మనతెలంగాణ సిటీ బ్యూరో: జూబ్లీహిల్స్ చెక్‌పోస్టుకు చేరువలోని ప్రధాన రహదారికి ఆనుకుని, ఆక్రమణలకు గురైన 2,000 చ.గ.ల భూమిని కాపాడినట్టు హైడ్రా అధికారులు వెల్లడించారు. మార్కెట్‌లో ఈ భూమి విలువ సుమారు రూ.100 కోట్లుగా ఉంటుందని హైడ్రా పేర్కొన్నది. గత రెండు దశాబ్థాలుగా అక్రమార్కుల చేతిలో కబ్జా అయిన భూమికి హైడ్రా సోమవారం విముక్తి కల్పించింది. జూబ్లీహిల్స్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి సంబంధించిన ఈ భూమి లేఅవుట్ ప్రకారం ప్రజావసరాలకు ఉద్దేశించిందని హైడ్రా తెలిపింది. పిల్లా సత్యనారాయణ వ్యక్తి ఆ భూమిని ఆక్రమించి, ఫేక్ ఇంటి నెంబర్ క్రియేట్‌చేసి అందులో నర్సరీ నడుతున్నాడనీ, ఆయనపై జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్‌లో కేసు కూడా నమోదైనట్టు హైద్రా అధికారులు వివరించారు. ఆ భూమిని జీహెచ్‌ఎంసి పలుమార్లు స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేసింది. ఆక్రమణకు పాల్పడిన సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించాడు. కోర్టును కూడా తెచ్చుకున్నాడు. స్టేటస్‌కో ఉంటుండగా అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదు. నర్సరీ నడపరాదు. కానీ, అక్కడ అనుమతిలేని పెడ్డుల నిర్మాణాలు, నర్సరీ వ్యాపారాన్ని నిర్వహించారు.
ప్రజావాణిలో ఫిర్యదు మేరకు..
జూబ్లీహిల్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ ఈ అవకతవకలపై హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేసింది. హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ఆదేశాలతో హైడ్రా అధికారులు పూర్తిస్థాయి విచారణ చేపట్టారు. లేఅఔట్ ప్రకారం ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలంగా నిర్ధారించారు. నర్సరీ నడుపుతున్న సత్యనారాయణకు నోటీసులు హైడ్రా ఇచ్చింది. ఈ నోటీసులపై తిరిగి హైకోర్టును ఆశ్రయించిన సత్యనారాయణకు అక్కడ చుక్కెదురైంది. గతంలో ఉన్న స్టేటస్‌కోను కూడా కొట్టేసి.. హైడ్రా తీసుకోబోయే చర్యలకు హైకోర్టు ఆనుమతినిచ్చిందని హైడ్రా అధికారులు తెలిపారు. కోర్టు ఆదేశాలతో సోమవారం ఉదయం జూబ్లీహిల్స్‌లో కూల్చివేతలను హైడ్రా చేపట్టింది. నర్సరీలో మొక్కలను తరలించుకునేందుకు అవకాశం ఇచ్చి అక్కడ పెద్దలతో పాటు ఆక్రమణలను తొలగించింది. 2.000 చ.గ.ల స్థలంలో హైడ్రా కాపాడినట్టు పేర్కొంటూ బోర్డులను హైడ్రా ఏర్పాటు చేసింది. జూబ్లీహిల్స్ కోఆపరేటవి హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు రవీంద్రనాథ్‌తో పాటు పాలక మండలి సభ్యులు సంతోషం వ్యక్తంచేశారు. సుదీర్ఘంగా తాము చేస్తున్న న్యాయ పోరాటం ఫలించిందని వారు పేర్కొన్నారు. రూ. 100 కోట్ల విలువచేసే భూమిని కబ్జాదారుల నుండి విడిపించినందుకు తెలంగాణ ప్రభుత్వానికి హైడ్రా కమిషనర్ రంగనాథ్‌తో పాటు జీహెచ్‌ఎంసి అధికారులకు సొసైటీ ప్రతినిధులు, పాలకమండలి సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.