Saturday, May 24, 2025

రాష్ట్రానికి కేంద్ర సంస్థలు

- Advertisement -
- Advertisement -

చిరుధాన్యాలపై పరిశోధన,
వేగవంతంగా మౌలిక వసతుల
కల్పన సికింద్రాబాద్‌లో
రైల్వే భద్రతకు కవచ్ ప్రాజెక్టు
మేడిగడ్డ కేసులను రాష్ట్ర
ప్రభుత్వం సిబిఐకి
అప్పగించాలి బిఆర్‌ఎస్
మునిగిపోతున్న నౌక కవిత
తరహా లేఖలు సహజం :
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు కొత్త కేంద్ర సంస్థలను అందిస్తోందని కేంద్ర మంత్రి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కిషన్‌రెడ్డి వెల్లడించారు. ఇప్పటికే ఎన్నో కేంద్ర సంస్థలు ఉన్న హైదరాబాద్‌కి మరికొన్ని సంస్థలు రానున్నాయని, త్వరలోనే వాటిని ప్రారంభిస్తామని ఆ యన పేర్కొన్నారు. మిల్లెట్స్ ప్రాధాన్యతను పెం చేందుకు కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయి లో అనేక దేశాలతో ఎంవోయూలు కుదుర్చుకు ని, కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ చర్యలు చే పడుతోందని తెలిపారు. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పలు అంశాలను ప్రస్తావించారు. తెలంగాణలో అంతర్జాతీయ స్థాయి మిల్లెట్స్ పరిశోధనా కేంద్రాన్ని కేంద్రం మంజూరు చేసిందని తెలిపారు. రూ.250 కోట్లతో ‘గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆన్ మిల్లెట్స్’ను కేంద్ర వ్యవసాయ శాఖ ఏర్పాటు చేయనుందని ప్రకటించారు. చిరుధాన్యాల వినియోగాన్ని ప్రోత్సహిస్తూ, ఆరోగ్యకరమైన భారత నిర్మాణం కోసం 2023 మార్చి 18న ‘పీఎం శ్రీ అన్న’ పథకాన్ని ప్రారంభించినట్లు గుర్తు చేశారు.

ఇప్పటికే ఐసిఏఆర్ పరిధిలోని ఐఐఎంఆర్ ఆధ్వర్యంలో మిల్లెట్స్ పై పరిశోధనలు జరుగుతున్నాయని వివరించారు. ఈ పరిశోధనలను మరింత సమర్థవంతంగా కొనసాగించేందుకు కొత్తగా ఏర్పడే గ్లోబల్ సెంటర్ కీలక పాత్ర పోషించనుందని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ కేంద్రం పూర్తి స్థాయిలో పనిచేయడం ప్రారంభించిన తర్వాత, చిరుధాన్యాలపై పరిశోధన, అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన వేగంగా జరుగుతుందని తెలిపారు. హైదరాబాద్‌లో ఏర్పాటు కాబోతున్న ఈ కేంద్రంలో సెంట్రల్ ఇన్స్ట్రుమెంటేషన్ ల్యాబ్, ఇంటర్నేషనల్ హాస్టల్, మిల్లెట్స్ మ్యూజియం, రీసెర్చ్ ఫాంలు, ట్రైనింగ్ రూమ్‌లు, ఇంటర్నేషనల్ గెస్ట్ హౌస్ ఏర్పాటు చేయనున్నారని చెప్పారు. అలాగే జీన్ ఎడిటింగ్ గ్రీన్ హౌజ్‌లు, స్పీడ్ బ్రీడింగ్ ల్యాబ్స్, ఫినోమిక్స్ ల్యాబ్స్ వంటి ఆధునిక పరిశోధనా వసతులు కూడా అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. మిల్లెట్స్ సాగు కోసం నాణ్యమైన విత్తనాలను ముఖ్యంగా తెలంగాణ రైతులకు అందిస్తామని స్పష్టం చేశారు. ఈ కేంద్రం ద్వారా రైతులకు రెగ్యులర్ శిక్షణ, వ్యాల్యూ యాడెడ్ ప్రొడకట్స్ మార్కెటింగ్‌కు సహకారం, స్టార్టప్లకు ప్రోత్సాహం లభించనుందని అన్నారు.

రైల్వే భద్రతకు కవచ్ ప్రాజెక్టు
రైల్వే భద్రత కోసం కేంద్రం కవచ్ ప్రాజెక్టును తీసుకురావడంపై దృష్టి పెట్టిందని, అది కూడా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో ‘కవచ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ను ప్రారంభించబోతున్నామని ప్రకటించారు. తాత్కాలికంగా ఈ కేంద్రానికి రూ. 41 కోట్లు, పూర్తి స్థాయి నిర్మాణానికి రూ.274 కోట్లు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని చెప్పారు. దేశీయంగా అభివృద్ధి చేస్తున్న కవచ్ టెక్నాలజీపై విస్తృత పరిశోధనలను ఈ కేంద్రం చేపడుతుందని తెలిపారు. రైల్వే పైలట్లు, టెక్నీషియన్లకు క్వాలిటీ శిక్షణ, విద్యాసంస్థలతో భాగస్వామ్యం ద్వారా ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు చేపడతారని తెలిపారు. కవచ్ టెక్నాలజీ అభివృద్ధికి చిన్న, మధ్య స్థాయి కంపెనీలకు అనుమతులు, రీసెర్చ్, డిజైన్, స్పెసిఫికేషన్లను పర్యవేక్షించే విధంగా వ్యవస్థ అమలులోకి రానుందని తెలిపారు.

అమెరికా, చైనా తర్వాత భారత్ ప్రపంచంలో మూడవ అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్ ఉన్న దేశంగా నిలిచిందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. కవచ్ టెక్నాలజీని ప్రపంచానికి ఆదర్శంగా నిలిచే విధంగా అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. రైల్వే సిగ్నలింగ్ వంటి అంశాల్లో ఇంజినీరింగ్ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ, సర్టిఫికేషన్ కోర్సులు అందించనున్నారు. కవచ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మహాత్మా గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (హైదరాబాద్), మదన్ మోహన్ మాలవీయ యూనివర్సిటీ (గోరఖ్పూర్), ఎంబీఎం యూనివర్సిటీ (జోధ్పూర్) సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుందని తెలిపారు. కాగా నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, ఇతర అభివృద్ధి చర్యలు కేంద్రం చేపడుతుందని వివరించారు. గత మూడున్నర సంవత్సరాల్లో 47 శాతం వృద్ధితో, దేశవ్యాప్తంగా ఐటీఐల సంఖ్య 14,600కి చేరుకుందని అన్నారు. ఇందులో 3,316 ప్రభుత్వ ఐటీఐలు ఉండగా, ఇవి 681 జిల్లాల్లో పనిచేస్తున్నాయని చెప్పారు. వికసిత భారత్ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఐటీఐల అప్‌గ్రేడేషన్‌కు రూ.60 వేల కోట్ల వ్యయంతో ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. ఈ క్రమంలో హైదరాబాద్, భువనేశ్వర్, చెన్నై, కాన్పూర్, లూథియానా వంటి ఐదు నగరాల్లో ట్రైనింగ్ సెంటర్లను కేంద్రం ఏర్పాటు చేయనుందని తెలిపారు.

మేడిగడ్డ కుంగిన కేసును సీబీఐకి అప్పగించాలి
మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిన కేసును సీబీఐకి అప్పగించాలని కిషన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్‌కు తన కూతురు కవిత రాసిన లేఖ విషయాన్ని ప్రాధాన్యతతో చూడాల్సిన అవసరం లేదని అన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ మునిగిపోతున్న నౌకలాంటిదని, ఇలాంటి పార్టీలో ఇలాంటి సంఘటనలు జరగడం సహజమని వ్యాఖ్యానించారు. దేశానికి కుటుంబ పార్టీలు ప్రమాదకరమని,ఈ పార్టీల వల్ల అనేక సమస్యలు ఏర్పడతాయని తెలిపారు. కుటుంబ పార్టీల్లో ప్రజల సంక్షేమం ఉండదని, ప్రజల కొంపలు ముంచే పార్టీలవే అని పేర్కొన్నారు. కెసిఆర్ గతంలో ఎప్పుడూ ప్రజాసంఘాలను, రైతు సంఘాలను, విద్యార్థి సంఘాలను, యువజన సంఘాలను, మహిళా సంఘాలను కలవలేదని అన్నారు. 2019లో కేంద్రమంత్రి అయిన తర్వాత కూడా ముఖ్యమంత్రి కేసీఆర్‌ను గౌరవంగా కలవాలనుకున్నా కానీ ఆయన అపాయింట్మెంట్ ఇవ్వలేదని కిషన్‌రెడ్డి గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో బీఆర్‌ఎస్ పార్టీకి భవిష్యత్తే లేదని అన్నారు. కవిత రాసిన లేఖలో తెలంగాణలో ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీనే ఉందని ప్రజలు అనుకుంటున్నట్లు ఆమె చెప్పిందని అన్నారు. ప్రజలు అనుకోవడం కాదు, బిజెపియే ప్రత్యాత్నాయమని ప్రజలు నమ్ముతున్నారని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News