Friday, August 22, 2025

అకాల వర్షాలతోనే కుంగింది

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : కాళేశ్వరం ప్రా జెక్టుపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక పూర్తిగా రాజకీయ ప్రేరేపితమని, అది తమకు రాజకీయంగా నష్టం చే కూర్చేలా తయారు చేసిందని మాజీ సిఎం కెసిఆర్, మాజీ మంత్రి హరీష్ రావు తరఫు న్యాయవాదులు గురువారం జరిగిన విచారణ సందర్భంగా ఆరోపించారు. కాళేశ్వరం కమిషన్ నివేదికను రద్దు చేయాలని కోరుతూ, కేసీఆర్, హరీశ్‌రావు దాఖలు చేసిన పిటిషన్లపై గురువారం హైకోర్టులో వాడివేడిగా విచారణ జరిగింది. రెం డు పిటిషన్లను కలిపి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ బెంచ్ విచారించింది. ఐదు అంశాలను ప్రధానంగా పిటిషన ర్లు ప్రస్తావించారు. కాళేశ్వరం కమిషన్‌ను నియమిస్తూ గత ఏడాది ప్రభుత్వం జారీ చేసిన జీఓ ను కొట్టివేయాలని కోరారు. కమిషన్ విచారణ లో సందర్భంగా యాక్ట్ సెక్షన్ 8బి, 8సి నోటీసు లు తమకు ఇవ్వలేదని పేర్కొన్నారు. కమిషన్ ప్ర భుత్వానికి ఇచ్చిన నివేదికను తమకు ఎందుకు ఇవ్వలేదని పిటిషనర్ల  తరఫున వాదించిన సుప్రీంకోర్టు న్యాయవాది ఆర్యామ సుందరం ప్రశ్నించారు.

కెసిఆర్ తరపు న్యాయవాది వాదనలు
జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నిబంధనలు పాటించలేదని న్యాయవాది సుందరం తెలిపారు. నోటీసులు సరైన విధానంలో ఇవ్వలేదని వాదించారు. నివేదికను కూడా కెసిఆర్, హరీష్ రావుకు అందించలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్ళారు. పీసీ ఘోష్ కమిషన్ నివేదికను ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిందని ఆయన తెలిపారు. రాజకీయంగా నష్టం చేకూర్చేలా నివేదిక రూపొందించారని అన్నారు. ఈ నివేదికపై అసెంబ్లీలో చర్చించేలా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందన్నారు. కాళేశ్వరం కమిషన్ నివేదికపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని కోర్టును కోరారు. ఎలాంటి ఆధారాలు లేకుండా బిఆర్‌ఎస్‌ను అప్రతిష్టపాలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని పిటిషనర్ తరుపు న్యాయవాది పేర్కొన్నారు. రాజకీయ వ్యూహంతోనే జస్టిస్ ఘోష్ కమిషన్ నియామకం జరిగిందని వెల్లడించారు. నిబంధనలకు విరుద్ధంగా కమిషన్ నివేదిక రూపొందించిందని వివరించారు. దురదృష్టవశాత్తూ వివిధ కారణాలతో మేడిగడ్డ బ్యారేజ్ ఒక పిల్లర్ కుంగిందని, అదికూడా వర్షాకాలంలో అకాల వర్షాలు కారణంగా కుంగిందని తెలిపారు.

కుంగిపోవడానికి డిజైనింగ్ కానీ ఇంజనీరింగ్‌తో కానీ ఎలాంటి సంబంధం లేదని పిటిషనర్ల న్యాయవాది స్పష్టం చేశారు. నివేదిక కాపీలను తమకు అందజేయకుండా మీడియాకు అందజేయడంలో దురుద్దేశం కూడుకున్నదని కోర్టుకు వివరించారు. రాజకీయ కారణాలతో ప్రజల్లో తమ పరువును అప్రతిష్టపాలు చేయాలని చూస్తున్నారని అన్నారు. ఒకవేళ ఏదైనా ఎంక్వైరీ కమిషన్ లో వ్యక్తి పై ఆరోపణలు ఉంటే సెక్షన్ 8 బి నోటీస్ ఇవ్వాలి. కమిషన్ ఎంక్వయిరీ యాక్ట్ సెక్షన్ 8బి, 8సి నోటీసులు ఇవ్వలేదని, ఎలాంటి కాపీ తమకు ఇవ్వకుండానే జూలై 31 న ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిందని కోర్టుకు వివరించారు. ప్రభుత్వం 600 పేజీల రిపోర్ట్ ను స్టడీ చేసి బ్రీఫ్ రిపోర్ట్ ఇవ్వాలని త్రీ మెన్ కమిటీ వేసిందని, వాళ్ళు ఇచ్చిన 60 పేజిల రిపోర్ట్ కూడా మాకు ఇవ్వలేదని కోర్టుకు తెలిపారు. మొత్తం రిపోర్ట్ కాకుండా 60 పేజీల రిపోర్ట్ మాత్రమే వెబ్‌సౌట్‌లో అప్లోడ్ చేశారని వెల్లడించారు. ప్రభుత్వ వెబ్ సైట్ లో 60 పేజీల రిపోర్ట్ ను డౌన్లోడ్ చేసుకున్నామని చెప్పారు. దీని మీద ముఖ్యమంత్రి సహా మంత్రులు మీడియా సమావేశాలు ఏర్పాటు చేశారని, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఇచ్చారన్నారు. అన్ని మీడియాల్లో కమిషన్ రిపోర్ట్ ను డిస్ ప్లే కూడా చేశారని, తమకు ఎలాంటి 8బి నోటీస్ ఇవ్వలేదు కాబట్టి ఈ నివేదిక చెల్లదని సుందరం వాదించారు.

ఈ నివేదిక ను అడ్డం పెట్టుకుని అనేక చర్యలకు పాల్పడే అవకాశం ఉందని, కమిషన్ నివేదికతో తన క్లయింట్ మీద చర్యలు తీసుకునేలా ప్రభుత్వం వ్యవహరించవచ్చని, లీగల్ గా కూడా ప్రభుత్వం ముందుకు వెళ్ళే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేసారు. పై కారణాలతో ఈ కమిషన్ నివేదికను పూర్తిగా కొట్టివేయాలి అని న్యాయవాది సుందరం కోరారు. పిటిషనర్ల తరఫు వాదనల అనంతరం నివేదిక ప్రతిని పిటిషనర్లకు ఎందుకు ఇవ్వలేదని హైకోర్టు ధర్మాసనం ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించగా, ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ (ఏజీ) సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు.పిటిషన్లర్లు అసెంబ్లీలో సభ్యులే కదా నివేదిక వారికి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించింది. నివేదికను గోప్యంగా ఉంచాలనుకుంటే, అలాంటప్పుడు ఎందుకు బయట పెట్టారని హైకోర్టు ప్రశ్నించింది.సీఎం నిర్వహించిన మీడియా సమావేశంలో జర్నలిసుల్టకు 60 పేజీల నివేదిక అందజేశారని సుందరం కోర్టు దృష్టికి తీసుకవెళ్లారు. కోర్టుకు సమర్పించిన ప్రతులు సరిగ్గా కనిపించడం లేదని హైకోర్టు పేర్కొంది. నివేదిక ప్రతులు సరిగ్గా కనిపించేలా ఇచ్చిన తర్వాతనే విచారణ చేస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ కేసు ప్రాధాన్యత దృష్ట్యా ఈరోజే విచారణ కొనసాగించాలని కెసిఆర్ తరుపు న్యాయవాది సుందరం కోరారు.

ప్రభుత్వం తరపు న్యాయవాది వాదనలు
కమిషన్ తరపున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించగా,. జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక అధికారికంగా విడుదల చేశారా? అని అడ్వకేట్ జనరల్‌ను హైకోర్టు ప్రశ్నించింది. హైకోర్టు సూటీగా ప్రభుత్వాన్ని మూడు ప్రశ్నలు వేసింది. నివేదిక కాపీను పబ్లిక్ డొమైన్లో పెట్టారా..? పిటిషనర్లకు 8బీ కింద నోటీసులు ఇచ్చారా? లేదా..? కమిషన్ నివేదిక ప్రస్తుత పరిస్థితి ఏంటి..? అని ప్రశ్నించింది. తాము 8బీ కింద నోటీస్ ఇచ్చినట్లు అడ్వకేట్ జనరల్ వివరించారు. సెక్షన్ మెన్షన్ చేయనంత మాత్రాన అది 8 బీ నోటీస్ కాదంటే ఎలా అని అడ్వకేట్ జనరల్ ప్రశ్నించారు. ఈ నివేదికపై అసెంబ్లీలో ప్రభుత్వం చర్చించకు పెట్టనుందని పేర్కొన్నారు. దానిని సభలో చర్చించాల్సిందేనని అడ్వకేట్ జనరల్ పేర్కొంటూ, కిరణ్ బేడి కేసుకు ఈ కేసుకు తేడాలు ఉన్నాయని గుర్తు చేసారు. కాళేశ్వరం రిపోర్టును తాము ఎక్కడా పబ్లిక్ డొమెన్లో పెట్టలేదని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. అసెంబ్లీలో చర్చించాకే పబ్లిక్ డొమైన్లో పెడతామని తెలిపారు. కౌంటర్లో మరిన్ని వివరాలు పొందపరుస్తామని చెప్పారు. ఈ దశలో కమిషన్ నివేదికపై ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయొద్దని హైకోర్టుకు ఏజీ విజ్ఞప్తి చేసారు. అసెంబ్లీలో ఈ నివేదికపై చర్చించాక తదుపరి విచారణ చేపట్టాలని అడ్వకేట్ జనరల్ ధర్మాసనాన్ని కోరారు. కమిషన్ నివేదిక ప్రస్తుతం ఏ దశలో ఉందని హైకోర్టు అడ్వకేట్ జనరల్‌ను ప్రశ్నించింది.

ప్రజాధనం దుర్వినియోగాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ కమిషన్ను ప్రభుత్వం నియమించిందని ఏజీ వివరించారు. కమిషన్ నివేదికను మంత్రులకు సులభంగా అర్థం కావడానికి సంక్షిప్తంగా 60పేజీల నివేదిక రూపొందించి ఇచ్చినట్టు అడ్వకేట్ జనరల్ తెలిపారు. 60పేజీల నివేదిక ఆధారంగా ఘోష్ కమిషన్ నివేదికను కేబినెట్ ఆమోదించినట్టు ఏజి వివరించారు. అసెంబ్లీలో చర్చించి తదుపరి చర్యలు తీసుకునేలా కేబినెట్ నిర్ణయం తీసుకుందని ఏజీ వివరించారు. అసెంబ్లీలో చర్చించే వరకు ఈ పిటిషన్ల విచారణ చేపట్టవద్దని ఏజీ కోరారు. ఈ పిటీషన్లపై కౌంటర్ దాఖలు చేయడానికి సమయం కావాలని ఏజీ కోరారు. సెక్షన్ 8బీ కింద నోటీసులు ఇవ్వలేదని పిటీషనర్లు తప్పుపట్టడం చెల్లదని ఏజీ పేర్కొన్నారు. కాళేశ్వరం కమిషన్ నివేదికను ఎప్పుడు అసెంబ్లీలో ప్రవేశ పెడుతారని హైకోర్టు ప్రశ్నించింది. ఈ నివేదికపై చర్యలు తీసుకున్నాక అసెంబ్లీలో పెడతారా..? లేక ప్రవేశపెట్టకముందే చర్యలు తీసుకుంటారా..? అని హైకోర్టు ప్రశ్నించింది. ఆ సమాచారం తమ వద్ద లేదని తెలుసుకుంటానని ఏజీ కోర్టుకు తెలిపగా, ఆ విషయం తెలుసుకోండని అని సూచిస్తూ, విచారణను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్టు ధర్మాసనం ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News