అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్ టిఆర్ జిల్లా తిరువూరు మున్సిపల్ ఎన్నికపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మున్సిపల్ కౌన్సిలర్లకు అరగంటలో భద్రతా ఏర్పాట్లు చేయాలని హైకోర్టు ఆదేశించింది. డిసిపి స్థాయి అధికారితో కౌన్సిలర్లకు భద్రత కల్పించాలని వివరించింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లకు భద్రత కల్సించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోర్టుకు విన్నవించింది. ఎన్నికల కమిషన్ ఆదేశాలను పోలీసులు పాటించడం లేదని కోర్టుకు న్యాయవాదులు తెలిపారు. తక్షణమే ప్రశాంత ఎన్నికలకు చర్యలు చేపట్టాలని హైకోర్టు తెలిపింది. మంగళవారం ఉదయం నుండి తిరువూరులో టిడిపి శ్రేణులు అరాచకం సృష్టిస్తున్నాయి. వైసిపి కౌన్సిలర్లను ఎన్నికలకు రాకుండా అడ్డుకోవడానికి టిడిపి కుట్రలు చేస్తోందని వైసిపి ఆరోపణలు చేస్తుంది. వైసిపి కౌన్సిలర్లపై దాడి చేయడానికి టిడిపి కుట్రలు పన్నుతోందన్నారు.
తిరువూరు నగర పంచాయతీ కి సంబంధించి మొత్తం 20 మంది కౌన్సిలర్లులకు ఓటు హక్కు ఉండగా ఎక్స్ అఫీషియల్ హోదాలో ఎమ్మెల్యే ఓటుతో కలిపి మొత్తం 21 ఓట్లు ఉన్నాయి. టిడిపికి ముగ్గురు కౌన్సిలర్లు ఉండగా, వైసిపికి చెందిన కౌన్సిలర్లలో కాకర్లమూడి సుందర్ కుమార్, పసుపులేటి శరత్ బాబు తెదేపాలో చేరారు. మరో ఇద్దరు వైసిపి కౌన్సిలర్లు దారా పద్మా నీలిమ, గతం కస్తూరిబాయి కూడా తెలుగుదేశం పార్టీకి బయట నుండి మద్దతు ఇస్తున్నట్టు సమాచారం. దీంతో టిడిపి 9, వైసిపికి 12 ఓట్లు ఉన్నాయి. వైసిపికి చెందిన కౌన్సిలర్ రమాదేవి విదేశాల్లో ఉండడంతో వైసిపి బలం 11కి పడిపోయినట్టు సమాచారం.