హైదరాబాద్ నగర వాసులకు బ్యాడ్ న్యూస్. మెట్రో చార్జీల పెంపుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో చార్జీలను భారీగా పెంచింది మెట్రో రైలు సంస్థ. హైదరాబాద్ మెట్రో వేలాది మంది ఉద్యోగులకు, విద్యార్థులకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. ఈ మెట్రోలో ప్రతి రోజు లక్షలాది మంది ప్రజలు ప్రయాణిస్తూ.. సులువుగా వారి గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. అయితే గత కొంతకాలంగా ఎల్ అండ్ టి సంస్థ నష్టాల్లో కొనసాగుతోంది. దీంతో ఛార్జీల పెంపుపై ప్రభుత్వానికి మెట్రో సంస్థ నివేదికలు అందజేసింది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో చార్జీలను పెంచుతున్నట్లు మెట్రో యాజమాన్యం ప్రకటించింది. కనిష్ఠ ధర రూ.10 నుంచి రూ.12కు, గరిష్ఠ ధర రూ.60 నుంచి రూ.75కు పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. పెంచిన చార్జీలు ఎల్లుండి (మే 17) నుండి అమలులోకి రానున్నట్టు మెట్రో రైలు సంస్థ వెల్లడించింది.
ప్రస్తుతం మెట్రో ఆపరేషన్స్, మాల్స్ అద్దెలు, ప్రకటనల ద్వారా ఏటా రూ. 1500 కోట్ల వరకు ఆదాయం మెట్రోకు సమకూరుతోంది. తాజా చార్జీల పెంపుతో అదనంగా మరో రూ.150 కోట్ల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అయితే, మెట్రో చార్జీల పెంపు నిర్ణయంతో సామాన్య ప్రయాణికులపై భారం పడే అవకాశం ఉంది.