రంగారెడ్డి: హైదరాబాద్ మహానగరంలో భారీ వర్షం కురుస్తోంది. దీంతో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాల్లో ఐఎండి హైఅలెర్ట్ ప్రకటించింది. నగర వాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచనలు చేశారు. బుధవారం ఉదయం నగరంలోని పలుచోట్ల వాన పడుతోంది. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేయడంతో పాటు మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.
గచ్చిబౌలి, జూబ్లీహిల్స్, బంజారా హిల్స్, సనత్ నగర్, అమీర్ పేట్, పంజాగుట్ట, బేగంపేట్, సికింద్రాబాద్, ఆల్వాల్, మియాపూర్, లింగంపల్లి, బషీర్‌బాగ్, లక్డీకపూల్, లిబర్టీ, ఆబిడ్స్, కోఠి, మలక్ పేట్, దిల్ సుఖ్ నగర్, ఎల్బీనగర్, హయత్ నగర్, ఉప్పల్, హబ్సిగూడు, తార్నాక తదితర ప్రాంతాల్లో వాన పడుతోంది. దీంతో పలు ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి. పలు ప్రాంతాలలో రోడ్లపై నీళ్లు నిలవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో వాహనదారులు ముందుకు కదలలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రంగంలోకి దిగిన జిహెచ్ ఎంసి సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఐటి ఎంప్లాయిస్ కు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని కంపెనీలకు పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.