నారసింహుడి నిత్యరాబడి రూ.50.84 లక్షలు
మనతెలంగాణ/యాదగిరిగుట్ట ః తెలంగాణ ప్రసిద్ధి క్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వరుస సెలవులు రావడంతో స్వామి, అమ్మవార్ల దర్శనార్ధం వివిధ ప్రాంతాల నుండి భక్తులు భారీగా తరలివస్తుండడంతో యాదగిరిగుట్టలో సందడిగా మారింది. శ్రావణమాసం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. శనివారం తెల్లవారుజామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతం, అర్చనను శాస్త్రోక్తంగా నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనాలకు అనుమతించారు. శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న భక్తులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో జరిగిన శ్రీసుదర్శన నారసింహ హోమం, నిత్యకల్యాణం, నిత్యబ్రహ్మోత్సవం, వెండి జోడి సేవ, స్వర్ణపుష్పార్చన, శ్రీసత్యనారాయణస్వామి వ్రత పూజలలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం కొండపైన కొలువైన శ్రీపర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాతగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకొని ఆలయంలో జరిగిన నిత్యపూజలలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
శ్రీనారసింహుడి నిత్యరాబడి..
శ్రీలక్ష్మీనరసింహస్వామి వారికి నిత్యరాబడిలో భాగంగా శనివారం రూ.50,84,453 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా రూ.3,57,100, బ్రేక్ దర్శనం ద్వారా రూ.4,44,600, వీఐపీ దర్శనం ద్వారా రూ.9,00,000, కొండపైకి వాహన ప్రవేశం ద్వారా రూ.6,42,000, సువర్ణ పుష్పార్చన ద్వారా రూ.1,18,816, ప్రసాద విక్రయం ద్వారా రూ.16,22,570, కల్యాణకట్ట ద్వారా రూ.1,05,100తో పాటు వివిధ శాఖ, పాతగుట్ట ఆలయం ద్వారా ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు.
ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు..
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను పురస్కరించుకొని దేవస్థానం గోశాలలో కృష్ణాష్టమి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా గోశాలలోని గోవులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త బి.నర్సింహ్మమూర్తి, ఆలయ అధికారులు, సిబ్బంది, గోశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
శ్రీవారి సేవలో ప్రముఖులు..
శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని శనివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాజ్‌నీష్‌గుప్తా, తెలంగాణ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు కుటుంబ సమేతంగా వేర్వేరుగా శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామి, అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వారికి వేదాశీర్వచనం చేయగా, అధికారులు స్వామివారి ప్రసాదం, జ్ఞాపికను అందజేశారు.