మాంచెస్టర్: ఓల్డ్ ట్రాఫర్డ్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టు వైస్ కెప్టెన్, వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్‌కు (Rishabh Pant) తీవ్ర గాయమైన విషయం తెలిసిందే. తరచూ వినూత్న షాట్లు ఆడేందుకు ప్రయత్నించే పంత్ ఈ మ్యాచ్‌లోనూ రివర్స్ స్వీప్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ, బంతి బ్యాట్ ఎడ్జ్‌కి తగిలి కుడి కాలి పాదానికి బలంగా తగిలింది. దీంతో పంత్ గాయంతో అవస్థ పడ్డాడు. గోల్ఫ్ కార్ట్‌లో అతన్ని మైదానం నుంచి తీసుకువెళ్లారు. అయితే ఇప్పుడు పంత్‌కు గాయం కావడంతో భారత అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్న పంత్ జట్టుకు అందుబాటులో లేకుంటే తీవ్ర నష్టాన్ని ఎదురుకోవాల్సి ఉంటుంది.
తాజాగా పంత్ (Rishabh Pant) గాయంపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ స్పందించారు. రిషబ్ పంత్ కాలుకు వాపు రావడం తనకు ఆందోళన కలిగించిందని పేర్కొన్నారు. గతంలో తనకు ఇలాంటి గాయం అయిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. పాదంలో చిన్న చిన్న పెళుసుగా ఉండే ఎముకలు ఉంటాయని.. బంతి బలంగా తగలడంతో ఒకటి, రెండు ఎముకలు విరిగిపోయాయని తెలిపారు. అలా జరిగిన పరిస్థితిలో కాలు కింద పెట్టడం కూడా కష్టంగా ఉంటుందని అన్నారు. అదే జరిగితే పంత్ ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ రావడం కష్టమే అని.. ఒకవేళ వచ్చిన రివర్స్ స్వీప్ వంటి షాట్‌లు ఆడడని తాను ఆశిస్తున్నట్లు పాంటింగ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.