తెలంగాణ తిరుపతి యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. శ్రావణమాసం, ఆదివారం సెలవు రోజు కావడంతో స్వామివారి దర్శనార్ధం వివిధ ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చారు. ఆదివారం తెల్లవారుజామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతం, అర్చనను శాస్త్రోక్తంగా నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనాలకు అనుమతించారు. శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న భక్తులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో జరిగిన శ్రీసుదర్శన నారసింహ హోమం, నిత్యకల్యాణం, నిత్యబ్రహ్మోత్సవం, వెండి జోడి సేవ, స్వర్ణపుష్పార్చన, శ్రీసత్యనారాయణస్వామి వ్రత పూజలలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.
స్వామి, అమ్మవార్ల శీఘ్రదర్శనం 4 గంటలు, అతిశీఘ్రదర్శనం 3 గంటల సమయం పట్టినట్లు ఆలయ అధికారులు తెలిపారు. యాదగిరిగుట్ట కొండపైన దర్శన క్యూలైన్లతో పాటు ప్రసాద విక్రయ కేంద్రం, శివాలయం, పలు కూడళ్లలో భక్తుల సందడి నెలకొంది. శ్రీలక్ష్మీనరసింహస్వామి వారితో పాటు యాదాద్రి కొండపైన కొలువైన శ్రీపర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాతగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకొని ఆలయంలో జరిగిన నిత్యపూజలలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
శ్రీనారసింహుడి నిత్యరాబడి..
శ్రీలక్ష్మీనరసింహస్వామి వారికి నిత్యరాబడిలో భాగంగా ఆదివారం రూ.58,05,696 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా రూ.3,02,550, బ్రేక్ దర్శనం ద్వారా రూ.5,49,300, వీఐపీ దర్శనం ద్వారా రూ.11,25,000, కొండపైకి వాహన ప్రవేశం ద్వారా రూ.6,66,000, సువర్ణ పుష్పార్చన ద్వారా రూ.1,43,980, ప్రసాద విక్రయం ద్వారా రూ.19,89,310, కల్యాణకట్ట ద్వారా రూ.1,20,000తో పాటు వివిధ శాఖ, పాతగుట్ట ఆలయం ద్వారా ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు.
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు..
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. హైదరాబాద్‌కు చెందిన కళావతి కళాక్షేత్రం వారిచే కూచిపూడి నృత్యం, హైదరాబాద్‌కు చెందిన రోణంకి వాసుదేవరావు బృందం భక్తి సంగీతం భక్తులను ఎంతగానో అలరించింది.
స్వామి వారి సేవలో..
శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ సురేంద్రమోహన్ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనకు ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేయగా, అధికారులు స్వామి వారి ప్రసాదం, జ్ఞాపికను అందజేశారు.