హైదరాబాద్: తెలుగు సినీ పరిశ్రమలో తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలపై నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) స్పందించారు. రెండు రోజులుగా ‘ఆ నలుగురు’ అంటూ వార్తలు వచ్చాయని.. వారి కబంధ హస్తల్లో ఇండస్ట్రీ ఉన్నట్లు చిత్రీకరించారని.. కానీ ఆ నలుగురికి తనకు ఎలాంటి సంబంధం లేదని ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో అల్లు అరవింద్ అన్నారు. ఈ ‘ఆ నలుగురు’ అనే మాట 15 ఏళ్ల క్రితం ప్రారంభమైందని.. నలుగురు కాస్త.. ఇప్పుడు పది మంది అయ్యారని అన్నారు. అది ఎవరూ పట్టించుకోవట్లేదని పేర్కొన్నారు. ‘ఆ నలుగురి’ నుంచి తాను ఎప్పుడో బయటకు వచ్చానని.. తెలంగాణలో తనకు కేవలం ఒకే థియేటర్ ఉందని, తెలుగు రాష్ట్రాల్లో మొత్తం కలిపి 15 థియేటర్లు ఉన్నాయని తెలిపారు. లీజ్ పూర్తయిన తర్వాత వాటిని రెన్యువల్ చేయవద్దని తన స్టాప్ చెబుతుంటానని అన్నారు.
50 ఏళ్లుగా సినిమాలు నిర్మించడమే ఆయన వృత్తి అని అల్లు అరవింద్ (Allu Aravind) తెలిపారు. థియేటర్లు మూసివేస్తామని ఎగ్జిబిటర్లు తీసుకున్న నిర్ణయంపై ఎపి సినిమాటోగ్రాఫీ మంత్రి కుందుల దుర్గేశ్ స్పందన కరెక్ట్ అని అన్నారు. తాజాగా జరిగిన ఏ సమావేశానికి తాను వెళ్లలేదని.. ‘గీతా ఆర్ట్స్’కి సంబంధించిన డిస్ట్రిబ్యూటర్లు, అసోసియేటెడ్ ప్రొడ్యూసర్‌లని కూడా వెళ్లవద్దని చెప్పినట్లు తెలిపారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లు కష్టాల్లో ఉన్నాయని.. యజమానులు ఫిల్మ్ ఛాంబర్, ఫ్రొడ్యూసర్ గిల్డ్ సంప్రదించాలని సూచించారు. పవన్‌కళ్యాణ్ సినిమా వస్తున్న సమయంలో థియేటర్లు మూసివేస్తా అనే నిర్ణయం దుస్సాహసమే అని అరవింద్ పేర్కొన్నారు.
ఇండస్ట్రీ నుంచి వెళ్లి పోరాడుతున్న వ్యక్తి పవన్‌కళ్యాణ్ అని.. డిప్యూటీ సిఎం పవన్, సిఎం చంద్రబాబు కలుద్దాం అని పేర్కొన్నారు. కానీ ఛాంబర్ వాళ్లు ఎవరూ వెళ్లలేదు. ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక కలిసి వెళ్లాలి కదా ఎవరూ వెళ్లలేదని అన్నారు.