హైదరాబాద్ నగరంలోని బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. నిత్యం మద్యం తాగి వచ్చి తనని వేధిస్తున్నాడని కారణంగా భర్తను భార్య గొంతు నులిమి హత్య చేసింది. ఆపై అది సాధారణ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. 2014లో మహబూబ్‌నగర్ జిల్లా రామకృష్ణయ్య పల్లికి చెందిన అంజిలప్పకు రాధ అనే మహిళతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం కలిగారు. గతంలో ముంబైతో పాటు హైదరాబాద్‌లోని మణికొండలో నివాసం ఉన్నారు.
తాజాగా నిజాంపేటలోని ఓ భవన నిర్మాణ సంస్థలో కార్మికులుగా చేరారు. అక్కడే గుడిసెలో నివాసం ఉంటూ.. నిత్యం గొడవపడేవారు. అంజిలప్ప రోజు తాగి వచ్చి.. భార్య రాధను అనుమానిస్తూ ఉండేవాడు. ఇది తట్టుకోలేకపోయిన రాధ.. జూన్ 22న రాత్రి మద్యం మత్తులో ఉన్న భర్తను గొంతు నులిమి హత్య చేసింది. ఆపై దాన్ని సహజ మరణంగా చిత్రీకరించింది. మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించి.. అంత్యక్రియలకు ఏర్పాటు చేస్తుండగా.. మృతుడి బంధువులకు అనుమానం వచ్చి నారాయణపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసును బాచుపల్లి స్టేషన్‌కు బదిలీ చేశారు. దర్యాప్తులో భర్తను రాధ హత్య చేసినట్లు నిర్ధారణ జరిగింది. దీంతో ఆమెను న్యాయస్థానంలో హాజరుపరిచారు.