణలో అనుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ గత పదేళ్లలో టూరిజం నిర్లక్షానికి గురైందని ఆరోపించారు. స్వదేశీ, విదేశీ పర్యాటకుల సంఖ్యను పెంచాలని ప్రభుత్వం లక్షంగా పెట్టుకుంద అన్నారు. విదేశీ పర్యాటకుల సంఖ్య పెంచేందుకు మౌలిక వసతులుగా కల్పనతో పాటు విస్తృత ప్రచారాన్ని కల్పిస్తున్నామని అన్నారు. తద్వారా ఉద్యోగ కల్పనతో పాటు ఆయా ప్రాంతాల్లో మౌలిక వసతులు మెరుగవుతాయని అన్నారు. వాటర్ స్పోర్ట్ అడ్వెంచర్ టూరిజానికి పెద్దపీట వేస్తున్నామని అన్నారు. అమరగిరి ఐలాండ్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని, ఏడాదిలోగా పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.

నీటి ప్రవాహం తగిన పర్యాటకులకు ఐలాండ్ తీసుకువచ్చేలా ఫ్లోటింగ్ జెట్ట్టీ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. కొత్త పర్యాటక ప్రాజెక్టుల అభివృద్ధి వల్ల పర్యాటక సందర్శన మరింత పెరగనుందన్నారు. నల్లమల అడవుల మధ్య కృష్ణా నది ఒడ్డున ఉన్న సోమశిల, అమరగిరి ప్రకృతి అందాలను చూసేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివస్తారని అన్నారు. టూరిజం ప్రాజెక్టు అభివృద్ధి వల్ల రాష్ట్ర ఆదాయం గణనీయంగా పెరుగుతుందని, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. సోమశిల సిద్ధేశ్వరం ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే దూరభారం తగ్గడంతో పాటు పర్యాటకుల సంఖ్య సైతం పెరుగుతుందని అన్నారు. పర్యాటక అభివృద్ధి సంస్థ ఛైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో పర్యాటక రంగం అగ్రస్థానంలో నిలబెట్టడానికి ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని అన్నారు. సర్కూట్ అభివృద్ధితో ఈ ప్రాంతం పర్యాటక హబ్‌గా మారుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పర్యాటక శాఖ అధికారి కె. నరసింహ, అధికారులు మాజీ ప్రజాప్రతినిధులు తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News