టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్‌మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లీ (Virat Kohli).. ప్రస్తుతం దొరికి ఖాళీ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. తాజాగా లండన్‌లోని సెంటర్ కోర్టులో జకోవిచ్, అలెక్స్ డి మినార్ మధ్య జరిగిన వింబుల్డన్ మ్యాచ్‌లో భార్య అనుష్కతో కలిసి వీక్షించాడు. ఈ సందర్భంగా అతను పలు కీలక వ్యాఖ్యలు చేశాడు. క్రికెట్ కంటే వింబుల్డన్‌లో ఆటగాళ్లకు ఒత్తిడి ఎక్కువ ఉంటుందని పేర్కొన్నాడు. ఇండియా పాకిస్థాన్ మధ్య జరిగే మ్యాచ్‌లో ఎంత ఒత్తిడి ఉంటుందో.. వింబుల్డన్‌లో ప్రతీ మ్యాచ్‌లో అంత ఒత్తిడి ఉంటుందని పేర్కొన్నాడు.
ఓ స్పోర్ట్స్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కోహ్లీ (Virat Kohli) మాట్లాడుతూ.. ‘‘క్రికెట్‌లో ప్రేక్షకులు ఆటగాళ్లకు దూరంగా ఉంటారు. కేవలం బౌండరీ దగ్గర ఫీల్డింగ్ చేసే వాళ్లకే దగ్గరగా ఉంటారు. వింబుల్డన్‌లో ప్రేక్షకులు చాలా చేరువగా ఉంటారు. వాళ్లకు ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. అందుకే నాకు టెన్నిస్ ఆటగాళ్లంటే అపారమైన గౌరవం. వాళ్లు శారీరకంగా, మానసికంగా తమ ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడం చాలా గ్రేట్. ప్రపంచకప్‌లో ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ జరిగినప్పుడు కాళ్లు వణికేంత ఒత్తిడి ఉంటుంది. కానీ, టెన్నిస్‌లో క్వార్టర్ ఫైనల్ నుంచి ఫైనల్ వరకూ అదే రకమైన ఒత్తిడిని ఎదురుకుంటారు’’ అని కోహ్లీ పేర్కొన్నాడు.