బతుకమ్మకుంటకు కొత్త కళ పునరుద్ధరణతో కొత్త అందాలు
సెప్టెంబర్ నాటికి పూర్తి కానున్న పనులు
శిథిలమైన చెరువుకు హైడ్రా పునరుజ్జీవం
మోడల్ చెరువుగా అభివృద్ధికి ప్రణాళికలు
మన తెలంగాణ/సిటీ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ నగర నడిబొడ్డున ముళ్ల పొదలు, చెత్తవ్యర్థాలతో దర్శనమిచ్చే బతుకమ్మకుంట చెరువు కాస్త హైడ్రా చర్యలతో అందమైన చెరువుగా అభివృద్ద్ధి చెందినది. చెరువును పునరుద్ద్ధరణలో ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటూ.. చెరువును సుందరీకరించింది హైడ్రా. హైడ్రా చర్యలతో బతుకమ్మ కుంట చెరువు ఆహ్లాదకరమైన వాతావరణానికి కేంద్రంగా మారుతోంది. చెరువు పునరుజ్జీవన ప్రాజెక్టును ప్రారంభించడానికి ముందు ఫిబ్రవరి 2025 నాటికి బతుకమ్మకుంట గత కొన్నేండ్లుగా ఆక్రమణలు, ప్రభుత్వ విభాగాల నిర్లక్ష్యం కారణంగా శిథిలమైన చెరువుగా దర్శనమిస్తూ వచ్చింది. జూలై 7, 2025న ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే చెరువు ఒక సుందరమైన కొలనుగా అవతరించింది. చెరువు పునరుద్ధరణ పనులు పూర్తిస్థాయిలో హైడ్రా ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఈ సంవత్సరం ప్రారంభంలో పనులు మొదలుపెట్టిన హైడ్రా.. ముందుగా చెరువు ఆక్రమణలను తొలగించడం, పూడిక తీయడం, సహజ పర్యావరణ వ్యవస్థను పునరుద్ధరించడం ప్రారంభించింది. పునరుద్ద్ధరణ పనులు ప్రారంభ తవ్వకాలలో భూగర్భం నుండి కేవలం నాలుగు అడుగుల లోతున నీరు వెలువడింది.
ఇదీ బతుకమ్మ కుంట..
బతుకమ్మకుంట చెరువు శివం రోడ్, అంబర్‌పేట్ రోడ్ లమధ్య ఉంది. గ్రేటర్ హైదరాబాద్ నగరంలోని పురాతన సరస్సులలో ఇది ఒకటి. ఈ సరస్సును ప్రధానంగా స్థానికులు నీటిపారుదల, చేపలవేట కార్యకలాపాలకు, బతుకమ్మ నిమజ్జనానికి ఉపయోగించేవారు. రికార్డుల ప్రకారం, ఈ చెరువు 27 ఎకరాలలో విస్తరించి ఉంది భారీ ఆక్రమణలు, ల్యాండ్ షార్క్‌ల అక్రమ నిర్మాణాలు కారణంగా ఇప్పుడు ఈ చెరువు 7 ఎకరాల కంటే తక్కువకు తగ్గింది.
అందమైన సరస్సుగా..
వచ్చే సెప్టెంబర్, 2025 నాటికి బతుకమ్మ కుంట చెరువు పునరుద్ధరణను పూర్తి చేయాలని హైడ్రా నిర్ణయించినట్టు కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. ఫిబ్రవరి 2025లోని పరిస్థితులు చెరువు శిథిలావస్థకు చేరుకుందని వెల్లడించాయి. జూలై 7, 2025 నాటి పరిస్థితులు చెరువు అందాలను ప్రతిబింబిస్తున్నాయని హైడ్రా అధికారులు అభిప్రాయపడుతున్నారు. చెరువులోని పూడికతీత ప్రక్రియ, చెరువు కట్ట బలోపేతం చేయడం, ఇన్‌లెట్, ఔట్‌లేట్ ఏర్పాట్లు పకడ్బందిగా జరుగుతున్నట్టు అధికారులు వెల్లడిస్తున్నారు. చెరువు పునరుజ్జీవన ప్రయత్నాలు కేవలం అలంకారప్రాయంకాకుండా చెరువు సహజ పర్యావరణ వ్యవస్థను పునరుద్ధరించడం, మెరుగైన భూగర్భ జలాలను పెంచడం, కాలుష్యాన్ని నిరోధించడమే లక్ష్యంగా పనులు చేపట్టడం జరిగిందని కమిషనర్ రంగనాథ్ తెలిపారు. చెరువు చుట్టూ స్థానిక మొక్కల జాతులను తిరిగి పెంచడం, ప్రజల ఉపయోగం కోసం నడక మార్గాలు, గ్రీన్ జోన్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు అధికారులు వివరిస్తున్నారు. బతుకమ్మ కుంట ఒక పరిశుభ్రమైన నీటి వనరుగా మాత్రమే కాకుండా స్థానిక నివాసితులకు విహారం, పర్యావరణ హాట్‌స్పాట్‌గా కూడా ఉపయోగపడుతుందని హైడ్రా కమిషనర్ సూచన ప్రాయంగా వెల్లడించారు.
మోడల్ చెరువుగా..
ఆధునిక ఇంజనీరింగ్ వ్యవస్థతో పర్యావరణ సూత్రాల ద్వారా నిర్లక్ష్యం చేయబడిన సరస్సులను స్థిరమైన, సమాజానికి ప్రయోజనకర ప్రదేశాలుగా మార్చడం హైడ్రా లక్షమని రంగనాథ్ పేర్కొన్నారు. పట్టణ వరదలు తగ్గడంలోనూ, నగర ప్రజలకు నీటి కొరతను తీర్చడంలోనూ చెరువులు కీలక పాత్ర పోషిస్తాయని హైడ్రా భావిస్తున్నట్టు అధికారులు వెల్లడిస్తున్నారు. బతుకమ్మ కుంట హైదరాబాద్ పట్టణ పరిరక్షణ ప్రయత్నాలలో ఆశాకిరణంగా నిలుస్తుందనీ, ఈ ప్రాజెక్ట్ షెడ్యూల్ ప్రకారం కొనసాగితే, ఇది త్వరలో రాష్ట్రమంతటా చెరువు పునరుజ్జీవన ప్రయత్నాలకు ఒక నమూనాగా మారుతుందని కమిషనర్ రంగనాథ్ అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు.