హైదరాబాద్: ‘లక్కీ భాస్కర్’ చిత్రం సక్సెస్ తర్వాత దర్శకుడు వెంకీ అట్లూరి (Venky Atluri) కోలీవుడ్ స్టార్ సూర్యతో సినిమా చేస్తున్నారు. సూర్య 46 అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా రూపొందుతోంది. తాజాగా వెంకీ అట్లూరి ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర అంశాలు అభిమానులతో పంచుకున్నారు. లక్కీ భాస్కర్ సినిమాకు సీక్వెల్‌ను కచ్చితంగా రూపొందిస్తానని వెంకీ తెలిపారు. లక్కీ భాస్కర్ సక్సెస్ తర్వాత పలువురు నిర్మాతలు బయోపిక్స్ చేయమని సంప్రదించారని.. కానీ, బయోపిక్స్ చేయడం తనకు ఇష్టం లేదని అన్నారు. థ్రిల్లర్, పీరియాడిక్ కథలు రూపొందించాలనే ఆసక్తి కూడా లేదని స్పష్టం చేశారు. కుటుంబం మొత్తం కలిసి కూర్చొని చూసేలా అందమైన కుటుంబ కథ చిత్రాలు చేయాలని అనిపించిందని.. అందుకు అనుగుణంగా సినిమా చేస్తున్నా అని వెంకీ స్పష్టం చేశారు.
సూర్యకు రెండు, మూడు కథలు చెబితే.. అందులో ఒకటి ఆయన ఒప్పుకున్నారని వెంకీ (Venky Atluri) అన్నారు. సూర్యకు తాను వీరాభిమానిని అని తెలిపారు. తాను సూర్యతో చేస్తున్న సినిమా పూర్తి కుటుంబ కథ చిత్రమన్నారు. వచ్చే ఏడాది వేసవికి ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో విడుదలయ్యే అవకాశం ఉంది. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మమితా బైజు ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. రవీనా టండన్, రాధిక కీలక పాత్రలు పోషిస్తున్నారు.