Monday, May 26, 2025

మానవ బాంబులతో మారణహోమానికి కుట్ర

- Advertisement -
- Advertisement -

విజయనగరం, హైదరాబాద్, ముంబై, ఢిల్లీ,
బెంగళూరులో రెక్కీ ఆత్మాహుతి దాడులకు
20 మంది యువకులు సిద్ధం ఉగ్రవాదులు
సిరాజ్, సమీర్ విచారణలో సంచలన విషయాలు
రెండు దేశాల నుంచి నిందితులకు ఆర్థిక సాయం
సోషల్ మీడియా ఖాతాలు, అహీం సంస్థ
మూలాలు, విదేశీ ఫోన్ కాల్స్‌పై ఎన్‌ఐఎ ఆరా

మన తెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్ సహా ఐదు రాష్ట్రాల్లో మానవ బాంబులతో మారణహోమం సృష్టించేందుకు హైదరాబాద్, విజయనగరంలో పట్టుబడ్డ ఉగ్రవాదులు సిరాజ్, సమీర్ లు వ్యూహ రచన చేసినట్లు తెలిసింది. ఆదివారం మూడో రోజు విచారణలో పలు సంచలన విషయాలు వెల్లడయ్యా యి. హైదరాబాద్ ‘ఉగ్ర’ కుట్ర కోణం కేసులో తెలంగాణ, ఎపి పోలీసులు, కేంద్ర దర్యాప్తు అధికారుల విచారణ కొనసాగుతోంది. కూపీలాగుతుంటే షా కింగ్ నిజాలు బయటపడుతున్నాయి. దేశంలో ఐదు చోట్ల భారీ పేలుళ్లకు సిరాజ్, సమీర్ కుట్రలు చేశారని సంచలన విషయాలు వెలుగు చూశాయి. విజయనగరం, హైదరాబాద్, ముంబై తో పాటు ఢిల్లీ, బెంగళూరులలో పలుమార్లు నిందితులు ఉగ్రకుట్రకు రెక్కీ నిర్వహించినట్లు తెలిసింది. విశాఖకు చెందిన రిటైర్డ్ రెవెన్యూ అధికారి పాత్రపై అధికారులు ఆరా తీశారు.

ఈ కుట్రలో కీలక సూత్రధారిగా వరంగల్‌కు చెందిన ఫర్హాన్ వ్యవహరించాడు. యూపీకి చెందిన బాదర్‌తోనూ సిరాజ్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు వెల్లడైంది. బాదర్, ఫర్హాన్ కోసం నాలుగు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. అహీం అనే సంస్థను స్థాపించిన సిరాజ్ మానవబాంబులుగా 20 మంది యువకులను సిద్ధం చేసినట్లు విచారణలో వెల్లడైంది. 12 మందితో ఏర్పాటైనట్లుగా చెప్పబడుతున్న అహీం సంస్థ సభ్యులను గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. అయితే వీరికి ఒమన్, సౌదీ నుంచి ఆర్థిక సాయం అందినట్లు తెలుస్తోంది. మ్యాజిక్ లాంథర్ కాన్సెప్ట్ ఆధారంగా అహిం సంస్థ పని చేస్తోందని తేల్చారు. మతోన్మాద భావాలున్న యువతను లక్ష్యంగా చేసుకుని సంస్థ పని చేస్తోందని నిందితుల నుంచి రాబట్టారు.

సోషల్ మీడియాలో మత విద్వేష పోస్టులు పెట్టినవారిని గుర్తించి ఈ సంస్థలో చేర్చుకుంటున్నారు. భారతదేశం అంతటా అహీం సంస్థను విస్తరించడమే సౌదీ అరేబియా, ఒమన్ హ్యాండ్లర్‌ల లక్ష్యం. ఇప్పటికే ఏపీ, బీహార్, ఛత్తీస్‌గఢ్‌తో పాటు మరో రాష్ట్రంలో అహీం గ్రూపును ఏర్పాటు చేశారని విచారణలో ఉగ్రవాది సిరాజ్ నుంచి అధికారులు సమాచారం రాబట్టారు. విజయనగరంలో పేలుళ్లు సక్సెస్ ఐతే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున పేలుళ్లు జరపడానికి నిర్ణయించారు. ఓ రకంగా చెప్పాలంటే విజయనగరం పేలుళ్లను రిహార్సల్స్ లా భావించారు. ఉగ్రవాదులు సిరాజ్, సమీర్‌లను ఎటిఎస్, ఎన్‌ఐఎ, ఇంటెలిజెన్స్ అధికారులు ప్రశ్నించారు. ఇద్దరికీ ఒకే తరహా ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. ఉగ్రవాద సంబంధాలు, పేలుడు పదార్థాల కొనుగోలు, ఆర్థిక వనరులు సమకూర్చిన వారి పేర్లు అడిగారు. పేలుళ్ల కుట్రను ఎక్కడ? ఎప్పుడు? ఎలా? అమలు చేసేందుకు ప్లాన్ చేశారని ఇద్దరినీ ప్రశ్నించారు. కొన్ని ప్రశ్నలకు సిరాజ్ ముక్తసరిగా సమాధానాలు చెప్పారని సమాచారం.

సిరాజ్ అద్దెకి ఉంటున్న ఇంట్లో పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలను ఇటీవల పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విజయనగరం జిల్లాలోని బాబమెట్ట ఏరియాలో డబుల్ కాలనీలో సిరాజ్ రూమ్ రెంట్ కు తీసుకుని ఉంటున్నాడు. రాత్రి సమయాల్లో కొండ ప్రాంతంలో ఒంటరిగా తిరిగేవాడని స్థానికులు చెబుతున్నారు. అప్పుడప్పుడు పాన్ షాప్‌లలో గుట్కా కొనేవాడని అంటున్నారు. అటు సిరాజ్ తండ్రి రెహ్మాన్‌పై కూడా ఎన్‌ఐఎ ఫోకస్ చేసింది. రెహ్మాన్ రెండు సార్లు బ్యాంక్ లాకర్ తెరవడానికి ఎందుకు ప్రయత్నించాడన్న కారణాలపై ఎన్‌ఐఎ ఆరా తీసింది. రెహ్మాన్ పలు మార్లు బ్యాంకుకు వెళ్లడంతో మఫ్టీలో ఓ అధికారిని కూడా ఎన్‌ఐఎ బ్యాంక్ వద్ద ఉంచింది.

మరోవైపు పేలుడు పదార్థాల కేసులో కన్యకాపరమేశ్వరి ఆలయ ప్రాంతంలో ముగ్గురు వ్యాపారులను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ముగ్గురూ క్వారీ బ్లాస్టులకు సంబంధించి అనధికారికంగా పేలుడు పదార్థాలు అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరి దగ్గరే సిరాజ్ కొన్ని పేలుడు పదార్థాలు కొన్నట్టుగా అనుమానిస్తున్నారు. అయితే సిరాజ్, సమీర్లు ఎక్కడెక్కడ బాంబు బ్లాస్ట్‌కి పన్నాగం పన్నారనే అంశంపై ఎన్‌ఐఎ ఆరా తీస్తోంది. వారి నెట్‌వర్క్ తదితర అంశాలపై వివరాలను సేకరిస్తున్నారు. ఉగ్రవాద విదేశీ లింకులు, పేలుళ్ల కుట్ర, ఆర్థిక వ్యవహారాలపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. సోషల్ మీడియా ఖాతాలు, అహీం సంస్థ మూలాలు, విదేశీ కాల్స్‌పై ఆరా తీశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News