రాయ్‌పూర్: తాను చేయని తప్పుకు హెచ్‌ఐవి సోకిందని దేవుడిపై కోపంతో ఓ వ్యక్తి పలు దేవాలయాల్లో హుండీలోని డబ్బులను ఎత్తుకెళ్లాడు. ఈ సంఘటన ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… యశ్వంత్ ఉపాధ్యాయ్ అనే వ్యక్తి(45) ఓ జైన్ ఆలయంలో హుండీలోని డబ్బులను ఎత్తుకెళ్లడంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఎందుకు హుండీలో డబ్బులను దొచుకున్నావని పోలీసులు ప్రశ్నించడంతో అవాక్కయ్యే జవాబులు చెప్పాడు. 2012లో ఓ దాడిలో కేసులు యశ్వంత్ జైలుకెళ్లాడు.
Also Read: తీర్పులపై వక్రభాష్యాలు.. ఇదేం తీరు?
జైలులో ఉన్నప్పుడు అతడికి హెచ్‌ఐవి వ్యాధి సోకింది. తాను చేయని తప్పుకు హెచ్‌ఐవి వ్యాధి సోకిందని దేవుడే కారణమని, అందుకే దేవుడిపై పగ తీర్చుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు. దేవాలయాల్లో హుండీల్లో ఉన్న డబ్బులను మాత్రమే టార్గెట్ చేసేవాడు. అక్కడ విలువైన వస్తువులను మాత్రం ముట్టుకునేవాడు కాదు. దొంగతనం చేసే ముందు ఆలయాల్లో రెక్కీ నిర్వహించేవాడు. ఆలయానికి దూరంలో బైక్‌ను పార్క్ చేసి అనంతరం దుస్తులను మార్చుకునేవాడు.
దేవాలయంలో వెళ్లిన తరువాత హుండీ తాళాన్ని పగులగొట్టి డబ్బును ఎత్తుకెళ్లేవాడు. అనంతరం బైక్ దగ్గరికి వచ్చిన తరువాత మళ్లీ దుస్తులను మార్చుకునేవాడు. దొంగతనం చేసిన తరువాత సిసి కెమెరాల కంట పడకుండా రహదారుల గుండా కాకుండా చిన్న చిన్న దారుల గుండా తప్పించుకునేవాడు. దేవుడిపై ప్రతీకారంతో దొంగతనాలు చేస్తున్నానని చెప్పడంతో పోలీసులు షాక్ అయ్యారు. ఇప్పటివరకు చాలా దేవాలయాల్లో దొంగతనం చేశానని వివరణ ఇచ్చాడు. నెవాయి పోలీసులు అతడిని అరెస్టు చేసి రిమాండ్ తరలించారు. అతడు దొంగతనం చేసిన ఆలయాల సంఖ్య 12 అని పోలీసులు వెల్లడించారు. తనకు గుర్తు లేదని ఎక్కువగా ఉంటుందని యశ్వంత్ మీడియాకు తెలిపాడు.