పటాన్‌చెరు: హైదరాబాద్ శివారులోని పటాన్‌చెరు డివిజన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ వ్యవహారంలో ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనలో యువకుడు మృత్యువుతో పోరాడుతున్నాడు. రామచంద్రావురం పిఎస్ పరిధిలోని బండ్లగూడ బాలాజీ నగర్‌లో యువతి రమ్య(23) కుటుంబసభ్యులు 8 ఏళ్లుగా నివాసం ఉంటున్నారు. ఆ అమ్మాయి డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. మూడు సంవత్సరాలుగా ప్రవీణ్ అనే యువకుడితో ప్రేమలో ఉంది. అయితే ఇద్దరి కులాలు వేరు కావడంతో వివాహానికి తల్లిదండ్రులు అంగీకరించలేదు. దీంతో రెండు కుటుంబాల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో సోమవారం రమ్య తల్లిదండ్రులు పనికి వెళ్లిన సమయంలో ప్రవీణ్ ఆమె ఇంటికి వచ్చాడు. యువతి తల్లిదండ్రులు భోజనానికి వచ్చే సమయానికి రమ్య, ప్రవీణ్ రక్తపు మడుగులో పడి ఉన్నారు. ప్రవీణ్ కొన ఊపిరితో ఉండటంతో ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకొని క్లూస్ టీమ్ సహాయంతో వివరాలు సేకరిస్తున్నారు. యువతిని హత్య చేసి ప్రవీణ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడా..? లేదా వేరే ఏమైనా జరిగిందా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.