ఉస్మానియా జనరల్ హస్పిటల్‌ను గోషామహాల్ స్టేడియంకు తరలించిన విషయంలో ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. గోషామహాల్ స్టేడియంలో కొత్త భవనం నిర్మించి ఉస్మానియా హాస్పిటల్‌ను అక్కడికి తరలించాలన్న ప్రభుత్వ నిర్ణయానిన సవాల్ చేస్తూ రాము అనే వ్యక్తి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. స్టేడియంలో పాఠశాల ఉందని, విద్యార్థులకు చెందిన ఆటస్థలంలో హాస్పిటల్ నిర్మాణం సరికాదని పిటిషనర్ వివరించారు. ప్రస్తుత మైదానం కూల్చివేత పనులు జరుగుతున్నాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. స్టేడియానికి చెందిన స్థలాన్ని హాస్పిటల్ కోసం బదలాయిస్తూ తీసుకున్న నిర్ణయం ఏకపక్షమని, పట్టణ ప్రాంతాల అభివృద్ధి చట్టాలు విరుద్దమని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు. పేదలకు వైద్య సదుపాయం అందించడానికే హాస్పిటల్ నిర్మాణం జరుగుతోందన్నారు. అక్కడ ఉన్న ప్రభుత్వ పాఠశాలల్నో విద్యార్థులను ఇతర పాఠశాలల్లో సర్దుబాటు చేసినట్లు కోర్టుకు తెలిపారు. ఎంత స్థలంలో నిర్మాణం చేపడుతున్నారని కోర్టు అడ్వకేట్ జరనల్‌ను ప్రశ్నించింది. ఎంత స్థలంలో కడుతున్నాం, ఎంత ఖాళీ స్థలం ఉంటుంది తదితర పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయడానికి గడువు కావాలని ఏజీ కోరారు. దీనికి అనుమతిస్తూ విచారణను సెప్టెంబర్ 26వ తేదీకి వాయిదా వేసింది. ఈ లోగా హస్పిటల్ కు సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.