వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్) భారత దేశపు పన్ను సంస్కరణల చరిత్రలో ఒక విప్లవాత్మక మలుపు. ప్రతి సంవత్సరం జులై మొదటి తేదీని వస్తు సేవల పన్ను దినోత్సవంగా దేశంలో పాటిస్తున్నారు. ఇది కేవలం ఒక పన్ను విధానం ఆవిర్భావ దినోత్సవం మాత్రమే కాదు, భారతదేశ ఆర్థిక వ్యవస్థకు ఓ సుస్థిర మార్గాన్ని ఏర్పరిచిన ఘట్టం. దేశవ్యాప్తంగా పన్నుల పరంగా అనేక మోడళ్ల మధ్య జరుగుతున్న గందరగోళానికి ముగింపు పలికిన మలుపు. వస్తు సేవల పన్ను అమలుకు దారితీసిన అవసరాలు ఎన్నో. కొంతకాలం క్రితమే మన దేశంలో విక్రయపు పన్ను, ఎక్సైజ్ సుంకం, సేవలపై పన్ను, రాష్ట్రాల మధ్య వ్యాపార లావాదేవీలపై వేర్వేరు పన్నులు, ప్రవేశపు పన్ను వంటి అనేక రకాల పన్నులు అమలులో ఉండేవి. రాష్ట్రానికి ఒక విధానం, మరో రాష్ట్రానికి మరో విధానంతో వ్యాపార రంగం సంక్లిష్టతలతో కొట్టుమిట్టాడేది.
దీని ప్రభావంగా దేశ వ్యాప్తంగా సమగ్ర వ్యాపార వాతావరణం ఏర్పడలేకపోయింది. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారంగా ఒకే విధమైన పన్ను విధానాన్ని రూపొందించారు. దీని ఫలితంగా దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానం అమలులోకి వచ్చింది. దీనివల్ల పన్నుల వ్యవస్థ (Tax system)సరళతరం అయింది. వ్యాపారులు పన్నుల వివరాలు సమర్పించడంలో నూతన సాంకేతిక పద్ధతులను ఉపయోగించటం ప్రారంభించారు. ఈ పన్ను విధానం మూడు భాగాలుగా విభజించబడింది. తయారీదారునుండి తుది వినియోగదారుని వరకు ప్రతి దశలో విధించబడే పన్నును తక్షణమే ముందుగానే చెల్లించిన పన్నుతో సమన్వయం చేసుకునే అవకాశం కల్పించబడింది. దాని వల్ల ఒకే వస్తువుపై పన్ను మీద పన్ను విధించే పరిస్థితి లేకుండాపోయింది. ఈ విధానంలో కేంద్రానికి ఒక భాగం, రాష్ట్రానికి మరో భాగం లభించేలా పన్ను వసూలు జరుగుతుంది.
అంతర్రాష్ట్ర వ్యాపార లావాదేవీలపై ప్రత్యేకంగా మరో విధానంలో వసూలు జరుగుతుంది. దీనివల్ల రాష్ట్రాల మధ్య వస్తువుల రవాణా సులభతరమైంది. వాణిజ్యానికి ఆటంకాలు తొలగిపోయాయి. ప్రస్తుతం ఈ పన్ను విధానం నాలుగు ప్రధాన శ్రేణులుగా విభజించ బడింది. అవసరమైన నిత్యావసర వస్తువులకు తక్కువ శాతం, విలాస వస్తువులకు ఎక్కువ శాతం విధించబడుతున్నాయి. దీనివల్ల సామాన్యులపై భారం తగ్గించబడి, విలాస వస్తువుల వినియోగంపై నియంత్రణ సాధించబడుతోంది. ఈ పన్ను విధానం ప్రారంభం తరువాత ప్రభుత్వ ఆదాయ వనరులు గణనీయంగా పెరిగాయి. 2024- 25 ఆర్థిక సంవత్సరంలో పన్ను ద్వారా వచ్చిన ఆదాయం 22.08 లక్షల కోట్ల రూపాయలకుపైగా ఉండటం గమనించదగినది.
ఇది పాలనా సామర్థ్యాన్ని సూచించడమే కాదు, పన్ను చెల్లింపులో పారదర్శకతను, ప్రజల నమ్మకాన్ని ప్రతిబింబిస్తోంది. అయితే, దీనిలో కొన్ని సవాళ్లు ఇప్పటికీ ఎదురవుతున్నాయి. ముఖ్యంగా చిన్న, మధ్య తరహా వ్యాపారులు ఈ పద్ధతిలో పూర్తిగా స్థిరపడలేకపోతున్నారు. పన్ను వేదికపై సాంకేతిక సమస్యలు, ఖాతాల సర్దుబాటు లోపాలు, ఎంటరైన పన్ను మొత్తాన్ని తిరిగి వాడుకునే అవకాశాలపై చిక్కులు, తరచూ మారే నిబంధనలు వీటన్నీ వ్యవస్థపై కొంత అస్పష్టత కలిగిస్తున్నాయి. వస్తు సేవల పన్ను దినోత్సవం అనేది ఈ విధానంపై ప్రజలలో అవగాహన పెంపు, ప్రయోజనాలపై చర్చలు, విధాన బలాలపై మద్దతు, లోపాలపై పరిష్కారాలకు మార్గదర్శనం చేసే సందర్భంగా పరిగణించాలి.
కేంద్ర ప్రభుత్వంతోపాటు రాష్ట్రాలు, పరిశ్రమల సంఘాలు, వాణిజ్య మండలాలు ఈ దినాన్ని పురస్కరించుకొని అవగాహన కార్యక్రమాలు, సదస్సులు, వర్క్‌షాపులు నిర్వహించడం ప్రాశస్త్యం. ఈ విధానం ద్వారా దేశీయ పెట్టుబడులే కాకుండా, విదేశీ పెట్టుబడులకు కూడా అనుకూల వాతావరణం ఏర్పడింది. వ్యాపారానికి అనువైన విధానంగా దీన్ని అంతర్జాతీయంగా గుర్తిస్తున్నారు. మొత్తంగా ఇది కేవలం పన్ను విధానం కాదని, దేశఆర్థిక సమీకరణకు ఒక నూతన దిశనిచ్చిన మార్గదర్శకంగా నిలుస్తున్నది. పన్ను చెల్లింపు దారులు, వ్యాపారులు, పాలకులు, ప్రజలందరూ ఈ వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చుకోవాలన్న సంకల్పంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉంది.
– రామకిష్టయ్య సంగనభట్ల, 94405 95494