Friday, May 9, 2025

నగరంలో హైఅలర్ట్..

- Advertisement -
- Advertisement -

ఈ నెల 10వ తేదీ నుంచి హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించనున్న నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ప్రారంభ వేడుకలు నిర్వహించనున్న గచ్చిబౌలి స్టేడియంను ఆధీనం చేసుకున్న పోలీసులు అనువణువు తనిఖీలు నిర్వహిస్తున్నారు. మిస్ వరల్డ్ పోటీలను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. పోటీలో పాల్గొనే అందగత్తెలు రాష్ట్రంలోని పలు ప్రాంతాలను సందర్శించనుండడంతో ఆయా ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వీరు పర్యటించే సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని డిజిపి జితేందర్ ఇప్పటికే ఆదేశించిన విషయం తెలిసిందే. హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులు ఇప్పటికే పలుమార్లు పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. పోటీల సందర్భంగా తీసుకోవాల్సిన భద్రతా చర్యల గురించి చర్చించి, ఆదేశాలు జారీ చేశారు. పోటీలో పాల్గొనేందుకు 120 దేశాలకు చెందిన అందెగత్తెలు ఇప్పటికే నగరానికి వచ్చారు. వారికి స్టార్ హోటళ్లలో బస ఏర్పాటు చేశారు, హోటళ్ల వద్ద, వారు ప్రయాణించే మార్గాల్లో పోలీసులు భద్రతను ఏర్పాటు చేశారు. ఎలాంటి సంఘటన జరిగినా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని పోలీసులు భారీగా భద్రతను ఏర్పాటు చేశారు.

సైబరాబాద్ జాయింట్ పోలీస్ కమిషనర్ గజారావు భూపాల్ పోటీలకు భారీ భద్రతా ఏర్పాట్లు చేశామని తెలిపారు.
మిస్ వరల్డ్ పోటీలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. ఈనెల 10వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఈవెంట్ కొనసాగుతుందని అన్నారు. వివిధ దేశాల నుంచి వచ్చే అతిథులకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు. ఇప్పటికే 80శాతానికి పైగా అతిథులు, పోటీదారులు హైదరాబాద్ చేరుకున్నారని తెలిపారు. పోటీల్లో పాల్గొనే వారికి కేటాయించిన హోటళ్ల వద్ద కూడా భారీగా భద్రతా ఏర్పాట్లు చేశామని తెలిపారు. అతిథులు స్టే చేసే పరిసరాలను రెడ్ జోన్, గ్రీన్ జోన్‌గా ప్రకటించామని, వాటికి అనుగుణంగా సెక్యూరిటీ ఏర్పాటు చేశామని తెలిపారు. అనుమతి లేకుండా ఎవరికి లోపలకు అనుమతి ఉండదని స్పష్టం చేశారు. తెలంగాణలో చాలా ప్రదేశాలను అతిథులు సందర్శిస్తారని తెలిపారు. మిస్ వరల్డ్ పోటీల కోసం ఎలాంటి ట్రాఫిక్ డైవర్షన్‌లు ఉండవని అన్నారు. సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారిని తీసుకెళ్తామని చెప్పారు. సిఎం , గవర్నర్, మంత్రులు, వీవీఐపీ, వీఐపీలకు ప్రోటోకాల్ ఉంటుందని తెలిపారు. ఇతర జిల్లాల నుంచి కూడా ఫోర్స్‌ను తెప్పించామని అన్నారు. 31వ తేదీన మిస్ వరల్డ్ ఫైనల్ ఉండనుందని, దానికి అనుగుణంగా భద్రత చర్యలు తీసుకున్నామని తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News