పఠాన్ చెరువులోని పాశమైలారం పారిశ్రామికవాడలో జరిగిన సిగాచి పరిశ్రమ పేలుళ్ల ఘటనలో హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈ ఘటనలో 54 మంది మృతి చెందగా, 28 మంది గాయపడ్డారని, 8 మంది ఆచూకి ఇంకా లభించలేదంటూ కె. బాబురావు అనే వ్యక్తి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. సిగాచి పరిశ్రమ సరైన రక్షణా చర్యలు తీసుకోకపోవడంతోనే ఈ ఘటన జరిగిందని పిటిషన్‌లో పేర్కొన్నారు. పిటిషనర్ తరపున న్యాయవాది వాదనలు వినిపిస్తూ…ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా పరిశ్రమల్లో భద్రతా చర్చలు ఉండాలని
ప్రభుత్వాన్ని ఆదేశించాలన్నారు. ఈ కేసును ప్రత్యేక దర్యాప్తు బృందంతో దర్యాప్తు చేయించాలన్నారు. ఇప్పటి వరకు మృతుల ఆచూకీ లేని వాళ్ల కుటుంబాలకు, గాయపడిన వారికి ప్రకటించిన పరిహారం చెల్లించలేదని తెలిపారు. పరిశ్రమ యాజమాన్యంపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని, పరిశ్రమలో పేలుడుకు గల కారణాలపై ఏర్పాటు చేసిన కమిటీ నివేదికను బయట పెట్టాలని వాదించారు. దీంతో ఈ పిటిషన్‌పై మూడు వారాల్గో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఉన్నత ధర్మాసనం ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది. అనంతరం ధర్మాసనం కేసును వాయిదా వేసింది.