మన తెలంగాణ/ఉప్పల్: మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై ఎక్సైజ్ శాఖ దూకుడు పెంచింది. స్పెషల్ ఫోకస్ పెట్టి భారీ స్థాయిలో గంజాయిని(Cannabis) పట్టుకుంది. ఉప్పల్ మల్లాపూర్ హెచ్‌సిఎల్ ప్రాంతంలోని ఓ గోదాంలో 106 కిలోల గంజాయిని రూ. 10 లక్షల విలువైన గంజాయిని స్వాధీనం(Seize) చేసుకొని ఇద్దరిని అదుపులోకి తీసుకుంది. పరారీలో ఉన్న అసలు నిందితుడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. అందిన సమాచారం ఆధారంగా సోమవారం జిల్లా టాస్క్ ఫోర్స్, ఉప్పల్ ఎక్సైజ్ పోలీసులు(Police) సంయుక్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించి మల్లాపూర్ ప్రాంతంలోని హెచ్‌సిఎల్ గోదాం వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా గంజాయి అక్రమ రవాణా గుట్టు రట్టయింది. ఒడిశా రాష్ట్రం నుంచి కారులో గంజాయి తరలించారని విచారణలో వెల్లడైంది.
పట్టుబడిన వారి సమక్షంలోనే గోదాంలో తనిఖీ చేసిన అధికారులు 2 కిలోల చొప్పున 56 ప్యాకెట్లు, 1 కిలో చొప్పున 6 ప్యాకెట్లు గంజాయి(Cannabis) స్వాధీనం(Seize) చేసుకున్నారు. దీని విలువ రూ.10 లక్షలు ఉంటుందని అధికారులు(Police) అంచనా వేశారు. అదనపు ఎక్సైజ్ కమిషనర్ సయ్యద్ యాసిన్ ఖురేషి, రంగారెడ్డి డిప్యూటీ కమిషనర్ పి. దశరథ్ నేతృత్వం వహించారు. మల్కాజిగిరి ఎక్సైజ్ సూపరింటెండెంట్ నవీన్ కుమార్, ఎఇఎస్ ముకుందరెడ్డి, ఉప్పల్ ఎస్‌హెచ్‌ఓ బి. ఓంకార్, డీటీఎఫ్ సీఐ భరత్ భూషన్, ఎస్సైలు నరేశ్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డిలు ఆకస్మిక తనిఖీలలో పాల్గొన్నారు. ఒరిస్సా కు చెందిన రాంబాబు కర్నూల్ అలియాస్ రాము పరారీలో ఉండగా ఘట్కేసర్ కు చెందిన కట్ల వివేక్ రెడ్డి (35), మేడిపల్లి ప్రాంతానికి చెందిన దగ్గుమల్లి మధు కిరణ్ (34) లను అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరూ కేవలం రూ.50 వేల కమీషన్ కోసం మధ్యలో వెళ్లి ఎక్సైజ్ అధికారులకు చిక్కడం గమనార్హం.
మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కు పాదం
మాదకద్రవ్యాల ముఠాలను సమూలంగా నిర్మూలించేందుకు ఎక్సైజ్ శాఖ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని అధికారులు తెలిపారు. అక్రమ రవాణాపై నిరంతరం దాడులు కొనసాగుతాయని స్పష్టం చేశారు.