పాలకుర్తి కాంగ్రెస్ ఎంఎల్‌ఎ యశస్విని రెడ్డి, అత్త ఝాన్సీ రెడ్డికి హైకోర్టు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఝాన్సీ రెడ్డితో పాటు ఆమె భర్త రాజేందర్ రెడ్డికి కూడా నోటీసులు జారీ చేసింది. ఝాన్సీ రెడ్డి 2017లో తొర్రూరు మండలం గుర్తూరు గ్రామం లో 75 ఎకరాల భూమిని కొన్నారు. ఫెమా నిబంధనలను ఉల్లంఘించి భూమి కొనుగోలు చేసిందని దామోదర్ రెడ్డి అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. నిబంధనలకు విరుద్ధంగా ఝాన్సీ రెడ్డికి పాస్ బుక్ మంజూరు చేశారని రెవెన్యూ ప్రిన్సిపాల్ సెక్రటరీ, సిసిఎల్‌ఎ కమిషనర్, జిల్లా కలెక్టర్, ఆర్డీఓ, తహశీల్దార్లకు సైతం హైకోర్టు నోటీసులు జారీ చేసింది. భూమి విషయంలో విచారణ పూర్తి చేసి నివేదికను అందించాలని ఇడి జాయింట్ డైరెక్టర్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కాగా పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి ఝాన్సీ రెడ్డి అత్త. ప్రస్తుతం ఆమె పాలకుర్తి కాంగ్రెస్ ఇంఛార్జ్‌గా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో పాలకుర్తి నుంచి పోటీ చేయాలని ఝాన్సీ రెడ్డి భావించారు. అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును ఓడించేందుకు కాంగ్రెస్ పక్కా ఝాన్సీ రెడ్డిని రంగంలోకి దించేందుకు ఫ్లాన్ చేసింది. అయితే చివరి నిమి షంలో ఝాన్సీ భారత పౌరసత్వంపై వివాదం చెలరేగింది. ఆమె ఎన్‌ఆర్‌ఐ పౌరసత్వం కారణంగా సమస్యలు వస్తాయని భావించి కోడలు యశస్వినీ రెడ్డిని బరిలోకి దింపారు. ఎర్రబెల్లిపై ఆమె విజయం సాధించారు. ఇక చాలా ఏళ్ల క్రితమే అమెరికా వెళ్లిన ఝాన్సీ రెడ్డి అక్కడ ఉమెన్ ఎంపవర్‌మెంట్ తెలుగు అసోసియేషన్ (వేటా) ఫౌండర్, ఫౌండర్ ప్రెసిడెంట్, అడ్వయిజరీ చైర్‌గా వ్యవహరించారు. ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారాలతో పాటు పలు బిజినెస్‌లు చేశారు. అనంతరం తెలంగాణ పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఎన్నికలకు చాలా కాలం క్రితమే స్వస్థలం పాలకుర్తికి వచ్చిన ఆమె.. పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు.