శ్రీకృష్ణ జన్మభూమి షాహీ ఈద్గా వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. షాహీ మసీదును వివాదాస్పద కట్టడంగా పరిగణించాలన్న హిందూ సంఘాల అభ్యర్థనను అలహాబాద్ హైకోర్టు శుక్రవారం కొట్టివేసింది. మధుర లోని శ్రీకృష్ణ జన్మభూమికి ఆనుకుని షాహీ ఈద్దా మసీదు ఉంది. ఈ మసీదును వివాదాస్పద కట్టడంగా పరిగణించాలని అభ్యర్థిస్తూ హిందూ సంఘాల తరఫున శ్రీకృష్ణ ముక్తి ట్రస్ట్ అధ్యక్షుడు మహేంద్ర ప్రతాప్ సింగ్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ముస్లిం సంఘాల తరఫు న్యాయవాది ఈ అభ్యర్థనపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వాదనలు వినిపించారు. ఇరువైపులా వాదనలు విన్న జస్టిస్ మనోహర్ నారాయణ్ మిశ్రా నేతృత్వం లోని సింగిల్ బెంచ్ ఈ పిటిషన్‌ను కొట్టివేసింది. షాహీ ఈద్దా మసీదును వివాదాస్పద కట్టడంగా ప్రకటించడానికి తగిన ఆధారాలు లేవని కోర్టు పేర్కొంది. రెవెన్యూ రికార్డుల్లో కానీ, మున్పిపల్ పన్ను చెల్లింపు రుజువు కానీ మసీదు గురించి ఎక్కడా ప్రస్తావించలేదని హిందూ సమాజాల పిటిషనర్ వాదించారు.
చారిత్రక రచయితల గ్రంధాలను, ప్రభుత్వ డాక్యుమెంట్లను తన వాదనకు రుజువుగా చూపించారు. శ్రీకృష్ణ జన్మభూమి స్థలాన్ని కొంత భాగాన్ని ధ్వంసం చేసి మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు మసీదును నిర్మించారని అందువల్ల మొత్తం 13.37 ఎకరాల భూమి తమకు చెందుతుందని వాదించారు. ఈ వాదనను ముస్లిం తరఫు న్యాయవాది వ్యతిరేకించారు. కొన్నేళ్ల నుంచి మసీదు ఉనికి ఉందని, దీనిని వివాదాస్పద కట్టడంగా చూపించడం సరైన విషయం కాదని వాదించారు.దీనికి చారిత్రక డాక్యుమెంట్లు పిటిషనర్ చూపించడం ప్రశ్నించారు. అయితే కోర్టు మాత్రం తమకు లభించిన ఆధారాలు, డాక్యుమెంట్లు ప్రకారం వివాదాస్పద కట్టడంగా మసీదును ప్రకటించలేదని పేర్కొంది. .ఈ కేసులు ఇరువర్గాల నమ్మకం, విశ్వాసంపై ఆధారపడి ఉన్నాయని దిగువ కోర్టులో దీనిపై విచారణ కొనసాగిస్తే కేసు పరిష్కారంలో ఆలస్యం జరుగుతుందని హైకోర్టు పేర్కొంది.