Sunday, July 6, 2025

భక్తుల నారసింహ నామస్మరణతో మార్మోగిన యాదగిరి క్షేత్రం

- Advertisement -
- Advertisement -

తెలంగాణ తిరుపతి శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారి జన్మనక్షత్రాన్ని పురస్కరించుకొని శనివారం వైభవంగా గిరి ప్రదక్షిణ నిర్వహించారు. యాదగిరిగుట్టలో ఆధ్యాత్మిక వైభవాన్ని చాటుతూ దేవస్థానం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన గిరిప్రదక్షిణలో అశేషంగా భక్తులు పాల్గొన్నారు. యాదాద్రి కొండపైన అర్చకులు అష్టోత్తర శతఘటాభిషేకాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. గిరిప్రదక్షిణకు వచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు, కొండపైన నారసింహుడి నామస్మరణతో మార్మోగింది. గిరిప్రదక్షిణతో పాటు అష్టోత్తర శతఘటాభిషేకంలో భక్తులు పాల్గొని తీర్థప్రసాదాన్ని స్వీకరించారు. యాదగిరిగుట్ట సింహద్వారం దగ్గర శ్రీలక్ష్మీనరసింహస్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, గిరిప్రదక్షిణను భక్తులు, ఆలయ అధికారులు ప్రారంభించారు. గిరిప్రదక్షిణ అనంతరం స్వామివారి కొండపైకి మెట్ల ద్వారా భక్తులు కొండపైకి చేరుకొని శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు..
శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి స్వాతినక్షత్రం సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. శ్రీవేంకట అన్నమాచార్య ట్రస్ట్ ఆధ్వర్యలో కూచిపూడి నృత్య ప్రదర్శన, శ్రీసరస్వతి స్వరాలయం వారి భక్తి సంగీతంతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి.

శ్రీనారసింహుడి నిత్యరాబడి..
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారికి నిత్యరాబడిలో భాగంగా శనివారం రూ.26,96,858 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా రూ.2,09,300, బ్రేక్ దర్శనం ద్వారా రూ.2,53,500, విఐపి దర్శనం ద్వారా రూ.3,00,000, కొండపైకి వాహన ప్రవేశం ద్వారా రూ.4,36,000, సువర్ణ పుష్పార్చన ద్వారా రూ.63,432, ప్రసాద విక్రయం ద్వారా రూ.11,12,610, కల్యాణకట్ట ద్వారా రూ.41,000తో పాటు వివిధ శాఖ, పాతగుట్ట ఆలయం ద్వారా ఆలయం వచ్చినట్లు అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News